
మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ హీరోగా జాగర్లమూడి రాధాకృష్ణ(క్రిష్) దర్శకత్వంలో తెరకేక్కబోయే సినిమా ముహూర్త కార్యక్రమం ఫిబ్రవరి 27న జరుగుతుందని 123తెలుగు.కామ్ గతంలో తెలియజేసింది. రాజీవ్ రెడ్డి ఈ సినిమాకు నిర్మాత. తాజాగా ఈ సినిమాకు సంబంధించి మరో ఆసక్తికరమైన అంశం వెలుగులోకి వచ్చింది.
రెండవ ప్రపంచ యుద్ధ నేపధ్యంలో ఈ సినిమా కథ ఉంటుందట. పీరియాడికల్ డ్రామాగా రూపొందబోయే ఈ సినిమాలో వరుణ్ తేజ్ ఇండియన్ ఆర్మీ సోల్జర్ గా నటిస్తున్నాడని ఫిల్మ్ నగర్ టాక్. ఈ సినిమాకు ‘కంచె’ అనే టైటిల్ పరిశీలనలో ఉందట. ఈ వార్తలు నిజమో..? కాదో..? త్వరలోనే తెలుస్తుంది.
క్రిష్ దర్శకత్వం తీసిన ప్రతి సినిమాలో ఓ సందేశం ఇవ్వడానికి ప్రయత్నించాడు. ఆర్టిస్టుల నుండి అత్యుత్తమ నటన రాబట్టడంతో పాటు బలమైన కథ, కథనాలు ఉండేలా చూసుకుంటాడు. అందువల్ల అభిమానులలో ఈ సినిమాపై అంచనాలు ఏర్పడ్డాయి.