ఈ `మిస్ మ్యాచ్‌` పెద్ద స‌క్సెస్ కావాలి – వెంకటేష్

ఈ `మిస్ మ్యాచ్‌` పెద్ద స‌క్సెస్ కావాలి – వెంకటేష్

Published on Dec 3, 2019 3:47 PM IST

ఉద‌య్ శంక‌ర్‌, ఐశ్వ‌ర్యా రాజేష్ హీరో హీరోయిన్లుగా అధిరోహ్ క్రియేటివ్ సైన్స్ ఎల్.ఎల్.పి బ్యాన‌ర్‌పై ఎన్ వి. నిర్మల్ ద‌ర్శ‌క‌త్వంలో జి.శ్రీరామ్ రాజు, భరత్ రామ్ నిర్మిస్తోన్న చిత్రం `మిస్ మ్యాచ్‌`. డిసెంబ‌ర్ 6న సినిమా విడుద‌ల‌వుతుంది. ఈ సంద‌ర్భంగా సోమ‌వారం జ‌రిగిన ప్రీ రిలీజ్ ఈవెంట్‌కు తెలంగాణ ఆర్థిక శాఖా మంత్రి హ‌రీశ్‌రావు, స్టార్ హీరో విక్ట‌రీ వెంక‌టేశ్ ముఖ్య అతిథులుగా హాజ‌ర‌యి బిగ్‌సీడీని విడుద‌ల చేశారు. అలాగే బిగ్ టికెట్‌ను కూడా విక్ట‌రీ వెంకటేశ్ లాంచ్ చేశారు.

ఈ సంద‌ర్భంగా..తెలంగాణ ఆర్థిక శాఖా మంత్రి హ‌రీశ్‌రావు మాట్లాడుతూ – “శ్రీరాంగారిపై ఉన్న గౌర‌వంతో నేను ఇక్క‌డ‌కు వ‌చ్చాను. ఇప్పుడు సినిమాల్లో కొత్త భావ‌న‌లు చోటు చేసుకుంటున్నాయి. కొత్త కొత్త ఆలోచ‌న‌ల‌తో, కొత్త క‌థ‌ల‌తో, కొత్త ద‌ర్శ‌కులు, న‌టీన‌టులు అద్భుత‌మైన విజ‌యాల‌ను సాధిస్తున్నారు. ‘మిస్ మ్యాచ్’ కూడా అదే కోవ‌లో క‌న‌ప‌డుతుంది. స్పోర్ట్స్ బ్యాక్‌డ్రాప్‌లో సాగే ప్రేమ‌క‌థా చిత్ర‌మిద‌ని నాకు అర్థ‌మైంది. ఓ ప్రేమికురాలి విజ‌యం కోసం ప్రేమికుడు ప‌డే త‌ప‌న‌ను చూపించే చిత్ర‌మిది. మంచి మెసేజ్ ఓరియెంటెడ్ చిత్ర‌మ‌ని అర్థ‌మ‌వుతుంది. ప్రేమ మ‌నిషిని విజ‌యం ప‌థం వైపు న‌డిపించాలి. అలా పాజిటివ్ డైరెక్ష‌న్‌లో ఉండాలే కానీ.. వికృత రూపం తీసుకోకూడ‌దు. ఉద‌య్‌శంక‌ర్ 15 సంవ‌త్స‌రాల వ‌య‌సులోనే గిన్నిస్ బుక్ రికార్డ్ హోల్డ‌ర్‌. నిజ జీవితంలోలాగానే తెలివైన ఐఐటీ స్టూడెంట్‌గా యాక్ట్ చేశాడు. సినిమాల్లో మంచి సందేశం ఉండాలి. సినిమాల‌తో గౌర‌వం పెర‌గాలి. వ్య‌క్తిత్వం ప్ర‌తిబింబించేలా సినిమాలుండాలి. మ‌హిళ‌ల గౌర‌వం పెరిగేలా సినిమాలుండాలి. అలాంటి ఓ మంచి సినిమా ఇదని అర్థ‌మ‌వుతుంది. `మిస్ మ్యాచ్` స‌మాజంతో మ్యాచ్ కావాలని, మంచి విజ‌యాన్ని సాధించాల‌ని కోరుకుంటున్నాను“ అన్నారు.

విక్ట‌రీ వెంక‌టేశ్ మాట్లాడుతూ – “ఈ సినిమాలో ప‌నిచేసిన ప్ర‌తి ఒక ఆర్టిస్ట్‌, టెక్నీషియ‌న్ నా హృద‌యానికి ఎంతో ద‌గ్గ‌రైనవారు. వారంద‌రికీ ఆల్ ది బెస్ట్‌. ఉద‌య్‌శంక‌ర్ గురించి చెప్పాలంటే త‌న తొలి చిత్రం ఆట‌గ‌ద‌రా శివ‌లో అద్భ‌తుంగా న‌టించాడు. ఇప్పుడు ‘మిస్ మ్యాచ్‌’లో మ‌రో అద్భుత‌మైన పాత్ర‌లో న‌టించాడు. త‌న రియ‌ల్ లైఫ్ క్యారెక్ట‌ర్‌కి ద‌గ్గ‌రైన పాత్ర‌. త‌ను 15ఏళ్ల వ‌య‌సులో గిన్నిస్ బుక్ రికార్డ్ సాధించ‌డం గొప్ప విష‌యం. త‌ను హీరోగా చేసిన ఈ సినిమా మంచి విజ‌యాన్ని సాధించాలి. ఐశ్వ‌ర్యారాజేష్ మ‌రో అద్భుత‌మైన పాత్ర‌లో న‌టించింది. త‌న‌కు కూడా అభినంద‌న‌లు. నిర్మాత‌లు భ‌ర‌త్‌, శ్రీరామ్‌కు అభినంద‌న‌లు. భూప‌తిరాజాగారు వండ‌ర్‌ఫుల్ స్క్రిప్ట్‌ను అందించారని అర్థ‌మ‌వుతుంది. అమ్మాయిలు ఉన్న‌త‌స్థాయికి ఎదిగే స్క్రిప్ట్స్‌ను నేను బాగా ఇష్ట‌ప‌డ‌తాను. రాజా, సూర్య‌వంశం వంటి అలాంటి సినిమాల్లో నేను కూడా న‌టించాను. ఈ సినిమాకు సంబంధించిన స‌న్నివేశాలు చూశాను. త‌ప్ప‌కుండా పెద్ద స‌క్సెస్ కావాల‌ని కోరుకుంటున్నాను. డైరెక్ట‌ర్ నిర్మ‌ల్ కుమార్ టాలెంటెడ్ డైరెక్ట‌ర్‌. డిసెంబ‌ర్ 6న విడుద‌ల‌వుతున్న ఈ సినిమా పెద్ద స‌క్సెస్ కావాల‌ని కోరుకుంటున్నాను“ అన్నారు.

నిర్మాత‌లు జి.శ్రీరామ్ రాజు, భరత్ రామ్ మాట్లాడుతూ – “ మంచి క‌థ‌తో రూపొందించిన చిత్రమిది. డిసెంబ‌ర్ 6న విడుద‌ల‌వుతున్న ఈ చిత్రం అంద‌రికీ న‌చ్చేలా ఉంటుంది“ అన్నారు. ఈ చిత్రం లోని ఇతర ప్రధాన పాత్రలలో సంజయ్ స్వరూప్, ప్రదీప్ రావత్, రూపాలక్ష్మి తదితరులు నటిస్తున్నారు. ఈ చిత్రానికి సంగీతం: గిఫ్టన్ ఇలియాస్, కధ: భూపతి రాజా, మాటలు: రాజేంద్రకుమార్, మధు; ఛాయా గ్రహణం: గణేష్ చంద్ర; పాటలు: సిరివెన్నెల సీతారామ శాస్త్రి, సుద్దాల అశోక్ తేజ; కళా దర్శకుడు: మణి వాసగం, నిర్మాతలు జి.శ్రీరామ్ రాజు, భరత్ రామ్, దర్శకుడు. ఎన్.వి.నిర్మల్ కుమార్ .

సంబంధిత సమాచారం

తాజా వార్తలు