ఓటీటీ వేదిక : ఈటీవీ విన్
ఓటీటీ స్ట్రీమింగ్ తేదీ : మే 24, 2026
123తెలుగు.కామ్ రేటింగ్ : 3/5
నటీనటులు : వెంకటేష్ మహా, కిరీటి, ఉద్విత హర్ష, మాస్టర్ ఆరవ్ రేవతి తదితరులు
దర్శకత్వం : శశాంక్ పోశింశెట్టి
నిర్మాతలు : రాహుల్ తమడా, సందీప్ రెడ్డి బొర్రా
సంగీతం : జే వి సుధాన్షు
ఛాయాగ్రహణం : శ్రీవత్స గొర్ల
కూర్పు : సృజన్ శర్మ కపిల
సంబంధిత లింక్స్ : ట్రైలర్
ఈ వారం మన తెలుగు స్ట్రీమింగ్ యాప్ ఈటీవీ విన్ లో రిలీజ్ కి వచ్చిన లేటెస్ట్ లఘు చిత్రమే ‘కాలనీ సర్కస్’. కథా సుధలో ప్రసారం అవుతున్న వీక్లీ సినిమాల్లో భాగంగా వచ్చిన ఈ లఘు చిత్రం ఎలా ఉందో సమీక్షలో చూద్దాం రండి.
కథ:
1996 సమయంలో కాకినాడలోని ఓ కాలనీలో ఈ కథ సెటప్ చేయబడింది. అక్కడ లెక్కల మాస్టర్ గా పని చేసే సూర్య నారాయణ (వెంకటేష్ మహా) తను అందరితో ఎంతో మర్యాదపూర్వకంగా నడుకుంటాడు అలానే తనకి కూడా గౌరవం కోరుకుంటాడు. అయితే వారి ఊర్లో ఉండే ఒకే ఒక్క టీవీ చూసే చోట తనకి గోవింద రాజు (కిరీటి) వల్ల చిన్నపాటి అవమానం జరుగుతుంది. దీనితో తన ఊరిలో అందరి దగ్గర తనకి గౌరవం పెరగాలని ఒక కలర్ టీవీ కొనెయ్యాలని డిసైడ్ అయ్యి తన భార్య అన్నపూర్ణ (ఉద్విత హర్ష), కొడుకు (మాస్టర్ ఆరవ్) ల నుంచి తాను ఇచ్చిన డబ్బులనే తీసుకొని టీవీ కొనేసి తెస్తాడు. కానీ ఇక్కడే అసలు సమస్య మొదలవుతుంది. ఆ టీవీలో కొన్ని ప్రోగ్రామ్స్ చూడడానికి పిల్లలు, మగవాళ్ళు, ఆడవాళ్ళకి నడుమ పోటీ పరిస్థితి నెలకొంటుంది. మరి ఈ పందెంలో ఎవరు గెలిచారు? చివరికి టీవీ లో నచ్చిన ప్రోగ్రాంని చూసారా లేదా ఆఖరికి ఏమైంది అనేది తెలియాలి అంటే ఈటీవీ విన్ లో ఈ సినిమా చూడాల్సిందే.
ప్లస్ పాయింట్స్:
ఇది వరకే 90స్ బ్యాక్ డ్రాప్ లో చాలానే సినిమాలు సిరీస్ లు కూడా వచ్చాయి. వాటిలానే ఇది కూడా మరో డీసెంట్ అటెంప్ట్ అని చెప్పొచ్చు. 1996 సమయంలో కాకినాడ పరిస్థితులు మెయిన్ గా ఆ మూడ్ లోకి దర్శకుడు తీసుకెళ్లాడు. క్లీన్ సెటప్ తో అప్పటి పరిస్థితులు, పాత్రల నడుమ సందర్భాలు క్రియేట్ చేసి మ్యాజిక్ చేసాడని చెప్పొచ్చు. అలానే ఇందులో మంచి ఎంటర్టైన్మెంట్ కూడా బాగుంది.
ఇక నటీనటుల్లో వెంకటేష్ మహా నుంచి మరో ఇంప్రెసివ్ రోల్ అండ్ పెర్ఫామెన్స్ ఇది అని చెప్పొచ్చు. దర్శకునిగా తనలో ఎంత వైవిధ్యతని తాను చూపించాడో నటుడుగా కూడా అదే రీతిలో ఇంట్రెస్టింగ్ పాత్రలు తాను ఎంపిక చేసుకోవడానికి ఇందులో సూర్య నారాయణ పాత్ర కూడా ఒక నిదర్శనం.
అలాగే తన భార్య పాత్రలో చేసిన ఉద్విత హర్ష కూడా చాలా బాగా చేశారు. తాను చేసే వింత వింత వంటలు కథనంలో నవ్వు తెప్పిస్తాయి. అలానే వీరి కొడుకుగా నటించిన మాస్టర్ ఆరవ్ కూడా కాన్ఫిడెంట్ గా నటించాడు. ఇక కిరీటి ఎప్పటిలానే తన మార్క్ ఈజ్ పెర్ఫామెన్స్ తో తన రోల్ ని రక్తి కట్టించాడు. వీరితో పాటుగా ఇతర నటీనటులు కూడా బాగా చేశారు.
మైనస్ పాయింట్స్:
అదేంటో ఈ మధ్య కాలంలోనే ఈ 90స్ బ్యాక్ డ్రాప్ లో అది కూడా ‘టీవీ’ కీలక అంశంగా వరుసగా వస్తున్నాయి. మొన్నామధ్య తిమ్మరాజుపల్లి టీవీ, తర్వాత దూరదర్శని ఇప్పుడు కాలనీ సర్కస్ ఇలా సినిమాలని బాగా రెగ్యులర్ గా ఫాలో అయ్యే వారికి ఇందులో కాన్సెప్ట్ రొటీన్ ఫీల్ కలిగించవచ్చు.
అలాగే 96 సమయంలో ప్లాన్ చేసింది కాబట్టి ఒక్క టీవీ వరకు మాత్రమే కాకుండా మరికొన్ని నోస్టాల్జిక్ మూమెంట్స్ ని కూడా యాడ్ చేసి ఉంటే ఆడియెన్స్ ని మరింత మెస్మరైజ్ చేసేది ఈ లఘు చిత్రం.
సాంకేతిక వర్గం:
ఈ లఘు చిత్రంలో నిర్మాణ విలువలు డీసెంట్ అని చెప్పొచ్చు. మొత్తం వింటేజ్ సెటప్ కి తగ్గట్టుగా అన్ని వర్గాల్లో సాంకేతిక నిపుణులు మంచి వర్క్ అందించారు. కెమెరా వర్క్ గాని సంగీతం అలాగే ఎడిటింగ్ లు కూడా ఒక చక్కటి అవుట్ పుట్ ని అందించాయి.
ఇక దర్శకుడు శశాంక్ పోశింశెట్టి విషయానికి వస్తే.. తాను రీసెంట్ 90స్ బ్యాక్ డ్రాప్ ట్రెండ్ ని ఫాలో అవుతూ ఫ్యామిలీ ఆడియెన్స్, పిల్లలు 90స్ ప్రేక్షకులకి కనెక్ట్ అయ్యే సెటప్ ని ప్లాన్ చేసుకొని దానిని నీట్ గా ప్రెజెంట్ చేసే ప్రయత్నం చేశారు. కొంతమేర రెగ్యులర్ అంశాలు పక్కన పెడితే తన వర్క్ ఈ లఘు చిత్రానికి బాగుంది. ఇంకొంచెం నోస్టాల్జిక్ మూమెంట్స్ డోస్ ని కూడా యాడ్ చేసి ఉంటే మరింత బాగుండేది.
తీర్పు:
ఇక మొత్తంగా చూసుకున్నట్టయితే ఈ ‘కాలనీ సర్కస్’ అనేది 90స్ నేపథ్యంలో వచ్చిన మరో డీసెంట్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ అని చెప్పొచ్చు. ఒక్క వెంకటేష్ మహా మాత్రమే కాకుండా మిగతా తారాగణం అంతా ఈ లఘు చిత్రంలో మంచి పెర్ఫామెన్స్ లు అందించారు. అలాగే దర్శకుడు పనితనం కూడా ఇందులో డీసెంట్ గా అనిపిస్తుంది. కాకపోతే ఇంకా మంచి మంచి మూమెంట్స్ ని యాడ్ చేసి ఉంటే మరింత బాగుండేది. అలాగే కథా సుధలో ఇదో డిఫరెంట్ అటెంప్ట్ అని కూడా అనుకోవచ్చు. సో ఈ లఘు చిత్రాన్ని ఈటీవీ లో ట్రై చెయ్యండి.
123telugu.com Rating: 3/5
Reviewed by 123telugu Team


