‘కాశి’ విజయ్ ఆంటోనీకి మరో ‘బిచ్చగాడు’ అవుతుందా ?
Published on May 17, 2018 12:22 pm IST

2016లో తమిళంలో విజయ్ ఆంటోనీ హీరోగా నటించిన ‘పిచ్చాయ్ కారన్’ సినిమా తెలుగులో ‘బిచ్చగాడు’ పేరుతో రిలీజ్ అయింది. ఎలాంటి అంచనాలు లేకుండా విడుదలైన ఈ చిత్రం భారీ వసూళ్లను సాధించి సంచలన విజయం అందుకుంది. ఈ సినిమాతో తెలుగులో విజయ్ మంచి మార్కెట్ ను సంపాందించుకున్నాడు. ఈ సినిమా తరువాత విజయ్ ఆంటోనీ నటించిన తమిళ అనువాద చిత్రాలు ‘భేతాళుడు, ఇంద్రసేనా’ సినిమాలు రిలీజ్ అయినా పెద్దగా విజయం సాధించలేకపోయాయి. మళ్లీ ఇప్పుడు విజయ్ ఆంటోనీ తన కొత్త చిత్రంతో తెలుగు ప్రేకక్షకుల ముందుకు రాబోతున్నాడు.

ఆయన నటించిన తాజా చిత్రం ‘కాళి’ తెలుగులో ‘కాశి’ పేరుతో విడుదలకానుంది. ఈ చిత్రాన్ని కిరుతిగ ఉదయనిధి డైరెక్ట్ చేశారు. ఫాలిమా ఫిలిమ్ కార్పొరేషన్ బ్యానర్ పై విజయ్ఆంటోని ఈ చిత్రాన్ని నిర్మించడమే కాకుండా సంగీతాన్ని కూడా అందించారు. ఈ సినిమాలో విజయ్ సరసన అంజలి , సునయన కథానాయికలుగా నటించారు.

ఈ చిత్రాన్ని లెజండ్ సినిమా పతాకంపై ఉదయ్ హర్ష వడ్డెల, గణేష్ పెనుబోతు, ప్రధ్యుమ్న చంద్రపతి తెలుగులో విడుదల చేస్తున్నారు. భారీ పోటీ నడుమ అత్యధిక మొత్తం చెల్లించి ఈ చిత్రాన్ని దక్కించుకొన్నారు సమర్పకులు. మరి రేపే విడుదలకానున్న ఈ చిత్రం విజయ్ ఆంటోనికి మరో ‘బిచ్చగాడు’ అవుతుందో లేదో చూడాలి.

 
Like us on Facebook