సినిమాకి మంచి ఓపెనింగ్స్ ఇవ్వనున్న విజయ్ క్రేజ్ !

26th, February 2017 - 07:19:22 PM


2016 వ సంవత్సరంలో విడుదలై బాగా గుర్తుండిపోయిన చిత్రాల్లో ‘పెళ్లిచూపులు’ కూడా ఒకటి. ఈ చిత్రం సాధించిన విజయం సామాన్యమైనది కాదు. ఈ విజయంతో అందులో నటించిన హీరో హీరోయిన్లు, ఇతర నటీనటులు, సాంకేతిక నిపుణుల కెరీర్లు బ్రహ్మాండమైన మలుపు తిరిగాయి. ముఖ్యంగా హీరోగా చేసిన విజయ్ దేవరకొండ అయితే హాట్ స్టార్లా మారిపోయాడు. వరుస ఆఫర్లు ఆయన్ను ముంచెత్తాయి. ‘పెళ్లి చూపులు’ సినిమా కంటే ముందే చిత్రీకరణ పూర్తి చేసుకుని, రేపు మార్చి 3న రిలీజ్ కానున్న ‘ద్వారక’ కూడా విజయ్ క్రేజ్ మూలంగా మంచి ఓపెనింగ్స్ రాబట్టే అవకాశముంది.

ప్రస్తుతం విజయ్ దేవరకొండ అంటే తెలుగు సినీ ప్రేక్షకుల్లో ఒకలాంటి క్యూరియాసిటీ ఉంది. హీరోగా మొదటి సినిమాతోనే అమితంగా ఆకట్టుకున్న ఆయన నెక్స్ట్ సినిమాలో ఎలా నటిస్తారో చూడాలనే ఆసక్తితో ఉన్న ప్రేక్షకులకు అసలు ఆయన హీరోగా చేసిన మొదటి చిత్రం ఇప్పుడు రిలీజ్ కావొస్తోందని తెలియడంతో ఆ ఉత్సుకత మరింత పెరిగి ‘ద్వారక’ సినిమాకు లాభించేలా కనిపిస్తోంది. ఇక ఈ సినిమాతో దర్శకుడిగా పరిచయమవుతున్న శ్రీనివాస్ రవీంద్ర కూడా ఇందులో విజయ్ భిన్న కోణాల్లో కనిపిస్తారని చెప్పారు. మరి విజయ్ పై ప్రేక్షకుల్లో ఉన్న క్యూరియాసిటీ ‘ద్వారక’ చిత్రానికి ఎంతపాటి ఓపెనింగ్స్ తీసుకొస్తుందో చూడాలి.