ఒకప్పుడు హైదరాబాద్ కి మాత్రమే పరిమితమైన తెలుగు చిత్ర పరిశ్రమ ప్రచార వేడుక కార్యక్రమాలు నెమ్మదిగా ఇతర నగరాలకు వ్యాపిస్తున్నాయి. ముఖ్యంగా రాష్ట్ర విభజన తర్వాత ఈ ప్రక్రియ ఊపందుకుంది. ఆంధ్రప్రదేశ్ నయా రాజధాని విజయవాడపై హీరోలు, దర్శకనిర్మాతలు కన్నేశారు. విజయవాడతో పాటు విశాఖపట్టణం కూడా ప్రాముఖ్యతను సంతరించుకుంటుంది.
విజయవాడలో ఇప్పుడిప్పుడే పాశ్చాత్య సంస్కృతి పురుడు పోసుకుంటుంది. మల్టీప్లెక్స్ థియేటర్లు, షాపింగ్ మాల్స్ కల్చర్ ప్రారంభం అయ్యింది. అక్కడ ప్రజలను, యువతను ఆకర్షించడం కోసం టాలీవుడ్ ప్రముఖులు ప్రచార కార్యక్రమాలను నయా రాజధానిలో ఏర్పాటు చేస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ రాజధానిగా విజయవాడను ప్రకటించడం, ఏపి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సింగపూర్ తరహాలో విజయవాడను అభివృద్ధి చేస్తాం అనడంతో హీరోలు, దర్శకనిర్మాతలు కన్ను పడింది. ఇప్పటి నుండే నెమ్మదిగా విజయవాడను తమ అడ్డాగా చేసుకోవడం ప్రారంభించారు.
ఇటివల శర్వానంద్ హిట్ సినిమా ‘రన్ రాజా రన్’ ఆడియో సక్సెస్ మీట్ విజయవాడ-గుంటూరు మధ్యలో ఉన్న హాయ్ ల్యాండ్ లో నిర్వహించారు. తర్వాత ‘ఒక లైలా కోసం’ మూడు పాటలను విడుదల చేయడానికి విజయవాడలో పివిపి మాల్ ను వేదికగా చేసుకున్నారు అక్కినేని యువ హీరో నాగ చైతన్య. అదే బాటలో నడిచిన గోపీచంద్ తన ‘లౌక్యం’ ఆడియో విడుదల కార్యక్రమాన్ని బెజవాడలో చేశారు. తాజాగా ‘ఐస్ క్రీం 2’ ఆడియోను ఇదే నగరంలో విడుదల చేస్తున్నట్టు దర్శకనిర్మాతలు ప్రకటించారు.
విజయవాడ నేపధ్యంలో ఎన్నో సినిమాలు వచ్చాయి. భవిష్యత్ లో మరిన్ని తెరకేక్కే అవకాశం ఉంది. రాష్ట్ర విభజన నేపద్యంలో కొత్త రాజధాని బెజవాడను బేస్ చేసుకుని కొత్త కథలు సృష్టించే అవకాశం రచయితలకు లభించింది. అలాగే మరిన్ని ఆడియో విడుదల కార్యక్రమాలు, ప్రచార కార్యక్రమాలకు వేదిక అవుతుంది అనడంలో ఎటువంటి సందేహం లేదు.
సువిశాలమైన సముద్రపు అందాలు, నిర్మాణానికి అనువైన స్టూడియోలు విశాఖ సొంతం. సహజసిద్దమైన ప్రకృతి అందాలతో ఆకర్షించే అరకు లోయలు దగ్గరలో ఉండడం మరో ప్లస్ పాయింట్. విజయవాడతో సమానంగా చిత్ర పరిశ్రమ దృష్టిని ఆకర్షించడానికి విశాఖపట్టణం పోటి పడుతుంది. ఇంకా చెప్పాలంటే ఒక అడుగు ముందే ఉంది. ఏపి ప్రభుత్వం కూడా విశాఖను ఫిల్మ్ హబ్ గా తీర్చిదిద్దాలని భావిస్తుంది.
రాష్ట్ర విభజన తర్వాత టాలీవుడ్ ఎక్కడ ఉంటుంది అనే విషయంలో పలు సందేహాలు, పలువురి ప్రముఖుల వివరణలు, వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుతానికి కొంచం క్లారిటీ వచ్చిందని భావిస్తున్నారు. భవిష్యత్ లో రెండు రాష్ట్రాల తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకోవడం కోసం టాలీవుడ్ చిత్ర ప్రముఖులు సమ ప్రాధాన్యం ఇవ్వవచ్చు. ఈ ప్రక్రియలో భాగంగా విజయవాడ, విశాఖ సినిమాల పరంగా వేగంగా అభివృద్ధి చెందుతాయని విశ్లేషకులు భావిస్తున్నారు.
బాలీవుడ్ చిత్ర పరిశ్రమ ముంబైలో కొలువుదీరినా ఇతర మెట్రో నగరాలలో ప్రచార కార్యక్రమాలను నిర్వహించడంలో ప్రత్యేక శ్రద్ధ కనబరుస్తారు. ఈ టెక్నిక్ ను మెల్లగా టాలీవుడ్ ఫాలో అవడం ప్రారంభించింది.


