డైరెక్టర్ రాసుకున్న పాత్ర కోసం ఏమి చేయడానికన్నా సిద్దపడే అతి తక్కువమంది హీరోలలో చియాన్ విక్రమ్ కూడా ఒకరు. సౌత్ ఇండియన్ సక్సెస్ఫుల్ డైరెక్టర్ శంకర్ దర్శకత్వంలో విక్రమ్ హీరోగా నటించిన సినిమా ‘ఐ’. అన్ని కార్యక్రమాలను పూర్తి చేసుకున్న ఈ సినిమా సంక్రాంతి కానుకగా రిలీజ్ కావడానికి సిద్దమవుతోంది. అందులో భాగంగా ఈ చిత్ర టీం ప్రస్తుతం ప్రమోషన్స్ లో బిజీ బిజీగా ఉన్నారు. ఈ మూవీలో విక్రమ్ మూడు డిఫరెంట్ గెటప్స్ లో కనిపిస్తాడు. ఆ పాత్రల కోసం విక్రమ్ ఎంతో రిస్క్ చేసాడు.
విక్రమ్ ఈ సినిమా కోసం తను చేసిన రిస్క్ గురించి విక్రమ్ మాట్లాడుతూ ‘ఐ సినిమాలో మొత్తం నేను నాలుగు డిఫరెంట్ పాత్రల్లో కనిపిస్తాను. అందులో ఒకదాని కోసం భారీగా బాడీ పెంచాలి, మరో పాత్ర కోసం 20 నుంచి 25 కేజీలు తగ్గాలి. అలాగే తోడేలు మేకప్ వేసుకోవడానికి పాత్రకి 3-5 గంటలు పడుతుంది. ఈ విషయంలో నా ఫ్యామిలీ చాలా భయపడ్డారు, వారిని ఒప్పించడం చాలా కష్టం అయ్యింది. ఒక యాక్టర్ గా నన్ను మరో స్థాయికి తీసుకెళ్ళే సినిమా ‘ఐ’ అవుతుందని’ అన్నాడు.
విక్రమ్ సరసన అమీ జాక్సన్ హీరోయిన్ గా నటించిన ఈ రొమాంటిక్ యాక్షన్ థ్రిల్లర్ లో ఉపేన్ పటేల్ విలన్ పాత్రలో కనిపిస్తాడు. ఎఆర్ రెహమాన్ మ్యూజిక్ అందించగా, పిసి శ్రీరాం సినిమాటోగ్రఫీ అందించిన ఈ సినిమా కోసం ఇంటర్నేషనల్ టెక్నీషియన్స్ పనిచేసారు.


