ఇతర నటులు విఫలమైన చోట విజయ్ ఎలా గెలిచారు?..ఆ ఒక్క మాట ప్రజల్లో మార్పు తెచ్చిందా?.. నటుడు విశాల్ విశ్లేషణ!

తమిళ చిత్రసీమకు చెందిన ప్రముఖ నటుడు విశాల్, విజయ్ రాజకీయ ప్రయాణంపై పలు ఆసక్తికర విషయాలను పంచుకున్నారు. విజయ్ ముఖ్యమంత్రి బాధ్యతలు స్వీకరించిన తర్వాత ఇటీవల ఆయనను కలిసినట్లు విశాల్ ఒక ఇంటర్వ్యూలో వెల్లడించారు. సీఎం అయినా ఆయన ప్రవర్తనలో ఎలాంటి మార్పు లేదని, మునుపటిలాగే ఎంతో సాధారణంగా మాట్లాడారని తెలిపారు.

గతంలో సినీ పరిశ్రమకు చెందిన పలువురు ప్రముఖులు రాజకీయాల్లోకి వచ్చినప్పటికీ విజయం సాధించలేకపోయారని విశాల్ గుర్తుచేశారు. తమిళనాట శివాజీ గణేషన్, భాగ్యరాజ్ వంటి అగ్ర కళాకారులు పార్టీలు స్థాపించినా విజయం సాధించలేకపోయారని, హిందీలో అమితాబ్ బచ్చన్ లేదా మిథున్ చక్రవర్తి వంటి వారికి ఎంతో ఇమేజ్ ఉన్నప్పటికీ ఆ స్థాయి రాజకీయ మార్పు తీసుకురాలేకపోయారని అన్నారు.

ప్రజల్లో మార్పు కోరిక.. ఓటర్లపై విజయ్ మార్క్

విజయ్ విషయంలో ఇది కేవలం నటుడి నుంచి రాజకీయ నాయకుడిగా మారడం మాత్రమే కాదని, ప్రజలు మార్పును బలంగా కోరుకోవడమే ప్రధాన కారణమని విశాల్ విశ్లేషించారు. మొదటిసారి ఓటు వేసే యువత, సాధారణ ప్రజలు విజయ్ మాట్లాడే తీరుకు బాగా కనెక్ట్ అయ్యారని అభిప్రాయపడ్డారు.

ముఖ్యంగా అసెంబ్లీ ఎన్నికల ప్రచార చివరి రోజున విజయ్ చేసిన ప్రసంగం తీవ్ర ప్రభావం చూపించిందని విశాల్ తెలిపారు. “మీ తల్లిదండ్రులకు, ఇంట్లోని పెద్దలకు ఒక్కసారి నాకు ఓటేయమని చెప్పండి” అని విజయ్ కోరడం ప్రజల మనస్సులను తాకిందని పేర్కొన్నారు. తన మనవరాలు చెప్పిందని ఒక రిటైర్డ్ జడ్జి కూడా విజయ్ పార్టీ తమిళగ వెట్రి కజగం (TVK)కి ఓటు వేశానని చెప్పడం దీనికి నిదర్శనమని వెల్లడించారు.

ఇక సినిమాల విషయానికొస్తే, విశాల్ స్వీయ దర్శకత్వంలో తెరకెక్కిన ‘మకుటం’ చిత్రం ఆగస్టు 14న థియేటర్లలో విడుదలయ్యేందుకు సిద్ధంగా ఉంది.

Exit mobile version