సినీ పరిశ్రమలో కొత్త ప్రతిభను ఎంకరేజ్ చేసేందుకు ప్రముఖ నటుడు విష్ణు మంచు ఒక డేరింగ్ డిసిషన్ తీసుకున్నారు. నూతన సంవత్సరం సందర్భంగా అవా ఎంటర్‌టైన్‌మెంట్ ఒక ముఖ్యమైన ప్రకటన చేస్తూ, దేశవ్యాప్తంగా ఉన్న కొత్త టాలెంట్, న్యూ జనరేషన్ ఫిల్మ్ మేకర్స్‌కు ఆహ్వానం పలికింది. రూటెడ్ కథలు, క్రియేటివ్ కంటెంట్‌తో వచ్చే యువ దర్శకులను ఒకచోట చేర్చడమే ఈ ప్రయత్నం లక్ష్యం.
ఈ సందర్భంగా విష్ణు మంచు కొన్ని ఆసక్తికరమైన ఆలోచనలను పంచుకున్నారు. పది నిమిషాల నిడివి గల ఒక షార్ట్ ఫిల్మ్ కూడా జీవితాన్ని మార్చగలదని.. చిన్నగా మొదలైన ప్రయాణమే కాలక్రమంలో గొప్ప స్థాయికి చేరవచ్చని ఆయన అభిప్రాయపడ్డారు. ఒక మంచి సినిమా దాని బడ్జెట్ లేదా స్కేల్‌తో కాదు, ఆలోచనలోని స్పష్టత, ఎమోషనల్ డెప్త్, క్రియేటివిటీ ద్వారానే పుడుతుందని అవా ఎంటర్‌టైన్‌మెంట్ విశ్వసిస్తోంది. ఇది సాధారణ పోటీ గానీ, సంప్రదాయ లాంచ్‌ప్యాడ్ గానీ కాకుండా, పరిశ్రమపై లోతైన అవగాహనతో, అనుభవం మరియు స్పష్టమైన లక్ష్యంతో రూపొందించిన ఒక ప్రత్యేక అవకాశంగా నిలవనుంది.
సినిమా ఇండస్ట్రీలోకి రావాలనుకుని సరైన దారి తెలియని యువత కోసం, విశ్వసనీయత మరియు పారదర్శకతతో నిజమైన అవకాశాన్ని అందించాలనే సంకల్పంతో విష్ణు మంచు ముందుకు వచ్చారు. ఈ కార్యక్రమానికి సంబంధించిన పూర్తి వివరాలను జనవరి 15న అధికారికంగా వెల్లడించనున్నారు. అంతవరకు అవా ఎంటర్‌టైన్‌మెంట్ యువ దర్శకులు, రచయితలు అప్రమత్తంగా ఉండాలని సూచిస్తోంది. “10 నిమిషాలు. ఒక విజన్. భవిష్యత్తు వికసించడానికి సిద్ధంగా ఉంది” అనే మాటలతో, త్వరలోనే ఒక ప్రకటన అందరి ముందుకు రానున్నట్లు సంకేతం ఇచ్చింది.
