ఆది సినిమాతో దర్శకుడిగా తన ప్రయాణాన్ని మొదలుపెట్టిన వి.వి.వినాయక్ ఇప్పటివరకు అనుభవం ఉన్న హీరోలతోనే పనిచేశారు. ‘అల్లుడు శీను’ సినిమాతో తొలిసారిగా ఒక కొత్త హీరోను ప్రేక్షకులకు పరిచయం చేసే భాద్యతను తీసుకున్నారు. నిర్మాత బెల్లంకొండ సురేష్ తనయుడు సాయి శ్రీనివాస్ హీరోగా పరిచయం అవుతున్న సినిమా ‘అల్లుడు శీను’. సమంత హీరోయిన్. మిల్కీ బ్యూటీ తమన్నా ప్రత్యెక గీతంలో నర్తించింది. దేవి శ్రీ ప్రసాద్ స్వరాలను సమకూర్చిన ఈ సినిమా ఆడియో ఆవిష్కరణ ఆదివారం జరిగింది. ఈ కార్యక్రమానికి వెంకటేష్, రాజమౌళి, దశరథ్, బండ్ల గణేష్, దిల్ రాజు, సంతోష్ శ్రీనివాస్, గోపీచంద్ మలినేని తదితర చిత్రపరిశ్రమ ప్రముఖులు హాజరయ్యారు.
” చిరంజీవి గారితో ఠాగూర్ సినిమా తెరకెక్కించినప్పుడు ‘వి.వి.వినాయక్’ ఎంత కష్టపడ్డారో..? ‘అల్లుడు శీను’ సినిమాకు అంత కన్నా ఎక్కువ కష్టపడ్డారు. తెలుగులో అగ్ర హీరోలతో సినిమాలు తీసి దర్శకుడిగా గొప్ప స్థానంలో ఉన్నారు. అయినా ఆదితో తనను దర్శకుడిని చేసిన సురేష్ గారి అబ్బాయిని పరిచయం చేసే బాధ్యతను తీసుకోవడం గొప్ప విషయం. సినిమా విజయం సాదించాలి అని కోరుకుంటున్నాను” అని రాజమౌళి అన్నారు.
” ఆది నుంచి నేటి అల్లుడు శీను సినిమా వరకు ‘వి.వి.వినాయక్’తో కలసి పనిచేశాను. అప్పుడూ.. ఇప్పుడూ… దర్శకుడిగా ఆయనలో కసి, తపన ఒకేలా ఉన్నాయి. నన్ను ఒక గేయరచయితగా కాకుండా ఒక అగ్ర నిర్మాతలా భావించి కథ చెప్పారు. కథ నేరేట్ చేసే సమయంలో ఎలాగైనా అవకాశం చేజిక్కించుకోవాలనే తపన, కసి నాకు ఆయనలో కనిపించాయి. సినిమాలో పాటలన్నీ బాగున్నాయి. సినిమా విజయవంతం కావాలని” చంద్రబోస్ ఆకాంక్షించారు.
ఈ కార్యక్రమానికి హాజరయిన ప్రముఖులు సాయి శ్రీనివాస్ కు హీరోగా సక్సెస్ అవుతాడని, మంచి భవిష్యత్ ఉంటుందని అన్నారు. సినిమా హిట్ అవ్వాలని కోరుకున్నారు.


