
సూపర్ స్టార్ మహేష్ అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూసిన రోజు రానే వచ్చింది. మహేష్-కొరటాల శివ కాంబినేషన్‌లో రూపొందిన ‘శ్రీమంతుడు’ సినిమా ఆడియో ఆవిష్కరణ వేడుక ఈ సాయంత్రం హైద్రాబాద్‌లోని శిల్పకళావేదికలో వైభవంగా జరిగింది. ఈ సందర్భంగా దేవిశ్రీ ప్రసాద్ అందించిన ఆల్బమ్‌తో పాటు, థియేట్రికల్ ట్రైలర్, మూడు పాటలకు సంబంధించిన సాంగ్ ట్రైలర్స్ కూడా విడుదల చేశారు. ఇప్పటికే దాదాపుగా అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకుంటున్న ఈ సినిమా ఆగష్టు 7న ప్రపంచవ్యాప్తంగా భారీ ఎత్తున విడుదల కానుంది.
ఇక ఆడియో ఆవిష్కరణ సందర్భంగా మహేష్ మాట్లాడుతూ.. “అభిమానులు ఎప్పుడూ నా గుండెల్లో ఉంటారు. వారి ఆనందపరచడానికి మంచి సినిమాలు తీస్తూనే ఉంటా. నా లాస్ట్ సినిమా మిమ్మల్ని డిజప్పాయింట్ చేసింది. అందులో నా తప్పేమైన ఉంటే క్షమించండి. శ్రీమంతుడు సినిమా ద్వారా ఈ పుట్టినరోజుకు నాకు పెద్ద కానుక ఇస్తారని కోరుకుంటున్నా” అని అన్నారు. ఈ సందర్భంగా మహేష్.. దర్శకుడు కొరటాల శివ, హీరోయిన్ శృతి హాసన్, సంగీత దర్శకుడు దేవిశ్రీ ప్రసాద్, సినిమాటోగ్రాఫర్ మధి, నటుడు జగపతి బాబులతో పాటు సినిమా యూనిట్ మొత్తానికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.
ఇక ఇదే ఆడియో ఆవిష్కరణ వేడుకకు సూపర్ స్టార్ కృష్ణ, విజయ నిర్మల, ఏపీ మంత్రి గంటా శ్రీనివాస రావు, ఎంపీ గల్లా జయధేవ, విక్టరీ వెంకటేష్, వి.వి.వినాయక్, శ్రీకాంత్ అడ్డాల, శ్రీనువైట్ల తదితరులు పాల్గొని సినిమా మంచి విజయం సాధించాలని కాంక్షించారు. ఆడియో ఆవిష్కరణ వేడుక సందర్భంగా దేవిశ్రీ ప్రసాద్, శృత హాసన్‌లు పాట పాడడం ఈవెంట్‌కి హైలైట్‌గా నిలిచింది.

