చిరు 150వ సినిమా మొదలయ్యేది ఎప్పుడు??

chiranjeevi
మెగాస్టార్ చిరంజీవి 150వ సినిమా ఎప్పుడు పట్టాలెక్కుతుంది? చిరును స్క్రీన్‌పై చూసి ఆనందించేదెప్పుడు? అని ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న అభిమానులకు ఈ ఎదురుచూపులు ఇంకా కొన్నాళ్ళు తప్పేలా లేవు. తాను సినిమాల్లోకి మళ్ళీ ఎంట్రీ ఇవ్వనున్నట్లు ప్రకటించడంతో పాటు రామ్ చరణ్ నిర్మాణంలోనే ఆ సినిమా ఉంటుందని చిరంజీవి స్వయంగా తెలిపిన రోజునుంచి మొదలైన ఈ క్రేజ్ ఇప్పటికీ అదే స్థాయిలో కొనసాగుతున్నా, ఆ ప్రాజెక్టు మాత్రం ఇప్పటికీ ముందుకు కదల్లేదు.

పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో చిరంజీవి హీరోగా 150వ సినిమా చేస్తారని మొదట్లో వినిపించింది. అయితే పూరీ అందించిన స్క్రిప్ట్ నచ్చక చిరు, ఆ ప్రాజెక్టును పక్కన పెట్టేశారు. ఇక ఆ తర్వాత వీవీ వినాయక్, భోయపాటి శ్రీను, శ్రీనువైట్ల ఇలా పలువురు టాప్ డైరెక్టర్స్ పేర్లు తెరపైకి వచ్చినా ఇప్పటివరకూ ఏదీ ఫైనల్ కాలేదు. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా నటించిన ‘బ్రూస్ లీ’ సినిమాలో చిన్న గెస్ట్ రోల్ చేసి తన చరిష్మా ఏమాత్రం తగ్గలేదని నిరూపించిన చిరు సినిమా కోసం ఫ్యాన్స్ బ్రూస్ లీ రిలీజ్ తర్వాత మరింతగా అంచనాలు పెంచేసుకున్నారు.

ఇక తమిళంలో ఘన విజయం సాధించిన ‘కత్తి’ సినిమా రీమేక్‌ను చిరు 150వ సినిమాగా చేస్తే ఎలా ఉంటుందన్న ఆలోచన కూడా చేశారు. అయితే అది కూడా ముందుకు కదల్లేదు. ప్రస్తుతం సినీ పరిశ్రమలో మారిన మార్కెట్ సమీకరణలు, ప్రేక్షకుల అభిరుచులు అన్నింటినీ అందుకుంటూనే చిరు స్టార్‌డమ్‌ను అందుకునే కథ కోసం రామ్ చరణ్, చిరంజీవి ప్రస్తుతం కథలు వింటున్నారు. ణిదెల ప్రొడక్షన్స్ కంపెనీపై రామ్ చరణ్ స్వయంగా నిర్మించనున్న ఈ సినిమాకు సంబంధించిన ఓ అఫీషియల్ అనౌన్స్‌మెంట్ సంక్రాంతి సందర్భంగా వచ్చే అవకాశం ఉందని తెలుస్తోంది. మరి అదెంత వరకు నిజమో తెలియాలంటే సంక్రాంతి వరకూ ఆగాల్సిందే!

Exit mobile version