స్పెషల్ ఫోకస్ : స్వర్గంలో స్వర్ణయుగపు తారలు – ఓ తరం మారుతుంది.

స్పెషల్ ఫోకస్ : స్వర్గంలో స్వర్ణయుగపు తారలు – ఓ తరం మారుతుంది.

Published on Feb 23, 2015 7:45 PM IST

TFI
గత రెండేళ్ళ నుండి స్వర్ణయుగపు సినీ ప్రముఖులు ఒకొక్కరూ స్వర్గస్తులయ్యారు. అక్కినేని నాగేశ్వరరావు, బాపు – రమణలు, దగ్గుబాటి రామానాయుడు, విబి రాజేంద్రప్రసాద్, గణేష్ పాత్రో, అంజలి దేవి, వేటూరి, పిజే శర్మ.. ఇలా అన్ని రంగాలలో ప్రముఖులు అస్తమించారు. నేడు చిత్ర పరిశ్రమపై ఆధారపడి ప్రత్యక్షంగా, పరోక్షంగా బ్రతుకుతున్న కుటుంబాలు లక్షల్లో ఉన్నాయి. ప్రతి సంవత్సరం ఇండియాలో విడుదలవుతున్న చిత్రాలలో రెండవ స్థానం తెలుగు భాషదే. ఈ అభివృద్ధి వెనుక స్వర్ణయుగపు సినీ ప్రముఖులు చేసిన కృషి ఎంతో ఉంది. వారి జీవితాలు భావి తరానికి పాఠ్య‌ గ్రంధాలు.నట సార్వభౌమ ఎన్టీఆర్, ఎస్వీ రంగారావు, ఎల్వీ ప్రసాద్, నాగిరెడ్డి, చక్రపాణి, జగ్గయ్య తదితర ప్రముఖుల కృషిని ఎలా మర్చిపోగలం. వారు ఎప్పుడో కాలం చేశారు. మనతో ఇన్నాళ్ళు మధుర జ్ఞాపకాలు పంచుకున్న మిగతా వారు స్వర్గానికి పయనమయ్యారు.

తెలుగు చిత్ర పరిశ్రమకు దశ, దిశా, మార్గ నిర్దేశం జరిగింది 70, 80వ దశాబ్దాలలోనే. మన సంస్కృతి సంప్రదాయాలను, జీవితాల్లో అనురాగపు ఆప్యాయతలను అప్పటి చిత్రాల్లో చూపారు. తెలుగు చిత్రాలకు నడత, నడవడిక, మాట నేర్పారు. క్లాసికాల్ హిట్స్ అని చెప్పుకుంటున్న చిత్రాలన్నీ స్వర్ణయుగంలోనివే. ఇప్పటి నటీనటుల్లో ఎక్కువ శాతం, తాము ఆ కాలంలో జన్మించే ఉంటె బాగుండేది అనే అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. ప్రేక్షకుల మదిలో చిరకాలం గుర్తుండిపోయే పాత్రలు, నటనకు ఆస్కారం ఉన్నవి అప్పటి తారలకు లభించాయి. ఇప్పుడు అరుదుగా అలాంటి చిత్రాలు, నటీనటులకు పాత్రలు వస్తున్నాయి.

ఈ దశాబ్ద కాలంలో వసూళ్ళ పరంగా, టెక్నాలజీ పరంగా తెలుగు చిత్రాలలో ఎంతో మార్పు వచ్చింది. కానీ, చరిత్ర పుటల్లో నిలిచిపోయే చిత్రాలు ఎన్ని అని ఆరా తీస్తే వేళ్ళ మీద లెక్కపెట్టాలి. ఈ తరం సినిమాలలో ఎక్కువ శాతం అశ్లీలతకు ప్రాధాన్యం ఇస్తున్నాయి, ఇది బాధాకరమైన విషయం. ప్రస్తుత కాలంలో ప్రేక్షకుల అభిరుచి మారింది. ఈ మాట ఎవరూ కాదనలేని సత్యం. సినిమా మేకింగ్ అందరికి అందుబాటులోకి రావడంతో ఈ పరిస్థితికి ఓ కారణం. గ్లోబలైజేషన్ మన సమాజంతో పాటు సినిమాల్లో మార్పు తీసుకొచ్చింది. ఇటువంటి సమయంలో కూడా శ్రీకాంత్ అడ్డాల, జాగర్లమూడి రాధాకృష్ణ, క్రాంతి మాధవ్, సిరివెన్నల వంటివారు విలువలతో కూడిన చిత్రాలకు ప్రాధాన్యం ఇవ్వడం అభినందనీయం.

చివరి శ్వాస వరకూ సినిమాకు తమ జీవితాలను అంకితం చేసిన వ్యక్తులు ఇక లేకపోవడం శోచనీయం. దశ, దిశా, మార్గ నిర్దేశం చేసిన వారు… నడత, నడవడిక, మాట నేర్పించిన ప్రముఖులు స్వర్గంలో సేద తీరుతున్నారు. వారి మరణంతో తెలుగు చిత్రసీమలో ఓ యుగం పూర్తయింది. ఓ శకం ముగిసింది. కొత్త తరం సినీ ప్రముఖులు చిత్రసీమ పగ్గాలు చేపడుతున్నారు. వారు మన మధ్య లేకపోయినా, నేర్పించిన విలువలు మనతోనే ఉన్నాయి. వాటిని కాపాడుకుంటూ ముందుకు సాగాలని కోరుకుందాం.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు