నందమూరి బాలకృష్ణ, దర్శకుడు కొరటాల శివ కాంబినేషన్లో సినిమా రాబోతుందన్న వార్త టాలీవుడ్ ప్రేక్షకులలో భారీ అంచనాలను పెంచుతోంది. గతంలో బాలయ్య బ్లాక్‌బస్టర్ హిట్ ‘సింహా’ చిత్రానికి కొరటాల శివ రచయితగా పనిచేసిన సంగతి తెలిసిందే. ఇక ఇప్పుడు వీరిద్దరి కలయికలో ఒక పవర్ఫుల్ సోషల్ డ్రామా సిద్ధమవుతోన్నట్లు తెలుస్తోంది. కొరటాల శివ తనదైన శైలిలో కమర్షియల్ హంగులతో పాటు సమాజానికి ఒక బలమైన సందేశాన్ని ఇచ్చేలా ఈ కథను రూపొందించాడట.
సోషల్ డ్రామాలను తెరకెక్కించడంలో కొరటాల దిట్ట. ఇక బాలయ్యతో ఓ సోషల్ మెసేజ్ ఉన్న సినిమా తీస్తే, అది ప్రేక్షకుల్లో ఖచ్చితంగా హిట్ అవుతుందని ఆయన ఈ కథను రెడీ చేసినట్లు తెలుస్తోంది. గతంలో సూపర్ స్టార్ మహేష్ బాబుతో ‘శ్రీమంతుడు’ చిత్రం బాక్సాఫీస్ దగ్గర ఎలాంటి సెన్సేషన్ క్రియేట్ చేసిందో అందరికీ తెలిసిందే. కమర్షియల్ అంశాలను మేళవిస్తూ సోషల్ డ్రామాను పక్కాగా రూపొందిస్తే, మరోసారి కొరటాల ‘శ్రీమంతుడు’ లాంటి హిట్ అందుకోవడం ఖాయమని సినీ ఎక్స్పర్ట్స్ అంటున్నారు.
ఇక ఈ భారీ ప్రాజెక్టుకు సంబంధించిన షూటింగ్ ఈ ఏడాది ఆగస్టు నుండి ప్రారంభం కానుంది. ఈ సినిమాలో బాలకృష్ణ ఒక సరికొత్త మేకోవర్‌లో కనిపించబోతున్నాడట. మే నెలలో చిత్ర యూనిట్ నుండి అధికారిక ప్రకటన వెలువడే అవకాశం ఉంది. సుధాకర్ చెరుకూరి మరియు సుధాకర్ మిక్కిలినేని సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.


