ఫ్యామిలీ చిత్రాల దర్శకుడిగా పేరుగాంచిన టాలెంటెడ్ డైరెక్టర్ సతీష్ వేగేశ్న దర్శకత్వంలో నందమూరి కళ్యాణ్ రామ్ హీరోగా జనవరి 15న రాబోతున్న ఎమోషనల్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ ‘ఎంత మంచివాడవురా’. కాగా సంక్రాంతి సీజన్ కు స్టార్ హీరోల సినిమాల మధ్య పోటీ సర్వసాధారణమే అయినా.. ఈ సంక్రాంతి పోటీ మాత్రం మరింత సంచలనంగా మారేలా కనిపిస్తోంది. ఒకపక్క భారీ అంచనాలు ఉన్న మహేష్ బాబు – అల్లు అర్జున్ సినిమాలు పోటీకి సై అంటే సై అంటున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో ‘ఎంత మంచివాడవురా’ రాబోతుంది. ఇప్పటివరకూ ఈ సినిమా నుండి వచ్చిన సాంగ్స్, టీజర్ కి మంచి స్పందన వచ్చింది. కానీ, భారీ చిత్రాల పోటీలో ఈ చిత్రం ఎంతవరకూ నిలబడుతుందని కొంతమంది నెటిజన్లు అనుమానులు వ్యక్తం చేస్తున్నారు.
అయితే, 2017 సంక్రాంతికి కూడా మెగాస్టార్ ‘ఖైదీ నెంబర్ 150’, నట సింహం బాలయ్య ‘గౌతమీపుత్ర శాతకర్ణి’ చిత్రాలు కూడా ఇంతకంటే భారీ అంచనాలతో భారీ స్థాయిలో పోటీ పడ్డాయి. అలాంటి పోటీలో కూడా సతీష్ వేగేశ్న ‘శతమానం భవతి’ అంటూ అదే సంక్రాంతికి వచ్చి సూపర్ హిట్ తో పాటు ఏకంగా జాతీయ అవార్డ్ ను సైతం దక్కించుకున్నాడు. ‘శతమానం భవతి’ విడుదలకు ముందు ఆ సినిమా పై విపరీతమైన అంచనాలు ఏమి లేవు, కానీ, విడుదల తరువాత చిరంజీవి బాలకృష్ణ సినిమాలకు పోటీగా కలెక్షన్స్ ను రాబట్టింది.
ఇప్పుడు ‘ఎంత మంచివాడవురా’కి కూడా అదే సెంటిమెంట్ పనిచేసేలా కనిపిస్తోంది. పైగా ఈ సినిమా థీమ్ అండ్ ట్రీట్మెంట్ ను బట్టి ఫ్యామిలీ ఆడియన్స్ తో పాటు లవర్స్ ను కూడా ఈ సినిమా బాగా ఆకట్టుకునేలా ఉంది. దీనికి తోడు నందమూరి అభిమానుల అండ ఈ సినిమాకి అదనపు బలంగా నిలవనుంది. మొత్తంగా ‘ఎంత మంచివాడవురా’తో సతీష్ వేగేశ్న తిరిగి ‘శతమానం భవతి’ నాటి పూర్వ వైభవాన్ని అందుకునేలానే ఉన్నాడు.
ఇక శివలెంక కృష్ణ ప్రసాద్ సమర్పణలో ఉమేష్ గుప్తా, సుభాష్ గుప్తా ఈ సినిమాని సంయుక్తంగా నిర్మిస్తున్నారు. గోపీ సుందర్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రంలో కళ్యాణ్ రామ్ సరసన మెహ్రీన్ పిర్జాదా హీరోయిన్ గా నటిస్తోంది.
