
మాస్ మాహారాజ్ రవితేజ హీరోగా దర్శకుడు సంపత్ నంది తెరకెక్కిస్తోన్న సినిమా ‘బెంగాల్ టైగర్’. ‘ఏమైంది ఈవేళ’, ‘రచ్చ’ సినిమాలతో దర్శకుడుగా మంచి గుర్తింపు తెచ్చుకున్న సంపత్ నంది రవితేజ స్టైల్లో ఓ మాస్ కమర్షియల్ సినిమాను తెరకెక్కిస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ రామోజీ ఫిల్మ్ సిటీలో జరుగుతోంది. తాజా సమాచారం మేరకు ఈ సినిమాలో హీరోయిన్ అక్ష ఓ కీలక పాత్రలో నటిస్తున్నట్లు తెలుస్తోంది.
శ్రీ సత్యసాయి ఆర్ట్స్ పతాకంపై కేకే రాధామోహన్ నిర్మించిన ఈ సినిమాలో తమన్నా, రాశిఖన్నా హీరోయిన్లుగా నటిస్తున్న విషయం తెలిసిందే. తాజాగా వీరితో పాటు అక్ష కూడా జాయినవుతున్నట్లు తెలుస్తోంది. ముగ్గురు హీరోయిన్లతో ఈ సినిమా కలర్‌ఫుల్‌గా ఉండనుందన్న విషయం ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఇక ఇప్పటికే బొమాన్ ఇరానీ, హర్ష వర్ధన్ రానే వంటి భారీ తారాగణంతో తెరకెక్కుతోన్న ఈ సినిమాలో హై వోల్టేజ్ యాక్షన్, ఎమోషన్ సన్నివేశాలు ఉన్నాయని సమాచారం. వినాయక చవితి సందర్భంగా సెప్టెంబర్ 17న ఈ సినిమా విడుదల కానుంది.