
‘సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు’ లాంటి సూపర్ హిట్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ తర్వాత సూపర్ స్టార్ మహేష్ బాబు – శ్రీ కాంత్ అడ్డాల కాంబినేషన్ లో వస్తున్న సినిమా ‘బ్రహ్మోత్సవం’. మే 31న అధికారికంగా ప్రారంభమైన ఈ సినిమా జూలై నుంచి సెట్స్ పైకి వెళ్లనుంది. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ కార్యక్రమాలు చివరి దశలో ఉన్న ఈ సినిమా కోసం నటీనటుల్ని కూడా ఫైనలైజ్ చేస్తున్నారు. మొత్తం ముగ్గురు హీరోయిన్స్ ఉండే ఈ సినిమాలో ఇప్పటికే ఇద్దరు హీరోయిన్స్ ని ఫైనలైజ్ చేసారు. ఆ ముద్దుగుమ్మలే సమంత మరియు ప్రణిత.
మాకు అందిన సమాచారం ప్రకారం ఈ చిత్ర టీం మరో స్టార్ హీరోయిన్ ని ఈ సినిమా కోసం సెలక్ట్ చేసారు. తను మరెవరో కాదు అందాల భామ కాజల్ అగర్వాల్. రీసెంట్ గా శ్రీకాంత్ అడ్డాల కాజల్ ని కలిసి కథ చెప్పడం, తనకి నచ్చడంతో ఈ సినిమాకి సైన్ చేసిందని సమాచారం. దీని ప్రకారం బ్రహ్మోత్సవం సినిమాలో మహేష్ బాబు అందాల భామలైన సమంత, కాజల్ అగర్వాల్, ప్రణితలతో కలిసి రొమాన్స్ చేయనున్నారు. హీరోయిన్స్ ఫైనలైజ్ అవ్వడంతో ఈ సినిమాలోని కీ రోల్స్ కోసం కొంతమంది సీనియర్ యాక్టర్స్ ని ఫైనలైజ్ చేసే పనిలో ఉన్నారు. పూర్తి కుటుంబ కథా చిత్రంగా తెరకెక్కుతున్న ఈ సినిమాని పివిపి బ్యానర్ పై నిర్మిస్తున్నారు . జూలైలో షూట్ మొదలెట్టి డిసెంబర్ కల్లా ఈ సినిమా షూటింగ్ ని ఫినిష్ చేయనున్నారు.
ఇదిలా ఉంటే సూపర్ స్టార్ మహేష్ బాబు తన నెక్స్ట్ మూవీ ‘శ్రీమంతుడు’ సినిమా షూటింగ్ ని ఫినిష్ చేసాడు. నిన్నటితో షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా ఆగష్టు 7న రిలీజ్ చేయడానికి ప్లాన్ చేసారు.