
‘బ్రూస్లీ’.. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా, శ్రీనువైట్ల దర్శకత్వంలో భారీ ఎత్తున రూపొందుతోన్న సినిమా. బాహుబలి, శ్రీమంతుడు లాంటి రెండు బ్లాక్‌బస్టర్స్ తర్వాత తెలుగులో ఆ స్థాయి సినిమాగా ప్రచారం పొందుతూ వస్తోన్న సినిమా కావడంతో బ్రూస్లీపై అంతటా విపరీతమైన అంచనాలు ఉన్నాయి. ఇక ఇప్పటికే విడుదలైన పోస్టర్స్, టీజర్స్ సినిమాపై మంచి ఆసక్తి కలిగిస్తుండగా, అక్టోబర్ 2న భారీ ఎత్తున జరిగే ఆడియో రిలీజ్‌తో సినిమాను మరింతగా ప్రేక్షకుల ముందుకు తీసుకెళ్ళాలని దర్శక నిర్మాతలు ప్లాన్ చేస్తున్నారు.
అక్టోబర్ 2న పలువురు మెగా హీరోల సమక్షంలో పెద్ద ఎత్తున జరగనున్న ఆడియో వేడుకలో థమన్ అందించిన ఆడియోతో పాటు థియేట్రికల్ ట్రైలర్‌ను కూడా విడుదల చేయనున్నారు. ఇక ఈ విషయం గురించే తెలియజేస్తూ నిన్న సాయంత్రం బ్రూస్లీ టీమ్ మీడియా సమావేశం ఏర్పాటు చేసింది. ఈ సమావేశంలో దర్శకుడు శ్రీనువైట్ల మాట్లాడుతూ.. సినిమా చాలా బాగా వచ్చిందని, అన్ని వర్గాలకూ నచ్చే సినిమాగా బ్రూస్లీ నిలుస్తుందని తెలియజేశారు. ఇక ఈ సినిమాలో రామ్ చరణ్ చాలా కొత్తగా కనిపిస్తారని, ఆయనలోని మరో కోణాన్ని ఈ సినిమాలో చూడొచ్చని శ్రీనువైట్ల తెలిపారు. ఇక ముందే ప్రకటించినట్లుగానే అక్టోబర్ 16నే సినిమా విడుదల కానుందన్న విషయాన్ని నిర్మాత డీవీవీ దానయ్య మరోసారి స్పష్టం చేశారు.

