కంటెంట్ క్రియేటర్లకు ప్రముఖ వీడియో స్ట్రీమింగ్ ప్లాట్ఫామ్ యూట్యూబ్ కీలక అప్డేట్ ఇచ్చింది. యూట్యూబ్ పార్ట్నర్ ప్రోగ్రామ్ (YPP) ద్వారా ప్రకటనలు, యూట్యూబ్ ప్రీమియం రెవెన్యూ షేరింగ్ పొందే నిబంధనలను సవరించింది. 2018 తర్వాత యూట్యూబ్ మోనిటైజేషన్ అర్హత ప్రమాణాల్లో మార్పులు చేయడం ఇదే తొలిసారి.
కొత్త నిబంధనలు ఇవే
ఫిబ్రవరి 1, 2027 నుంచి అమల్లోకి రానున్న ఈ నూతన నిబంధనల ప్రకారం.. కొత్తగా మోనిటైజేషన్కు దరఖాస్తు చేసుకునే క్రియేటర్లు రెండు ప్రమాణాల్లో ఒకదాన్ని పూర్తి చేయాల్సి ఉంటుంది. గత 365 రోజుల్లో కనీసం 8,000 క్వాలిఫైడ్ వాచ్ అవర్స్ పొంది ఉండాలి లేదా గత 90 రోజుల్లో 20 మిలియన్ల (2 కోట్లు) షార్ట్స్ వ్యూస్ సాధించి ఉండాలి. కనీస సబ్స్క్రైబర్ల పరిమితిని మాత్రం యథాతథంగా 1,000గానే ఉంచారు.
ఫ్యాన్ ఫండింగ్, యూట్యూబ్ షాపింగ్ వంటి ఫీచర్లకు సంబంధించిన ప్రాథమిక అర్హత నిబంధనల్లో ఎలాంటి మార్పులు లేవని సంస్థ వెల్లడించింది.
పాత క్రియేటర్లకు మినహాయింపు
ఈ కొత్త నిబంధనలు కేవలం 2027 ఫిబ్రవరి తర్వాత కొత్తగా పార్ట్నర్ ప్రోగ్రామ్లో చేరేవారికే వర్తిస్తాయని, ఇప్పటికే వైపీపీలో సభ్యులుగా ఉన్న క్రియేటర్లపై ఎలాంటి ప్రభావం ఉండదని యూట్యూబ్ పేర్కొంది. నిరంతరం క్రియాశీలకంగా (యాక్టివ్గా) ఉండే క్రియేటర్లను ప్రోత్సహించేందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపింది.
మరోవైపు, షార్ట్స్ ఆధారిత ఆదాయ పంపిణీకి సంబంధించి పాత క్రియేటర్లు తమ షార్ట్స్ రెవెన్యూను కొనసాగించాలంటే గత 90 రోజుల్లో 10 మిలియన్ల షార్ట్స్ వ్యూస్ కలిగి ఉండాలి. ఒకవేళ వ్యూస్ తగ్గినా ఛానెల్ మోనిటైజేషన్ రద్దు కాదు, లాంగ్-ఫార్మాట్ వీడియోల ద్వారా వచ్చే ఆదాయం యథావిధిగా అందుతుంది. షార్ట్స్ వ్యూస్ మళ్లీ 10 మిలియన్లు దాటగానే వాటి ద్వారా వచ్చే ఆదాయ పంపిణీ ఆటోమేటిక్గా పునరుద్ధరణ అవుతుంది.
