ఇంటర్వ్యూ : షఫీ – హీరో 2 జీరో లేదా జీరో 2 హీరో.. ఏదైనా నేను రెడీ

ఇంటర్వ్యూ : షఫీ – హీరో 2 జీరో లేదా జీరో 2 హీరో.. ఏదైనా నేను రెడీ

Published on Jan 2, 2015 4:45 PM IST

Shafi

‘ఛత్రపతి’, ‘ఖలేజా’ సినిమాలతో నటుడిగా మంచి గుర్తింపు పొందిన షఫీ హీరోగా నటించిన సినిమా ‘ఎ శ్యామ్‌ గోపాల్‌ వర్మ ఫిల్మ్’. జోయా ఖాన్ హీరోయిన్ గా నటించిన ఈ సినిమాకు రాకేష్ శ్రీనివాస్ దర్శకుడు. కొత్త ఏడాది కానుకగా జనవరి 1న విడుదలైన ఈ సినిమా రెగ్యులర్ సినిమాలకు భిన్నంగా ఉందనే టాక్ ను సొంతం చేసుకుంది. ఈ సందర్భంగా సినిమా విశేషాలను తెలియజేయడానికి హీరో షఫీ పాత్రికేయులతో సమావేశం అయ్యారు. ఆ సంగతులు మీకోసం..

ప్రశ్న) సినిమాపై ప్రేక్షకుల స్పందన ఎలా ఉంది..?

స) ఇది రెగ్యులర్ టైపు సినిమా కాదు. నా క్యారెక్టర్ బాగుందని, ఫస్ట్ హాఫ్ కంటే సెకండ్ హాఫ్ బాగుందని కొందరు అన్నారు. మరికొందరు నేరేషన్ స్లోగా ఉందన్నారు. తొలి రోజు సినిమా పట్ల మిశ్రమ స్పందన లభించింది. విభిన్న తరహా సినిమాలను ఆదరించే ప్రేక్షకులు సినిమాను అభినందిస్తున్నారు. ఈ సినిమా చూసిన పాత్రికేయ మిత్రుడు ఒకరు.. ‘ఎ శ్యామ్‌ గోపాల్‌ వర్మ ఫిల్మ్’ తర్వాత తెలుగులో మానవ సంబంధాలు, విలువలతో కూడిన సినిమాలు వస్తాయని వ్యాఖ్యానించారు.

ప్రశ్న) మీ పాత్రకు, నటనకు ఎటువంటి ప్రసంశలు లభించాయి..?

స) ప్రతి సినిమాకు ప్రసంశలు – విమర్శలు అనేవి సహజం. షఫీ, ఇప్పటివరకూ చేసిన క్యారెక్టర్ల కంటే శ్యామ్ గోపాల్ వర్మ క్యారెక్టర్ చాలా డిఫరెంట్ గా ఉందని పలువురు ప్రశంసించారు. చక్కని నటన కనబరిచానని చెప్పారు. నేను గతంలో నటించిన సినిమాల కంటే డిఫరెంట్ జోనర్ లో రూపొందిన సినిమా ఇది. కొందరు దర్శకుడు రామ్ గోపాల్ వర్మను అనుకరించానని విమర్శిస్తున్నారు. నేను దర్శకుడిని నమ్మాను, ఆయన చెప్పిన విధంగా నటించాను.

ప్రశ్న) టైటిల్ మొదలుకుని సినిమాలో అనేక విషయాలు రామ్ గోపాల్ వర్మపై సెటైర్ అని ప్రతి ఒక్కరికీ అర్ధమవుతుంది. దర్శకుడు మీకు కథ చెప్పినప్పుడు ఏమనిపించింది..?

స) మొదట నేను ఈ సినిమా చేయడానికి అంగీకరించలేదు. వ్యక్తిగతంగా నాకు ఒకరిపై సెటైర్ వేయడం, హేళన చేయడం, బాధపెట్టడం వంటి అంశాలు నచ్చావు. ఎవరి జీవితంలో వారే హీరోలు. మల్లాది కృష్ణశాస్త్రి రచించిన ఓ నవల ఆధారంగా సినిమా రూపొందిస్తున్నామని బౌండ్ స్క్రిప్ట్ నాకు ఇచ్చారు. స్క్రిప్ట్ చదివిన తర్వాత నటనకు ఆస్కారం ఉందని సినిమాకు ఓకే చెప్పాను. డబ్బింగ్ సమయంలో కొన్ని సన్నివేశాలపై అభ్యంతరం తెలిపాను.

ప్రశ్న) మీ కెరీర్ కు ఈ సినిమా ఎలాంటి హెల్ప్ అవుతుందని మీరు భావిస్తున్నారు..?

స) గతంలో నేను నెగిటివ్, కామెడీ పాత్రలలో నటించాను. ఇది డిఫరెంట్ జోనర్ లో రూపొందిన సినిమా. ఇలాంటి సినిమాలు చేయడం వలన మనలో ప్రతిభ బయటపడుతుంది. నటుడిగా ఆవిష్కరించుకునే అవకాశం లభిస్తుంది.

ప్రశ్న) ఇకపై హీరోగానే కొనసాగుతారా..?

స) హీరో 2 జీరో.. జీరో 2 హీరో. ఎటువంటి క్యారెక్టర్ అయినా నేను చేయడానికి రెడీ. ఒక నటుడిగా మనసా వాచా కర్మణా నా వద్దకు వచ్చిన ప్రతి అవకాశానికి 100 శాతం న్యాయం చేకూర్చడానికి ప్రయత్నిస్తా. హీరోగా కంటిన్యూ అవ్వాలనే నియమాలు పెట్టుకోలేదు.

ప్రశ్న) ‘ఛత్రపతి’, ‘ఖలేజా’ సినిమాలలో మీ నటనకు మంచి పేరొచ్చింది. ఆ తర్వాత అంతటి స్థాయి పాత్రలు మీకు లభించలేదని ఎప్పుడైనా ఫీలయ్యారా..?

స) ప్రతి క్యారెక్టర్ ‘ఛత్రపతి’, ‘ఖలేజా’ అవ్వాలనుకుంటే మూర్ఖత్వమే అవుతుంది. లేని దాని కోసం ఆరాట పడడం ఎందుకు..? నాకు లభించిన దానితో సంతోషంగా ఉన్నాను. ఇంకేదో రాలేదని ఆలోచించను. మన జీవితంలో డిఫరెంట్ షేడ్స్ ఉన్నాయి. క్యారెక్టర్స్ కూడా అంతే. ఒకే తరహా పాత్రలు చేయడం నాకు కూడా ఇష్టం ఉండదు. రెమ్యునరేషన్ ఎక్కువ ఇస్తాం అని చెప్పినా, ‘ఛత్రపతి’ తరహా క్యారెక్టర్లలో నటించమని ఆఫర్స్ వస్తే తిరస్కరించాను.

ప్రశ్న) మీ ఫ్యూచర్ ప్రాజెక్ట్స్ ఏంటి..?

స) కళ్యాణ్ రామ్ హీరోగా నటిస్తున్న ‘షేర్’ మరియు నిషా కొఠారి ప్రధాన పాత్ర పోషిస్తున్న ‘బుల్లెట్ రాణి’ సినిమాలలో కీలక పాత్రల్లో నటిస్తున్నాను. మరో రెండు సినిమాలు చర్చల దశలో ఉన్నాయి.

తాజా వార్తలు