సమీక్ష : ‘1920 హార్రర్స్ ఆఫ్ ది హార్ట్’ – బోరింగ్ హారర్ థిల్లర్ !

సమీక్ష : ‘1920 హార్రర్స్ ఆఫ్ ది హార్ట్’ – బోరింగ్ హారర్ థిల్లర్ !

Published on Jun 24, 2023 3:03 AM IST
1920 Horrors of the Heart Movie Review In Telugu

విడుదల తేదీ : జూన్ 23, 2023

123తెలుగు.కామ్ రేటింగ్ : 1.75/5

నటీనటులు: అవికా గోర్, రాహుల్ దేవ్, బర్ఖా బిష్త్, డానిష్ పండోర్, రణధీర్ రాయ్, కేతకి కులకర్ణి, అమిత్ బెహ్ల్ & అవతార్ గిల్

దర్శకుడు : కృష్ణ భట్

నిర్మాతలు: డా. రాజ్ కిషోర్ ఖవారే, రాకేష్ జునేజా, శ్వేతాంబరి భట్

సంగీతం: పునీత్ దీక్షిత్

సినిమాటోగ్రఫీ: ప్రకాష్ కుట్టి

ఎడిటర్: కుల్దీప్ మెహన్

సంబంధిత లింక్స్: ట్రైలర్

 

బాలీవుడ్ ఫిల్మ్ మేకర్ మహేష్ భట్ సమర్పణలో ఆయన స్వీయ రచనలో రూపొందిన లేటెస్ట్ హారర్ మూవీ 1920 హార్రర్స్ ఆఫ్ ది హార్ట్. అవికా గోర్ ప్రధాన పాత్ర పోషించిన ఈ సినిమాకి కృష్ణ భట్ దర్శకత్వం వహించారు. ఈ సినిమా నేడు రిలీజ్ అయింది. మరి ఈ చిత్రం ప్రేక్షకులను ఎంతవరకు మెప్పించిందో సమీక్షలోకి వెళ్లి తెలుసుకుందాం.

 

కథ :

మేఘన (అవికా గోర్) తన తండ్రి ధీరజ్ అకాల మరణానికి తన తల్లి కారణమని తెలుసుకుంటుంది. తన తండ్రిని మోసం చేసి, అలాగే తనకు అమ్మ ప్రేమను దూరం చేసిన తన తల్లి పై ఎలాగైనా ప్రతీకారం తీర్చుకోవాలని మేఘన నిర్ణయించుకుంటుంది. ఈ క్రమంలో జరిగే కొన్ని నాటకీయ పరిణామాల అనంతరం మేఘన తన తల్లి కుటుంబాన్ని, అలాగే ఆమె రెండో కుమార్తె అదితిని మేఘన ఎలా టార్గెట్ చేసింది ?, అందుకోసం తాను ప్రేమించిన అర్జున్ ను ఎలా దూరం చేసుకుంది ?, చివరకు మేఘన తన పగ తీర్చుకుందా ? లేదా ? అనేది మిగిలిన కథ.

 

ప్లస్ పాయింట్స్ :

ఈ ‘1920 హార్రర్స్ ఆఫ్ ది హార్ట్’ లో కొన్ని హార‌ర్‌ ఎఫెక్ట్స్ బాగున్నాయి. అలాగే క్లైమాక్స్ లో సెంటిమెంట్ పర్వాలేదు. ఇక నటీనటుల పెర్ఫార్మన్స్ విషయానికి వస్తే.. అవికా గోర్, రాహుల్ దేవ్, బర్ఖా బిష్త్, డానిష్ పండోర్, రణధీర్ రాయ్, కేతకి కులకర్ణి ఇలా అందరూ బాగానే నటించారు. అవికా గోర్ తన పెర్ఫార్మెన్స్ తో కొన్ని సన్నివేశాల్లో తన ముద్ర కనబరుస్తూ కొన్నిచోట్ల చాలా బాగా నటించింది.

ఈ సినిమాలో మిగిలిన ప్రధాన పాత్రల్లో నటించిన రాహుల్ దేవ్, బర్ఖా బిష్త్, డానిష్ పండోర్ లు కూడా చాలా బాగా ఆకట్టుకున్నారు. ఒక పక్క ఏం జరుగుతుందో అనే టెన్షన్ తో మరియు తనకు ఎదురవుతున్న దెయ్యంతో అనుభవాలకు భయపడుతూ నటి బర్ఖా బిష్త్ చక్కగా నటించింది. మిగిలిన నటీనటులు కూడా తమ పాత్రలకు న్యాయం చేసారు. ప్రకాష్ కుట్టి సినిమాటోగ్రఫీ చాలా బాగుంది.

 

మైనస్ పాయింట్స్ :

సిల్లీ హారర్ చిత్రాలలోని భయాన్ని ఎంజాయ్ చేసే సాధారణ ప్రేక్షకులకు కొంత వరకు ఈ సినిమా ఎంటర్ టైన్ ను కలిగించొచ్చు కానీ.. మిగిలిన వర్గాల వారితో పాటు సగటు ప్రేక్షకులకు కూడా ఈ సినిమా రుచించదు. సినిమా నిండా సిల్లీ హారర్ డ్రామాను మోతాదుకు మించి పెట్టి బాగా విసిగించారు. పైగా కొన్ని జుగుప్సాకరమైన షాట్స్ ను పెట్టడం కూడా అసహ్యంగా ఉంది. ముఖ్యంగా అవికా గోర్ నోట్లో నుంచి ఎలుక పడే షాట్ అయితే సినిమా పై విరక్తిని కలిగించింది.

పైగా సినిమాలో చాలా సన్నివేశాలు పూర్తి సినిమాటిక్ గా అసలు ఏ మాత్రం నమ్మశక్యం కాని విధంగా సాగుతాయి. అసలు వాస్తవానికి పూర్తి దూరంగా సాగే ప్లేలో ఇక ఇన్ వాల్వ్ అయ్యే విధంగా ఇంట్రెస్టింగ్ సీన్స్ ఎలా వస్తాయి. కథనంలోని ప్రతి సన్నివేశం స్లోగా సాగుతూ అసలు కన్వీన్స్ కానీ విధంగా ముగుస్తోంది. దానికి తోడు ట్రీట్మెంట్ కూడా బోరింగ్ ప్లేతో సాగుతూ సినిమాలోని ఇంట్రెస్టింగ్ ను చంపేసింది. నటి బర్ఖా బిష్త్ క్యారెక్టర్ కూడా చాలా ఫేక్ గా సాగింది.

నటుడు రణధీర్ రాయ్ పాత్రకు సంబంధించిన ట్రాక్ కూడా బాగాలేదు. అలాగే సినిమాలో సరైన ప్లో కూడా లేకపోవడం, మెయిన్ ట్రీట్మెంట్ లోని కంటెంట్ ఆసక్తికరంగా సాగకపోవడం, మరియు ప్రీ క్లైమాక్స్ అండ్ సెకండ్ హాఫ్ లోని కీలక సన్నివేశాలన్నీ బాగా స్లోగా సాగుతూ నిరుత్సాహ పరచడం వంటి అంశాలు సినిమాకి ప్రధాన మైనస్ పాయింట్స్ గా నిలిచాయి.

 

సాంకేతిక విభాగం :

సాంకేతిక విభాగం గురించి మాట్లాడుకుంటే.. దర్శకుడు కృష్ణ భట్ కొన్ని హారర్ సన్నివేశాల్లో మెప్పించే ప్రయత్నం చేసినా, కథాకథనాలను ఆకట్టుకునే విధంగా రాసుకోలేకపోయారు. ఇక సినిమాటోగ్రఫీ బాగుంది. సంగీత దర్శకుడు పునీత్ దీక్షిత్ అందించిన సంగీతం జస్ట్ ఓకే అనిపిస్తుంది. ఎడిటర్ పర్వాలేదు. నిర్మాతలు పాటించిన ప్రొడక్షన్ వాల్యూస్ బాగున్నాయి.

 

తీర్పు :

హారర్ అంశాలతో ‘1920 హార్రర్స్ ఆఫ్ ది హార్ట్’ అంటూ వచ్చిన ఈ సినిమా నిరాశపరిచింది. సినిమా ఏ మాత్రం ఆకట్టుకునే విధంగా సాగలేదు. నమ్మశక్యం కాని పూర్తి కాల్పనిక కథతో సినిమా బాగా స్లోగా సాగుతూ.. మరియు నిరుత్సాహ పరిచే కథనంతో విసిగించింది. కానీ, కొన్ని హారర్ సన్నివేశాలు, నటీనటుల పనితీరు పర్వాలేదు. ఐతే, ఓవరాల్ గా ఈ సినిమా మాత్రం నిరుత్సాహ పరుస్తోంది

 

123telugu.com Rating: 1.75/5

Reviewed by 123telugu Team

Click Here For English Review

సంబంధిత సమాచారం

తాజా వార్తలు