Subscribe to our Youtube Channel
 
Like us on Facebook
 
సమీక్ష : అంధగాడు – మలుపులు, నవ్వులు దొరుకుతాయి

Andhhagadu movie review

విడుదల తేదీ : జూన్ 2, 2017

123తెలుగు.కామ్ రేటింగ్ : 3/5

దర్శకత్వం : వెలిగొండ శ్రీనివాస్

నిర్మాత : సుంకర రామబ్రహ్మం

సంగీతం : శేఖర్ చంద్ర

నటీనటులు : రాజ్ తరుణ్, హెబ్బా పటేల్, రాజేంద్ర‌ ప్ర‌సాద్

‘ఈడో రకం ఆడో రకం, కిట్టు ఉన్నాడు జాగ్రత్త’ వంటి చిత్రాలతో మినీమమ్ గ్యారెంటీ హీరోగా గుర్తింపు తెచ్చుకున్న యంగ్ హీరో రాజ్ తరుణ్ చేసిన తాజా చిత్రమే ‘అంధగాడు’. రచయిత వెలిగొండ శ్రీనివాస్ తొలిసారి దర్శకత్వం వహించిన ఈ చిత్రం ఈరోజే థియేటర్లలోకి అడుగు పెట్టింది. మరి ఈ సినిమా సంగతేమిటో ఇప్పుడు చూద్దాం…

కథ :

పుట్టుకతోనే అంధుడైన గౌతమ్ (రాజ్ తరుణ్) ఎవరైనా దాతలు సహాయం చేస్తే చూపిస్తుందని, అప్పుడీ ప్రపంచాన్ని కళ్లారా చూడొచ్చని ఆశతో ఎదురుచూస్తూ ఉంటాడు. అలా కళ్ళ కోసం ఆరాటపడుతున్న గౌతమ్ కు పాతికేళ్ళ వయసులో కళ్ళ మార్పిడి ద్వారా చూపొస్తుంది.

కానీ ఆశ్చర్యకరంగా చూపొచ్చిన కొన్నాళ్లకే గౌతమ్ తిరిగి డాక్టర్లను కలిసి తనకు చూపొద్దని, కళ్ళను తీసేయమని బ్రతిమాలుతాడు. పాతికేళ్ళు కంటి చూపు కోసం ఎదురు చూసిన గౌతమ్ వచ్చిన చూపును ఎందుకు కోల్పోవాలనుకుంటాడు ? అతన్ని అంతలా భాధకు గురి చేసిన విషయాలేంటి ? అతని జీవితంలోకి ప్రవేశించిన కులకర్ణి (రాజేంద్ర ప్రసాద్), బాబ్జీ (రాజా రవీంద్ర)లు ఎవరు, ఏం చేశారు ? చివరికి అతని జీవితం ఒక కొలిక్కి ఎలా వచ్చింది ? అనేదే ఈ సినిమా కథ.

ప్లస్ పాయింట్స్ :

స్వతహాగా రచయిత అయిన దర్శకుడు వెలిగొండ శ్రీనివాస్ ఈ సినిమా కథను అన్ని కమర్షియల్ హంగులతో సగటు ప్రేక్షకుడ్ని ఆకట్టుకునే విధంగానే రాసుకున్నాడు. కథలో ఆయన సృష్టించిన మలుపులు సాధారమణమైనవే, చాలా సినిమాల్లో చూసినవే అయినా కూడా అవి కథనంలో ఊహించని రీతిలో వస్తూ మంచి కిక్ ఇచ్చాయి. అంతేకాకుండా ప్రతి ట్విస్టు కూడా ఆమోదయోగ్యంగానే ఉండటం మరొక మెచ్చుకోదగిన అంశం. ఫస్టాఫ్ మొత్తాన్ని హీరో ప్రేమ చుట్టూ తిప్పుతూ మధ్య మధ్యలో కమెడియన్ సత్యతో జనరేట్ చేసిన ఎంటర్టైన్మెంట్ బాగా వర్కవుట్ అయింది. హీరో హీరోయిన్ల లవ్ ట్రాక్ కూడా రిఫ్రెషింగానే ఉంది.

అలా అన్ని వినోదాత్మకమైన అంశాలతో కూసిన ఫస్టాఫ్ ముగుస్తున్న తరుణంలో ఇచ్చిన ఇంటర్వెల్ ట్విస్ట్ ఊహించని విధంగా ఉండి భలే ఉందే అనిపించింది. సెకండాఫ్లో కూడా ఒక బలమైన మలుపునే ఏర్పాటు చేశాడు దర్శకుడు. ఆ మలుపుతో సినిమా వేగం పుంజుకుని ఆసక్తికరంగా మారింది. అంతేకాకుండా ఈ రెండవ అర్థ భాగంలో అక్కడక్కడా కొంచెం కామెడీ దొరకడం, బయటపడే అసలు నిజం, దాని వెనకున్న భావోద్వేగపూరితమైన ఎమోషనల్ స్టోరీ ఆకట్టుకున్నాయి. అంధుడిగా రాజ్ తరుణ్ నటన, హెబ్బా పటేల్ గ్లామర్, వారి కెమిస్ట్రీ బాగున్నాయి.

మైనస్ పాయింట్స్ :

సినిమాకి అతి పెద్ద బలహీనత సెకండాఫ్ కథనమే. ఇంటర్వెల్ ట్విస్ట్ తో సెకండాఫ్లో హీరో లక్ష్యమేమిటి అనేది స్పష్టంగా తెలిసిపోతుంది. దీంతో చివర్లో వచ్చే ప్రధానమైన మలుపు వద్ద తప్ప ఎక్కడా పెద్దగా ఎగ్జైట్మెంట్ అనిపించలేదు. సినిమా రన్ టైమ్ పెంచడానికన్నట్టు రాజేంద్రప్రసాద్, రాజ్ తరుణ్ ల మధ్య రాసిన కొన్ని అనవసరపు సన్నివేశాలు బోర్ కొట్టించాయి. కథలో కథానాయకుడు ఎలాంటి ఇబ్బందులు పడకుండా తాను అనుకున్నది అనుకున్నట్టు చేసుకుంటూ వెళ్లిపోవడం మరీ నాటకీయంగా అనిపించింది.

అలాగే ఫస్టాఫ్లో హీరోయిన్ చూపులేని హీరో తన దగ్గర చూపున్నట్టు నటిస్తున్నా ఏమాత్రం కనిపెట్టలేకపోవడం, అలాగే అతన్ని ప్రేమించేయడం కూడా వాస్తవానికి చాలా దూరంగా ఉన్నాయి. అంతేగాక ఆరంభంలో ఇంటెలిజెంట్ పోలీసాఫీసర్ గా కనిపించిన షియాజీ షిండే పాత్ర కూడా ఉన్నట్టుండి బకరాగా మారిపోవడం నిరుత్సాహపరిచింది. ఈ ఫైల్యూర్ కి కారణం దర్శకుడు రచనా స్వేచ్ఛను హద్దులు మించి ఉపయోగించుకోవడమనే చెప్పాలి. ఇక విలన్ రాజా రవీంద్ర పాత్ర లుక్స్ పరంగా బాగుంది కానీ కథనంపై మాత్రం అవసరమైనంత ప్రభావం చూపలేకపోయింది. ఒకటి రెండు పాటలు కూడా కథనంలో బలవంతంగా ఇరికించారు.

సాంకేతిక విభాగం :

వెలిగొండ శ్రీనివాస్ మొదటి ప్రయత్నంలో దర్శకుడిగా పర్వాలేదనిపించినా, రచయితగా మాత్రం ఇంప్రెస్ చేశాడు. మంచి కథను, అందులో ఆసక్తికరమైన మలుపులను బాగానే రాసుకున్నా దాన్ని స్క్రీన్ మీద ప్రెజెంట్ చేయడంలో సంపూర్ణంగా సక్సెస్ కాలేకపోయారాయన. బాగుందనిపించిన ఫస్టాఫ్, చివరి ప్రీ క్లైమాక్స్ మినహా మధ్యలో అంతా బోరింగానే ఉంది.

సంగీత దర్శకుడు శేఖర్ చంద్ర సంగీతం బాగానే ఉంది. రాజశేఖర్ సినిమాటోగ్రఫి గురించి ప్రత్యేకించి చెప్పుకోవడానికేం లేదు. ఎడిటింగ్ విభాగం ఇంకాస్త చొరవ తీసుకుని రాజేంద్రప్రసాద్, రాజ్ తరుణ్ ల మధ్య నడిచే కొన్ని రొటీన్ సన్నివేశాలని తొలగించేయాల్సింది. కామెడీ ట్రాక్లో పాత్రలకు రాసిన పంచ్ డైలాగులు బాగా పేలాయి. ఏకే ఎంటర్టైన్మెంట్స్ వారి నిర్మాణ విలువలు బాగున్నాయి.

తీర్పు:

కొత్తదనంలో భాగంగా రాజ్ తరుణ్ చేసిన ఈ ప్రయత్నం పూర్తి స్థాయిలో కాకపోయినా సగం వరకు వర్కవుట్ అయింది. ఎంటర్టైనింగా సాగే ఫస్టాఫ్, బలమైన ఇంటర్వెల్, ప్రీ క్లైమాక్స్ మలుపులు, రాజ్ తరుణ్ నటన, మంచి కామెడీ ట్రాక్స్ అలరించగా రొటీన్, బోరింగ్ కథనంతో పక్కదారి పట్టి చాలా వరకు తేలిపోయిన సెకండాఫ్, వాస్తవానికి దూరంగా ఉన్న కొన్ని అంశాలు నిరుత్సాహపరిచాయి. మొత్తం మీద చెప్పాలంటే చూసే సినిమాలో వినోదం, కథలో ఆసక్తికమైన మలుపులు కోరుకుంటూ కాస్త బోర్ కొట్టించే కథనాన్ని ఆమోదించగలిగే ప్రేక్షకులకు ఈ సినిమా నచ్చుతుంది.

123telugu.com Rating : 3/5

Reviewed by 123telugu Team

Click here for English Review


సంబంధిత సమాచారం :