సమీక్ష : అత్తారింటికి దారేది – ఫ్యామిలీ ఎంటర్టైనర్ విత్ ఫుల్ కామెడీ..

సమీక్ష : అత్తారింటికి దారేది – ఫ్యామిలీ ఎంటర్టైనర్ విత్ ఫుల్ కామెడీ..

Published on Sep 28, 2013 11:45 PM IST
AD1 విడుదల తేదీ27 సెప్టెంబర్ 2013
123తెలుగు.కామ్ రేటింగ్ : 4/5
దర్శకుడు : త్రివిక్రమ్ శ్రీనివాస్
నిర్మాత : బివిఎస్ఎన్ ప్రసాద్
సంగీతం : దేవీశ్రీ ప్రసాద్ 
నటీనటులు : పవన్ కళ్యాణ్, సమంత, ప్రణిత..

అభిమానుల సంద్రాన్నే సంపాదించుకున్న పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ – మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ – అందాల భామ సమంత కాంబినేషన్లో తెరకెక్కిన క్రేజీ మూవీ ‘అత్తారింటికి దారేది’. పైరసీ లంటూ ఎంతమంది ఎన్ని రకాలుగా సినిమాకి ఇబ్బందులు క్రియేట్ చెయ్యాలని చూసినా వాటన్నిటినీ అధిగమించి ఎవరూ ఊహించని స్థాయిలో భారీ ఎత్తున నేడు ప్రపంచ వ్యాప్తంగా విడుదలయ్యింది. బివిఎస్ఎన్ ప్రసాద్ నిర్మాణ సారధ్యంలో, దేవీశ్రీ ప్రసాద్ సంగీతం అందించిన ఈ సినిమాలో బొమన్ ఇరాని, నదియా, ప్రణిత కీలక పాత్రల్లో కనిపించనున్నారు. జల్సా తర్వాత పవన్ – త్రివిక్రమ్ కాంబినేషన్లో రానున్న సినిమా కావడంతో ఈ సినిమాపై భారీ అంచనాలున్నాయి. జల్సా మేజిక్ ని ఈ సినిమాతో మళ్ళీ రిపీట్ చేసారా లేదా అనేది ఇప్పుడు చూద్దాం..

కథ :

రఘునందన్(బొమన్ ఇరాని) మిలాన్ కొన్ని వేల కోట్ల ఆస్తికి అధిపతి. రఘునందన్ కూతురు సునంద(నదియా) తన తండ్రికి ఇష్టం లేకుండా వేరే అతన్ని పెళ్లి చేసుకుంటుంది. దాంతో అతను ఇల్లు వదిలి వెళ్లిపొమ్మంటాడు. అతని మనవడే మన హీరో గౌతమ్ నంద అలియాస్ సిద్దార్థ్(పవన్ కళ్యాణ్). రఘునందన్ తన చివరి రోజుల్లో గౌతంని తన కూతుర్ని తిరిగి తన దగ్గరికి తీసుకురమ్మని ఓ కోరిక కోరతాడు. తన తాత గారి కోరిక తీర్చడం కోసం గౌతమ్ మిలాన్ నుండి ఇండియా పయనమవుతాడు.

అలా ఇండియా వచ్చిన గౌతమ్ సునంద ఇంట్లో ఓ డ్రైవర్ గా చేరతాడు. అప్పుడే సునంద కుమార్తెలుగా శశి(సమంత), ప్రమీల(ప్రణిత)లు కథకి పరిచయమవుతారు. అక్కడి నుంచి మన హీరో గౌతమ్ అత్తగారైన సునందని ఎలా ఒప్పించి తన తాతగారి దగ్గరికి తీసుకెళ్ళాడు? ఇద్దరి మరదల్లలో ఎవరికీ మన గౌతమ్ లైన్ వేసాడు? ఎక్కడో హైదరాబాద్ లో జరుగుతున్న కథకి చిత్తూరుకి చెందిన సిద్దప్ప మధ్యగల సంబంధం ఏమిటి? చివరికి గౌతమ్ తన తాతయ్య ఆఖరి కోరికని తీర్చగాలిగాడా? లేదా? అనేది మీరు తెరపైనే చూడాలి.

ప్లస్ పాయింట్స్ :

‘అత్తారింటికి దారేది’ పర్ఫెక్ట్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ వన్ మాన్ ఆర్మీ మూవీ అని చెప్పుకోవాలి. పవన్ కళ్యాణ్ మొదటి నుంచి చివరికి ఫ్యాన్స్ పండగ చేసుకునేలా నటించాడు. పవన్ ఆద్యంతం తన ఎనర్జిటిక్ నటనతో, కామెడీ టైమింగ్ తో ప్రేక్షకులని విపరీతంగా నవ్వించాడు. ‘కేవ్వుకేక’ సాంగ్ కి స్పూఫ్, కాటమరాయుడ సాంగ్ మరియు దానికి ముందు వచ్చే ఓ ఎపిసోడ్ లో పొట్ట చెక్కలయ్యేలా నవ్వించారు. అలాగే పవన్ సినిమాలో ఎంత స్టైలిష్ గా ఉన్నాడో అంతే హన్డ్సం గా ఉన్నాడు. ముఖ్యంగా అన్ని పాటల్లోనూ ఎంతో జోష్ ఫుల్ స్టెప్పులు వేసి ప్రేక్షకుల చేస్తా డాన్సులు చేయించాడు. ఉదాహరణకి ‘తమ్ముడు’ సినిమాలోని ఓ ఫేమస్ వేవ్ స్టెప్ ‘ఇట్స్ టైం టు పార్టీ’ సాంగ్ లో వేసి ప్రేక్షకులని రంజింపజేశారు. ముఖ్యమైనది, ఆఖరిది క్లైమాక్స్ లో పవన్ కళ్యాణ్ ఫ్యామిలీ ప్రేక్షకుల చేత కంటతడి పెట్టించేలా సెంటిమెంట్ నటనతో ఆకట్టుకున్నాడు.

సమంత సినిమాలో చాలా క్యూట్ లుక్స్ తో గ్లామరస్ గా కనిపించింది. అలాగే సమంత ఫస్ట్ హాఫ్ లో తక్కువ సేపు కనిపించి కాస్త ఫ్యాన్స్ ని నిరుత్సాహపరిచిన సెకండాఫ్ లో మాత్రం ఎక్కువసేపు కనిపించి ప్రేక్షకులను ఆకట్టుకుంది. ప్రణిత పాత్ర చాలా చిన్నదే అయినప్పటికీ ఉన్నంతవరకూ బాగానే చేసింది. అలాగే బాపు గారి బొమ్మ పాటలో చీరల్లో బ్యూటిఫుల్ గా కనిపించింది. అత్తగారి పాత్రలో నదియా పర్ఫెక్ట్ గా సరిపోయింది. ఆమె డైరెక్టర్ అనుకున్న పాత్రకి 100 శాతం న్యాయం చేసింది. తాతయ్య పాత్రలో బొమన్ ఇరాని చక్కటి నటనని కనబరిచాడు. సీరియస్ సన్నివేశాల్లో ఆయన నటన చాలా బాగుంది.

బ్రహ్మానందం సెకండాఫ్ లో బాగా నవ్వించాడు. అలాగే బ్రహ్మానందంపై తీసిన రెడియేటర్ స్పూఫ్, అహల్య ఎపిసోడ్ చాలా నవ్విస్తుంది. ఎంఎస్ నారాయణ, అలీ, పోసాని కృష్ణమురళి తమ వంతు తాము నవ్వించగా, రావు రమేష్, కోట శ్రీనివాస రావులు తమ పరిధిమేర నటించారు. సెకండాఫ్ లో పవన్ కళ్యాణ్ – సమంత మధ్య కెమిస్ట్రీ చేలా బాగుంది. ముఖ్యంగా బావ – మరదలి ఎపిసోడ్, ‘నిన్ను చూడగానే’ పాటల్లో వీరి కెమిస్ట్రీ సింప్లీ సూపర్బ్. పాటలు ఎంత హిట్ అయ్యాయో, అంతకన్నా బాగా పాటలను చిత్రీకరించారు. త్రివిక్రమ్ డైలాగ్స్ బాగున్నాయి. ఇంటర్వల్ ట్విస్ట్ మరియు క్లైమాక్స్ సెంటిమెంట్ సీన్స్ చాలా బాగా వచ్చాయి.

మైనస్ పాయింట్స్ :

విజువల్ ఎఫెక్ట్స్ ఉపయోగించి చేసిన సీన్స్ చెప్పుకోదగ్గ స్థాయిలో లేవు. అలాగే వాటిని తొలగించి ఉంటె బాగుండేది. ముఖ్యంగా ఓ ఫైట్స్ సీక్వెన్స్ లో జీప్ నీళ్ళలోకి దూకడం, అక్కడి నుంచి ఒడ్డుకి చేరడం లాంటి సీన్స్ సరిగా సెట్ అవ్వలేదు.

సాంకేతిక విభాగం :

ప్రసాద్ మూరెళ్ళ అందించిన సినిమాటోగ్రఫీ చాలా బాగుంది. సినిమాలో చూపించిన ప్రతి లొకేషన్ ని చాలా బాగా కెమరాలో బందించి ప్రేక్షకుల కళ్ళకు కనువింపు కలిగేలా తెరపై ఆవిష్కరించారు. అలాగే దేవీశ్రీ ప్రసాద్ అందించిన సాంగ్స్ మరియు బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ సినిమాకి చాలా హెల్ప్ అయ్యింది. సినిమాలో చాలా కీలకమైన సన్నివేశాల్లో దేవీశ్రీ బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ చాలా బాగుంది. ప్రవీణ్ పూడి ఎడిటింగ్ ఓకే.

ఇక మన మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ మరోసారి తన మాటలతో థియేటర్ కి వచ్చిన ప్రేక్షకులని కడుపుబ్బా నవ్వించాడు. అలాగే ఒక డైరెక్టర్ గా స్టార్ హీరో ఇమేజ్ ఉన్న పవర్ స్టార్ ని ఎలా చూపిస్తే ప్రేక్షకులు ఇష్టపడతారో, అలాగే ఆయన నుంచి ఏమేమి కోరుకుంటారో అనే అంశాలన్నిటినీ కలగలిపి ఇచ్చిన ప్యాకేజీనే ‘అత్తారింటికి దారేది’. కావున ఆయన డైరెక్టర్ కా కూడా సక్సెస్ అయ్యాడు. నిర్మాణ విలువలు చాలా రిచ్ గా ఉన్నాయి.

తీర్పు :

‘అత్తారింటికి దారేది’ – 169 నిమిషాల పాటు సీట్లలోనుంచి కదలకుండా పొట్ట చెక్కలయ్యేలా నవ్వుకోగలిగిన పర్ఫెక్ట్ ఫ్యామిలీ ఎంటర్టైనర్. చాలా రోజులుగా సరైన సినిమాలేక ఎంతో ఆకలితో ఎదురు చూస్తున్న తెలుగు ప్రేక్షకులకి పండగ భోజనం లాంటి సినిమా ఇది, అదే పవన్ ఫ్యాన్స్ కి అయితే 15 రోజుల ముందే దసరా వచ్చేసినట్టు లెక్క. కామెడీ పంచ్ లతో పవర్ స్టార్ ఎనర్జిటిక్ పెర్ఫార్మన్స్, త్రివిక్రమ్ మాటల గారడి, సమంత గ్లామర్, దేవీశ్రీ మ్యూజిక్ సినిమాకి బిగ్గెస్ట్ ప్లస్ పాయింట్స్. చివరిగా చాలా కాలం తర్వాత ఎలాంటి భూతు లేకుండా తీసిన సినిమా మరియు కుటుంబ సమేతంగా థియేటర్ కి వెళ్ళి పొట్ట చెక్కలయ్యేలా నవ్వుకుంటూ ఓ మంచి ఫీల్ తో బయటకి వచ్చే సినిమా అంటే ‘అత్తారింటికి దారేది’.

123తెలుగు.కామ్ రేటింగ్ : 4/5

రాఘవ

CLICK HERE FOR ENGLISH REVIEW

సంబంధిత సమాచారం

తాజా వార్తలు