సమీక్ష : అవంతిక – భయపెట్టలేదు.. నవ్వించలేదు

సమీక్ష : అవంతిక – భయపెట్టలేదు.. నవ్వించలేదు

Published on Jun 16, 2017 11:40 PM IST
Avanthika movie review

విడుదల తేదీ : జూన్ 16, 2017

123తెలుగు.కామ్ రేటింగ్ : 2/5

దర్శకత్వం : శ్రీరాజ్ బల్ల

నిర్మాత : తుమ్మలపల్లి రామసత్యనారాయణ

సంగీతం : రవిరాజ్ బల్

నటీనటులు : పూర్ణ, శ్రీరాజ్ బల్లా, గీతాంజలి, అజయ్ఘోష్, షియాజీ షిండే

ఈ మధ్య కాలంలో తెలుగులో బాగా ఆదరణ పొందిన హర్రర్ కామెడీ జోనర్, ఇప్పటికి సొసైటీలో పేరుకుపోయిన మూఢనమ్మకాలు, నరబలుల నేపధ్యం లో వచ్చిన సినిమానే అవంతిక. భీమవరం టాకీస్ ప్రొడక్షన్ లో రూపొంది ఈరోజే విడుదలైన ఈ సినిమా మరి ఏ మేరకు అలరించింది అనే విషయం కాస్త తెలుసుకునే ప్రయత్నం చేద్దాం..

కథ:

కోటీశ్వరుడైన అబ్బాయిని పెళ్లి చేసుకొని, తన పేరుకు తగ్గట్టే రాజభోగాలు అనుభవించాలని కలలు కనే ఓ అమాయకపు పల్లెటూరి ఆడపిల్ల అవంతిక(పూర్ణ). అయితే డబ్బుకు ఆశపడిన ఆమె అక్క, బావ ఆమెకు లక్ష్మి పూజ చేస్తే కోటీశ్వరుడైన మొగుడు వస్తాడని నమ్మబలికి ఆమెని ఓ రాజకీయ నాయకుడు(అజయ్ ఘోష్) కి అప్పగిస్తారు. నరబలి ఇస్తే అదృష్టం కలిసి వస్తుందని బాబా(షియాజీ షిండే) చెప్పిన మాటలు విని, అందరు కలిసి అవంతికని ఒక అపార్ట్ మెంట్ లో పూజలో కూర్చోబెట్టి నరబలి ఇచ్చేస్తారు.

అలా చనిపోయిన అవంతిక ఆత్మ తనని బలిచ్చిన ఫ్లాట్ లోనే ఉంటుంది. అదే ఫ్లాట్ ని పల్లెటూరి నుంచి వచ్చిన శ్రీను (శ్రీ రాజ్) కొనుక్కుంటాడు. సూరి ఆ ఇంట్లోకి ప్రవేశించాక అవంతిక ఆత్మ వలన అతనికి కష్టాలు మొదలవుతాయి. ఇంతకి అవంతిక ఆ ఫ్లాట్ లో ఆత్మగా ఉండటానికి కారణం ఏమిటి? అవంతిక ఆత్మ నుంచి శ్రీను ఆ ఇంటిని తిరిగి ఎలా సొంతం చేసుకున్నాడు? అనేది అవంతిక సినిమా కథ.

ప్లస్ పాయింట్స్:

సినిమాకి ప్రధాన బలం అని చెప్పుకోవాలంటే ముందుగా పూర్ణ గురించి చెప్పుకోవాలి. ఆమె పాత్ర పరిధి మేరకు, ఆశల పల్లకిలో ఊరేగే అమాయకుపు పల్లెటూరి ఆడపిల్లగా, పగతో రగిలిపోయే ఆత్మగా తన నటన సామర్ధ్యం ఎంత వరకు చూపించాలో అంత చూపించింది. అలాగే హీరో కమ్ డైరెక్టర్ శ్రీరాజ్ కథ మొత్తం తన భుజం మీద వేసుకొని నడిపించాడు. హీరోయిన్ గా చేసిన గీతాంజలి కూడా అమాయకపు పల్లెటూరి అమ్మాయిగా బాగానే ఆకట్టుకుంది. హీరో స్నేహితులుగా చేసిన నటులు కూడా ఉన్నంతలో బాగానే చేశారు.

తరువాత సీనియర్ నటులైన షియాజీ షిండే, అజయ్ ఘోష్ వాళ్ళ పాత్రల పరిధి మేరకు ఒకే అనిపించుకున్నారు. అలాగే సినిమాలో ఉన్న రెండు పాటలు సినిమాగా చాలా బలం ఇచ్చే విధంగా ఉన్నాయి. అలాగే నరబలి అనే అంశం కూడా కొంత వరకు ఓకే అనిపిస్తుంది. కమెడియన్ ధనరాజ్, షకలక శంకర్ ల కామెడీతో పాటు హర్రర్ సన్నివేశాల్లోని గ్రాఫికల్ కంటెంట్ ఆకట్టుకుంది.

మైనస్ పాయింట్స్:

సినిమాకి ప్రధానంగా మైనస్ అని చెప్పుకోవాలంటే దర్శకుడు ఎంచుకున్న కథ, దానికి రాసుకున్న స్క్రీన్ ప్లే. అలాగే హర్రర్ కామెడీ నేపధ్యంలో తీయాలనుకున్న ఈ సినిమాలో వచ్చే సన్నివేశాలు అటు హర్రర్ ఫీలింగ్ ని కానీ, ఇటు కామెడీ ఫీలింగ్ ని కానీ అందించకపోగా చప్పగా సాగుతూ నిరుత్సాహపరిచాయి. అసలు దర్శకుడు శ్రీరాజ్ ఈ చిత్రం ద్వారా చెప్పాలనుకున్న నరబలి అనే అంశాన్ని పూర్తిగా పక్కన పెట్టి మరల రొటీన్ ఘోస్ట్ రివెంజ్ డ్రామా లోకి వెళ్లిపోవడంతో అసలు అంశం గాలిలో కలిసిపోయింది. సినిమా చూస్తున్నంత సేపు కీలకమైన ఒక్క సన్నివేశం కూడా ఆసక్తికరంగా, ఎంటర్టైనింగా అనిపించలేదు.

సినిమాలో పాత్రల మధ్య భావోద్వేగాల్ని పండించడంలో దర్శకుడుగా శ్రీరాజ్ పూర్తిగా విఫలమయ్యాడనే చెప్పాలి. అజయ్ ఘోష్, షియాజీ షిండే, ధనరాజ్, షకలక శంకర్ లాంటి నటులని పెట్టుకొని కూడా వారిని సరిగా ఉపయోగించుకోలేదు. కొన్ని చోట్ల హార్రర్ సినిమా అంటే అరుపులు, కేకలు ఉంటే భయపడిపోతారని అనుకోని దర్శకుడు సన్నివేశాలు రాసుకున్నాడేమో అనిపిస్తుంది. అలాగే హీరో శ్రీరాజ్, హీరోయిన్ గీతాంజలి మధ్య వచ్చే రొమాంటిక్ లవ్ స్టొరీ కూడా అంతగా కనెక్ట్ కాలేదు. సినిమా చూస్తున్నంత సేపు దర్శకుడు మీద తమిళ సినిమాలు, రాజుగారి గది వంటి సినిమాల ప్రభావం బాగా పనిచేసినట్టు అనిపిస్తుంది.

సాంకేతిక విభాగం:

ఎలాంటి పస లేని ఇలాంటి కథ మీద పెట్టుబడి పెట్టి సినిమాని తెరకెక్కించాడంటే నిర్మాతని కాస్తా మెచ్చుకోవాల్సిందే. అయితే సినిమాలో ఉన్నంతలో బాగానే బడ్జెట్ పెట్టారని అనిపిస్తుంది. సినిమాలో ఉన్న రెండు సాంగ్స్ చాలా భాగా ఆకట్టుకుంటాయి. అటు సాహిత్యం, ఇటు సంగీతం కూడా కాస్తా వినసొంపుగా ఉంటాయి. ఈ విషయంలో సంగీత దర్శకుడుగా రవిరాజ్ కు మంచి మార్కులు వేసుకోవచ్చు. అయితే నేపధ్య సంగీతం మాత్రం అనుకున్న స్థాయిలోలేదు. ఇక సినిమాటోగ్రఫీ బాగానే ఆకట్టుకుంటుంది. పల్లెటూరి నేపధ్యంలో వచ్చే మొదటి సగభాగంలో సన్నివేశాలని ఉన్నదాంట్లో చాలా గొప్పగా చూపించే ప్రయత్నం చేశారు. ఎడిటింగ్ కూడా పర్వాలేదనిపించుకుంటుంది. అలాగే దెయ్యాన్ని రీవీల్ చేసే సన్నివేశాల్లో ఉపయోగించిన గ్రాఫిక్స్ బాగున్నాయి.

తీర్పు:

మొత్తానికి ఈ సినిమా గురించి చెప్పాలంటే నరబలి అనే ఒక మూఢనమ్మకం చుట్టూ దర్శకుడు రాసుకున్న కథ, కథనం ఇది వరకు వచ్చిన హర్రర్ కామెడీ సినిమాల తరహాలోనే కొనసాగుతూ రొటీన్ గా అనిపించే విధంగా ఉండటంతో ఒక సాదాసీదా సినిమాగా అవంతిక మిగిలిపోతుంది. షకలక శంకర్, ధనరాజ్ ల కామెడీ, రెండు పాటలు మినహా ఇందులో ఎంజాయ్ చేయడానికి మరే అంశమూ దొరకదు. కనుక ఈ వారాంతంలో ఈ సినిమాని కాస్త పక్కనబెట్టడం మంచిది.

123telugu.com Rating : 2/5

Reviewed by 123telugu Team

Click here for English Review

సంబంధిత సమాచారం

తాజా వార్తలు