సమీక్ష : బాలకృష్ణుడు – రొటీన్ కమర్షియల్ సినిమా

సమీక్ష : బాలకృష్ణుడు – రొటీన్ కమర్షియల్ సినిమా

Published on Nov 24, 2017 5:50 PM IST
Balakrishnudu movie review

విడుదల తేదీ : నవంబర్ 24, 2017

123తెలుగు.కామ్ రేటింగ్ : 2.75/5

దర్శకత్వం : పవన్ మల్లెల

నిర్మాత : బి.మహేంద్ర బాబు, ముసునూరు వంశీ, శ్రీవినోద్ నందమూరి

సంగీతం : మణిశర్మ

నటీనటులు : నారా రోహిత్, రెజినా

కొత్త కాన్సెప్ట్స్ ఎప్పటికపుడు కొత్తదనం చూపించే హీరో నారా రోహిత్ ఈసారి ‘బాలకృష్ణుడు’ రూపంలో కమర్షియల్ సినిమా రూపంలో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. పవన్ మల్లెల దర్శకత్వం వహించిన ఈ సినిమా ఈరోజే ప్రేక్షకుల ముందుకొచ్చింది. మరి ఈ సినిమా ఎలా ఉందో ఇప్పుడు చూద్దాం..

కథ:

సినిమాలో పాత కక్షల వల్ల భానుమతి దేవి (రమ్య కృష్ణ) తన అన్నను పోగొట్టుకుంటుంది. తన మేనకొడలు ఆద్య (రెజీనా) ను హైదరాబాదులో జాగ్రత్తగా ఉంచమని అనుచరులకు చెప్పడంతో.. డబ్బు కోసం ఏ పనైనా చేసే బాలు (నారా రోహిత్)ను సంపాదిస్తారు భానుమతి దేవి అనుచరులు. ఒక సందర్భంలో ఆద్య బాలు ప్రేమలో పడుతుంది. ఆధ్య ప్రేమను బాలు అంగీకరించాడా? ఆమెను సురక్షితంగా ఇంటికి ఎలా చేర్చాడు ? అనేదే ఈ సినిమా కథ.

ప్లస్ పాయింట్స్:

సినిమాకి ప్రధాన ప్లస్ పాయింట్ పృథ్వి కామెడీ ప్రధాన ఆకర్షణగా నిలిచింది. ఇంటర్వెల్ ముందు కథలోకి ప్రవేశించిన ఆయన తన ఎవర్జిటిక్ పెర్ఫార్మెన్స్ తో ఆకట్టుకున్నాడు. నారా రోహిత్ క్యారెక్టర్ బాగుంది. పాత్రకు తగ్గట్టు బాగా నటించాడు. హీరోయిన్ రెజీనా ఈ సినిమాలో అందంగా కనిపించింది. మణిశర్మ నేపధ్య సంగీతం బాగుంది.

పాటల చిత్రీకరణ కోసం ఫారిన్ లొకేషన్స్ లో సాంగ్స్ తీయడం జరిగింది, సెకండ్ హాఫ్ లో వచ్చే మెలోడీ సాంగ్ ఆకట్టుకుంటోంది. సీమ ప్రాంతాల్లో జనాలు ఏవిధంగా ఉంటారు, వారి మనోభావాలు ఎలా ఉంటాయి అన్న అంశాలను మొదటి 10 నిముషాల్లో బాగా చూపించారు. శ్రీనివాస్ రెడ్డి కామెడీ అక్కడక్కడా పండింది. భానుమతి దేవి పాత్రలో రమ్యకృష్ణ చక్కగా నటించింది.

మైనస్ పాయింట్స్:

దర్శకుడు ఎంచుకున్న పాయింట్ చాలా పాతది. ఇప్పటికే ఎన్నో సినిమాల్లో వాడిన ఈ ఫార్ములాను రోహిత్ ఎలా ఒప్పుకున్నారు అనే భావం కలుగుతుంది. ఈ కథకు ఫ్యాక్షన్ జోడించి రాసిన సన్నివేశాలు కూడా ఆసక్తికరంగా లేకపోవడంతో ప్రేక్షకులు బోర్ ఫీల్ అయ్యే అవకాశాలున్నాయి. మొదటి పది నిముషాల తర్వాత సినిమా ఎలా పడితే అలా వెళ్లిపోవడం, అనవసర పాత్రలు కథలోకి ప్రవేశించడంతో చిరాకు పెట్టింది.

హీరో డబ్బుకోసం ఏమైనా చేస్తాడు అలాంటి హీరోకు హీరోయిన్ ను కంటికి రెప్పలా కాపాడితే రోజుకు రెండు లక్షలు ఇస్తారు. ఈ పాయింట్ వినడానికే కాదు చూడ్డానికి చాలా సిల్లీగా ఉంది. కథకు సంబందం లేని ఇలాంటి చాలా సీన్స్ ఈ సినిమాలో ఉన్నాయి. వాటి వలన సినిమాలో సీరియస్ నెస్ అనేదే లేకుండా పోయింది. ఆలాగే పాటలు సందర్భం లేకుండా వస్తాయి.

సాంకేతిక వర్గం:

నూతన దర్శకుడు పవన్ మల్లెల తను చెప్పాలనుకున్న పాత పాయింట్ ను కొత్తగా చెప్పడానికి ట్రై చేయకపోవడం, పాత, బలహీనమైన సన్నివేశాలు రాసుకోవడంతో సినిమా రక్తి కట్టించలేకపోయింది. మణిశర్మ అందించిన ఒక మెలోడి సాంగ్, రీరికార్డింగ్ బాగున్నాయి.

సినిమాటోగ్రఫీ బాగుంది. యాక్షన్ సన్నివేశాల్ని బాగా చూపించారు. డైలాగ్స్ పర్వాలేదు. ఎడిటింగ్ ద్వారా కొన్ని అనవసర సన్నివేశాలని తొలగించి ఉండాల్సింది. నిర్మాతలు పాటించిన నిర్మాణ విలువలు బాగున్నాయి.

తీర్పు:

మొత్తం మీద ఈ ‘బాలకృష్ణుడు’ చిత్రం ఏమాత్రం కొత్తదనం లేని రొటీన్ రెగ్యులర్ కమర్షియల్ ఎంటర్టైనర్. సాధారణమైన కథ, ఊహించదగిన కథనం సినిమాపై ఆసక్తిని సన్నగిల్లేలా చేస్తాయి. మొత్తం మీద కామెడీతో కూడిన రెగ్యులర్ మాస్ మసాలా సినిమాను ఇష్టపడేవాళ్ళకు ఈ సినిమా అక్కడక్కడా నచ్చుతుందేమో కానీ నచ్చకపోవచ్చు.

123telugu.com Rating : 2.75/5

Reviewed by 123telugu Team


Click here for English Review

సంబంధిత సమాచారం

తాజా వార్తలు