సమీక్ష : ఛలో – సరదాగా నవ్వుకోవచ్చు

విడుదల తేదీ : ఫిబ్రవరి 2, 2018

123తెలుగు.కామ్ రేటింగ్ : 3.25/5

నటీనటులు : నాగ శౌర్య, రష్మిక మందన్న

దర్శకత్వం : వెంకీ కుడుములు

నిర్మాత : ఉష మల్పూరి

సంగీతం : మహతి స్వర సాగర్

సినిమాటోగ్రఫర్ : సాయి శ్రీరామ్

ఎడిటర్ : కోటగిరి వెంకటేశ్వరరావ్

స్టోరీ, స్క్రీన్ ప్లే : వెంకి కుడుములు

యంగ్ హీరో నాగ శౌర్య నటించిన తాజా చిత్రం ‘ఛలో’. నూతన దర్శకుడు వెంకి కుడుములు దర్శకత్వం వహించిన ఈ సినిమా ఈరోజు ప్రీమియర్ల రూపంలో ప్రదర్శింపబడింది. మరి ముందు నుండి పాజిటివ్ క్రేజ్ ను కలిగి ఉన్న ఈ చిత్రం ఏ స్థాయిలో ఉందో ఇప్పుడు చూద్దాం…

కథ:

హరి (నాగ శౌర్య)కి చిన్నతనం నుండి గొడవలంటే చాలా ఇష్టం. అందరు పిల్లలు ఆడుకుని ఆనందిస్తే హరి మాత్రం కొట్లాటల్లో సంతోషాన్ని పొందుతుంటాడు. అలా అతను పెరుగుతున్న కొద్ది గొడవలు కూడా ఎక్కువవుతుంటాయి.

దాంతో వాళ్ళ నాన్న అతన్ని హైదరాబాద్ నుండి ఆంధ్ర, తమిళనాడు సరిహద్దులో ఉండే తిరుప్పురం అనే ఊరికి పంపిస్తాడు. కానీ ఆ ఊళ్ళో జనాలు మాత్రం రెండుగా విడిపోయి పగ ప్రతీకారాలతో బ్రతుకుతుంటారు. హరిని వాళ్ళ నాన్న ప్రత్యేకంగా అలాంటి ఊరికే ఎందుకు పంపాడు, ఆ ఊరి గొడవేంటి, ఆ ఊరు హరి జీవితంలో ఎలాంటి మార్పులు తీసుకొచ్చింది అనేదే సినిమా.

ప్లస్ పాయింట్స్ :

దర్శకుడు వెంకి కుడుములు కొద్దిగా కొత్తగా అనిపించే కథాంశాన్ని ఎంచుకుని దానికి పుష్కలంగా కమర్షియల్ హంగులను దట్టించి రాసుకున్న కథనమే ఈ సినిమాకి ప్రధాన ప్లస్ పాయింట్. ఈ మధ్య కాలంలో వస్తున్న చాలా సినిమాల్లో దొరకని కొత్త తరహా ఫన్ ఈ సినిమాలో లభిస్తుంది. హీరో దగ్గర్నుండి కథలో ఇన్వాల్వ్ అయిన ప్రతి ముఖ్య పాత్రలోనూ ఎంటర్టైన్మెంట్ ను చూపించిన దర్శకుడు చాలా చోట్ల నవ్వుకునేలా చేశాడు.

సినిమా ఆరంభాన్ని హీరో పాత్ర చిత్రీకరణతో ఆసక్తిగా మొదలుపెట్టి మధ్య మధ్యలో సత్య, వైవా హర్ష, సుదర్శన్ వంటి కమెడియన్లతో తెలుగు, తమిళ వ్యక్తుల మధ్య నడిచే సరదా సరదా హాస్యాన్ని అందించి ఇంటర్వెల్ సమయానికి థ్రిల్ చేసే ట్విస్ట్ ఇచ్చి ఆకట్టుకున్నాడు. అలాగే హీరో హీరోయిన్ల మధ్యన కూడా రొటీన్ సినిమాల్లా కాకుండా కొంత ఫ్రెష్ గా అనిపించే లవ్ ట్రాక్ ను పెట్టి కథను నడిపాడు.

ఇక సెకండాఫ్లో సినిమా కిందకి పడిపోతోంది అనే సమయంలో స్టార్ కమెడియన్ వెన్నెల కిశోర్ ను ప్రవేశపెట్టి చాలానే పంచులు పేల్చి నవ్వులు పూయించాడు. హీరో నాగ శౌర్య, హీరోయిన్ రష్మిక మందన్నలు కూడా సెటిల్డ్ పెర్ఫార్మెన్స్ తో అలరించారు.

మైనస్ పాయింట్స్ :

ఫస్టాఫ్ ఆరంభమైన కొద్దిసేపటికే కథకు ముఖ్యమైన తిరుప్పురం గ్రామంలోకి తీసుకెళ్లిన దర్శకుడు ఊరిలోని జనాల మధ్యన ఉండే గొడవల్ని ఫన్ కోసం కొంత తేలిగ్గా చూపించడంతో సినిమాలో సీరియస్ నెస్ కొంత లోపించింది. అలాగే ద్వితీయార్థం ఫస్టాఫ్ ఇచ్చినంత ఎంటర్టైన్మ్నెట్ ను ఇవ్వలేకపోయింది. వెన్నెల కిశోర్ కామెడీ, కొన్ని ఫన్నీ సీన్స్ లేకుంటే ఫలితం కొంత తారుమారయ్యేదే.

అలాగే ద్వితీయార్థంలో కథలోని కీలకమైన మలుపులు ఉండాల్సినదానికంటే, ఊహించిందానికంటే తక్కువ స్థాయిలో ఉండటం వలన సినిమా బలం కోల్పోతున్న ఫీలింగ్ కలిగింది. మరీ ముఖ్యంగా కొన్ని దశాబ్దాల నుండి జరుగుతున్న ఊరి గొడవల వెనకున్న కారణం, క్లైమాక్స్ లో కథ సుఖాంతమైన తీరు నవ్వు తెప్పించే విధంగానే ఉన్న కొంత సిల్లీగా ఉండటం ప్రేక్షకుడికి మింగుడుపడదు. ఈ ముఖ్యమైన చోట్ల దర్శకుడు కమర్షియాలిటీని తగ్గించి ప్రేక్షకుడి ఎమోషన్స్ కి ప్రియారిటీ ఇచ్చి ఉంటే బాగుండేది.

సాంకేతిక విభాగం :

దర్శకుడు వెంకి కుడుములుకు ఇది మొదటి సినిమానే అయినా విజయాన్నివ్వగల కమర్షియల్ అంశాలని కథనంలో చక్కగా ఇమిడ్చి మంచి ఫన్ అందించాడు. కొంత సిల్లీగా అనిపించే క్లైమాక్స్ మినహా ఎక్కడా మరీ వేలెత్తి చూపాల్సిన తప్పులేవీ చేయలేదు. సినిమాటోగ్రఫర్ సాయి శ్రీరామ్ తన కెమెరా పనితనంతో చిత్రాన్ని అందంగా తయారుచేశాడు.

కోటగిరి వెంకటేశ్వరరావుగారి ఎడిటింగ్ బాగుంది. సంగీత దర్శకుడు మహతి స్వర సాగర్ సంగీతం బాగుంది. ముఖ్యంగా ‘చూసి చూడంగానే నచ్చేశావే’ పాట కొన్నిరోజుల పాటు గుర్తుండిపోతుంది. ఉష మల్పూరిగారు ఎక్కడా రాజీ పండకుండా పాటించిన నిర్మాణ విలువలు సినిమా స్థాయిని పెంచాయి.

తీర్పు :

నాగ శౌర్య చేసిన ఈ ‘ఛలో’ చిత్రం మంచి కామెడీతో సరదాగా నవ్వుకునేలా ఉంది. కొంత కొత్తదైన కథాంశం, మంచి ఫన్ నింపి దర్శకుడు తయారుచేసిన కథనం, లవ్ ట్రాక్, సెకండాఫ్లో వచ్చే వెన్నెల కిశోర్ కామెడీ, ప్రధాన నటీనటుల నటన ఈ సినిమాలో అలరించే అంశాలు కాగా కొంత నెమ్మదించిన ద్వితీయార్థం, సిల్లీగా తోచే క్లైమాక్స్ కొంత నిరుత్సాహపరుస్తాయి. మొత్తం మీద ఫ్రెష్ కామెడీని, క్వాలిటీ సినిమాని కోరుకునే వారికి, కుటుంబ ప్రేక్షకులకు ఈ చిత్రం నచ్చుతుంది.

123telugu.com Rating : 3.25/5

Reviewed by 123telugu Team

Click here for English Review

సంబంధిత సమాచారం :

More