సమీక్ష : చిన్ని చిన్ని ఆశలు నాలో రేగెనే – బోరింగ్ రోటీన్ సినిమా

Cheliyaa movie review

విడుదల తేదీ : ఏప్రిల్ 7, 2017

123తెలుగు.కామ్ రేటింగ్ : 2/5

దర్శకత్వం : సంతోష్ నేలంటి

నిర్మాత : రజిని గట్టు

సంగీతం : రాప్ రాక్ షకీల్

నటీనటులు : పవన్, సోనియా దీప్తి

నూతన దర్శకులు, నటీ నటులు సినిమా చేయాలనుకున్నప్పుడు వాళ్లకు గుర్తొచ్చే మొదటి ఆలోచన లవ్ స్టోరీస్. మూవీ కాస్త క్లిక్కయిన మంచి ఆదరణ దక్కుతుందనేది వాళ్ళ ఐడియా. ప్రస్తుతం ఇదే ఐడియాతో నూతన దర్శకుడు సంతోష్ నేలంటి చేసిన సినిమానే ఈ ‘చిన్ని చిన్ని ఆశలు నాలో రేగెనే’. అయితే వారి ఆలోచన ఎంత వరకు వర్కవుట్ అయిందో ఇప్పుడు చూద్దాం..

కథ :
తనకి కూడా ఒక ప్రేయసి ఉంటే బాగుంటుందని అనుకునే కుర్రాడు సంతోష్ (పవన్). తనకి దొరికిన ఒక సిమ్ కార్డు ద్వారా తన పేరుని రాహుల్ గా మార్చుకుని నిత్య (సోనియా దీప్తి) అనే అమ్మాయిని కలుస్తాడు. మొదటి కలయికలోనే ఆమెను ప్రేమిస్తాడు. నిత్య కూడా తనతో ఫోన్లో మాట్లాడిన వ్యక్తి కలిసిన వ్యక్తి ఒక్కరే అనుకుని అతన్ని ప్రేమిస్తుంది.

అలా సంతోష్ ప్రేమలో ఉండగానే అతను ఎవరి పేరుతో అయితే మోసం చేస్తున్నాడో ఆ పేరు గల అసలు వ్యక్తి ఎవరనేది తెలుస్తుంది. ఆ అసలు వ్యక్తి ఎవరు ? అతను బయటికి రావడంతో సంతోష్ కు ఎలాంటి ఇబ్బందులొచ్చాయి ? నిత్య వెనక ఉన్న అసలు కథేమిటి ? చివరికి సంతోష్ ప్రేమ సక్సెస్ అయ్యిందా లేదా ? అనేదే సినిమా.

ప్లస్ పాయింట్స్ :

ఈ రొటీన్ లవ్ స్టోరీలో పెద్దగా చెప్పుకోదగిన ప్లస్ పాయింట్స్ అంటే ఏమీ లేవు. అయితే అక్కడక్కడా కొన్ని సీన్లు మాత్రం పరవాలేదు అనిపించాయి. వాటినే ఇప్పుడు ప్రస్తావిద్దాం. సెకండాఫ్ సమయంలో రివీల్ అయ్యే నిత్య ప్రేమించిన నిజమైన రాహుల్ ఎవరనే పాయింట్ కాస్త పర్వాలేదనిపిస్తుంది.

అలాగే సంతోష్ మోసం చేసి ప్రేమించిన నిత్య వెనకున్న అసలు నిజం ఏమిటనేది కూడా ఆసక్తికరంగా అనిపించింది. ఇద్దరు వ్యక్తులు చిన్న పొరపాటు వలన ఎలా ప్రేమికులవుతారు అనే అంశాన్ని సినిమాగా చేయాలనుకున్న దర్శకుడి ఆలోచన బాగుంది. ఇక జబర్దస్త్ అప్పారావ్ కామెడీ అక్కడక్కడా నవ్వించింది. హీరోయిన్ పాత్రలో చేసిన సోనీ దీప్తి యాక్టింగ్ సినిమాలో చెప్పుకోదగ్గ మరో అంశం.

మైనస్ పాయింట్స్ :

ఇందులో బలహీనతలు బలంగానే ఉన్నాయి. వాటిలో ముఖ్యంగా చెప్పుకోవలసింది హీరో పాత్ర చేసిన పవన్ గురించి. ఒక నటుడికి ఉండాల్సిన కనీస కంటెంట్ కూడా అతనిలో కనిపించలేదు. మొదటిసారి కెమెరా ముందుకొచ్చి ఎలా పడితే అలా చేసినట్టున్నాడు. అతను కనిపించిన ఒక్క ఫ్రేమ్ లో కూడా పర్ఫెక్షన్ లేదు. హావభావాలు, మాటలు ఇలా దేనిలోనూ అతను మెప్పించలేకపోయాడు. ఇక దర్శకుడు సంతోష్ నేలంటి ప్రేమ కథను డిఫరెంట్ గా తీద్దామనుకున్న అతని ఆలోచన బాగుంది కానీ చేసిన ప్రయత్నమే మరీ దారుణంగా ఉంది.

ఏమాత్రం బలంలేని కథనాన్ని రాసుకుని, అందులో పరిమితిలేని నటీనటులను నటింపజేయడం వలన అతని ప్రయత్నంలో ప్రయోజనం లేకుండా పోయింది. ఇక ఫస్టాఫ్ ఆరంభం నుండే నటీనటుల పేలవ నటనతో నీరసమొస్తే మధ్యలో వచ్చే లవ్ ట్రాక్ లు చిరాకు పుట్టించాయి. మరీ ముఖ్యంగా తరచూ కనిపించే హీరో ఫ్రెండ్స్ సన్నివేశాలు విసుగెత్తించాయి. మధ్యలో ఎందుకొస్తున్నాయో కూడా తెలీని తాగుబోతు రమేష్ ఎపిసోడ్, షకలక శంకర్ ట్రాక్ లు తలపట్టుకునేలా చేశాయి. కథకు తగిన విధంగా లేని సంభాషణలు, నటీనటుల కదలికలు సినిమాకు పెద్ద అడ్డంకులుగా నిలిచాయి.

పర్లేదు ఇంటర్వెల్ మలుపు కాస్త బాగుందని సెకండాఫ్ మీద కాస్త హోప్స్ పెట్టుకుంటే అది మొదటి భాగం కన్నా దారుణంగా ఉండి సహనానికి పరీక్ష పెట్టింది. చిత్రం ఆరంభం నుండి చివరి దాకా అటు టెక్నీకల్ టీమ్ గాని, ఇటు నటీనటుల్లో గాని ఎక్కడా ఒక సినిమా తీస్తున్నాం అనే కనీస జాగ్రత్త కనిపించలేదు.

సాంకేతిక విభాగం :

సినిమాటోగ్రఫీ అడ్డదిడ్డంగా ఉంది. ఏ ఫ్రేమ్ ఎవర్ని టార్గెట్ చేస్తుందో అస్సలు అర్థం కాలేదు. ఇక రాప్ రాక్ షకీల్ అందించిన సంగీతం ఏ మాత్రం ఆకట్టుకోకపోగా పాటలు ఎప్పుడెప్పుడు అయిపోతాయా అనిపించింది. నిర్మాతలు పాటించిన నిర్మాణ విలువలు తక్కువ స్థాయిలోనే ఉన్నాయి. ఎడిటింగ్ ద్వారా కొన్ని అనవసరమైన సన్నివేశాల్ని చాలా వరకు తొలగించి ఉంటే బాగుండేది.

తీర్పు:

ప్రేమ కథలన్నీ రొటీన్ కథలే అయినా స్క్రీన్ ప్లే, టేకింగ్ లో కాస్తయినా కొత్తదనముంటే ప్రేక్షకులు ఎంతో కొంత ఆదరిస్తారు. కానీ ఈ చిత్రంలో ఆ కాస్త కంటెంట్ కూడా దొరకలేదు. ఒక ఇంటర్వెల్ మలుపులో హీరోయిన్ సోనియా దీప్తి యాక్టింగ్ పర్వాలేదనిపించగా..అయితే ఏమాత్రం పరిణితి లేని హీరో, ఇతర నటీనటుల నటన, పూర్తిగా జాగ్రత్త లోపించిన దర్శకత్వం, విసిగించే ఫస్టాఫ్, సెకండాఫ్ కథనాలు, అనవసరమైన నటీనటులు, వారిపై వచ్చే బలవంతపు సన్నివేశాలు ఈ సినిమాని భరించలేనిదిగా మార్చాయి. ఒక్క మాటలో చెప్పాలంటే ఇదొక బోరింగ్ రోటీన్ సినిమా.

123telugu.com Rating : 2/5

Reviewed by 123telugu Team

Click here for English Review

సంబంధిత సమాచారం :