సమీక్ష : సినీ మహల్ – కావలసిన ఎంటర్టైన్మెంట్ ఇవ్వలేదు

Cine Mahal movie review

విడుదల తేదీ : మార్చి 31, 2017

123తెలుగు.కామ్ రేటింగ్ : 2.5/5

దర్శకత్వం : లక్ష్మణ్ వర్మ

నిర్మాత : బి.రమేష్

సంగీతం : శేఖ‌ర్ చంద్ర‌

నటీనటులు :సిద్ధాంశ్ , రాహుల్, తేజస్విని

ప్రస్తుతం తెలుగులో చాలా ఈజీగా సేల్ అవుతున్న ఫార్ములాలు హర్రర్, థ్రిల్లర్. వీటిలో ఏ ఒక్కదాన్నైనా సరే పక్కాగా ఎగ్జిక్యూట్ చేస్తే సినిమా సక్సెస్ అవడం ఖాయం. అందుకే నూతన దర్శకులు, ప్రయోగాలు చేయాలనుకునేవాళ్ళు ఈ సూత్రాలనే నమ్ముకుంటున్నారు. ఇప్పుడు అదే బాటలో దర్శకుడు లక్ష్మణ్ వర్మ ఈ రెండు సూత్రాలను కలిపి హర్రర్ థ్రిల్లర్ గా రూపొందించిన చిత్రమే ఈ ‘సినీ మహల్’. మరి ఈ చిత్రం ఎలా ఉందో ఇప్పుడు చూద్దాం..

కథ :
ఒక పెద్దసైజు పల్లెటూర్లో తన తాత కట్టించిన టూరింగ్ టాకీస్ ను నడుపుకునే యువకుడు కృష్ణ తన నాన్న చేసిన అప్పును తీర్చి టాకీస్ కాపాడుకోవాలని కష్టపడుతుంటాడు. అందుకే తన టాకీస్లో ఏదైనా మంచి సినిమా వేసి ఆ డబ్బు సంపాదించాలని తనకు తెలిసిన డిస్ట్రిబ్యూటర్ వద్దకు వెళ్లి ’13’ అనే సినిమాను కొని తెచ్చుకుని షో వేస్తాడు.

కానీ టాకీస్లో కూర్చొని ఆ సినిమా చూసిన ప్రేక్షకుల్లో కొంత మంది అనూహ్యంగా చనిపోతుంటారు. దాంతో అసలు ఆ సినిమా వెనకున్న రహస్యమేమిటో తెలుసుకోవాలని హైదరాబాద్ వెళ్తాడు కృష్ణ. అలా వెళ్లిన కృష్ణ తెలుసుకున్న భయంకరమైన నిజాలేమిటి ? చివరికి కృష్ణ ఆ సమస్యను ఎలా పరిష్కరిస్తాడు ? అనేదే ఈ సినిమా కథ…

ప్లస్ పాయింట్స్ :

సినిమాలోని ప్రధాన ప్లస్ పాయింట్ అంటే హీరో యొక్క టూరింగ్ టాకీస్లో నడిచే సినిమా వెనకున్న నైపథ్యమే. ఆ నైపథ్యంలోని ఒక కీలకమైన అంశం బాగా ఆకట్టుకుంది. ఆ చిన్న పాయింట్ ద్వారా ఒక సినిమా చేయాలన్న దర్శకుడి ఆలోచన బాగుంది. ఫస్టాఫ్లో థియేటర్లో సినిమా చూసిన వాళ్ళు కొందరు చనిపోవడం, ఆ సినిమా వెనక్కున్న థ్రిల్ చేసే అసలు వాస్తవం వంటి అంశాలు బాగున్నాయి.

అలాగే హీరో ఫ్రెండ్ పాత్రలో కమెడియన్ సత్య చేసిన కామెడీ కూడా అక్కడక్కడా బాగానే పేలింది. ఇక ఇంటర్వెల్ సన్నివేశంలో సినిమా చూసిన వాళ్ళు ఎందుకు చనిపోతున్నారు అనే ప్రశ్నకు దొరికే జవాబు చాలా థ్రిల్లింగా అనిపించింది. నిజం తెలుసుకున్న హీరో సెకండాఫ్లో తన టాకీస్ నుండి ’13’ సినిమాను తీసేయడానికి చేసే ప్రయత్నాలు కూడా కాస్త ఆసక్తికరంగా ఉంటాయి.

మైనస్ పాయింట్స్ :

సినిమాలోని మైనస్ పాయింట్ అంటే అది కథనమే. ఫస్టాఫ్ ఆరంభం కాస్త బాగానే ఉన్నా పోను పోను సినిమా రొటీన్ గా తయారైంది. ఇంటర్వెల్ సమయంలో సినిమా వెనకున్న నిజం బయటపడే సన్నివేశం తప్ప మిగతా అంతా బోరింగానే సాగింది. ఇక ఈ కథలో ముఖ్యమైన సినిమా తీసే ఎపిసోడ్ అస్సలు ఆకట్టుకోలేదు. ఆ సన్నివేశాల్లో నటించిన నటీ నటుల నటన అంత ఆకర్షణీయంగా లేకపోవడం, మేకింగ్ కూడా తక్కువ స్థాయిలో ఉండటంతో ముఖ్యమైన ఆ ఎపిసోడ్ తేలిపోయింది.

ఇక సినిమా క్లైమాక్స్ అయితే మరీ నాటకీయంగా ఉంటుంది. హీరో అంతమంది చావుకి గల ఒక పెద్ద కారణాన్ని చాలా సింపుల్ గా ఒకే ఒక నిముషంలో తేల్చిపారేయడం అస్సలు బాగోలేదు. సమస్యను తెలుసుకోవడానికి చేసిన ప్రయత్నంలో కొంత కూడా సమస్య పరిష్కారానికి పెట్టకపోవడం అసంతృప్తిని మిగిల్చింది. సరే చేసిన ఆ చిన్న ప్రయత్నమైనా లాజికల్ గా రీజనబుల్ గా ఉందా అంటే అదీ లేదు.

సాంకేతిక విభాగం :
దర్శకుడు లక్ష్మణ్ వర్మ కథకు కావాల్సిన మూలాన్ని బాగానే తయారు చేసుకుని దాని ద్వారా సినిమా చేద్దాం అనుకోవడం బాగున్నా కూడా దాని చుట్టూ కావాల్సిన బలమైన కథ, కథనాలను పూర్తి స్థాయిలో అల్లుకోలేకపోయాడు. శేఖర్ చంద్ర అందించిన సంగీతం ఏమంత గొప్పగా లేదు. దొరై కె.సి.వెంకట్ సినిమాటోగ్రఫీ అక్కడక్కడా మాత్రమే పర్లేదనిపించింది. ప్రవీణ్ పూడి తన ఎడిటింగ్ ద్వారా ఇంకాస్త సెకండాఫ్ కథనాన్ని కట్ చేసి ఉండాల్సింది.

తీర్పు:

దర్శకుడు లక్ష్మణ్ వర్మ చేసిన ‘సినీ మహల్’ అనే ప్రయత్నం ఏమంత ఆకర్షణీయంగా లేదు. బాగుందనిపించే కీ పాయింట్, అక్కడక్కడా నవ్వించిన సత్య కామెడీ, ఫస్టాఫ్ ఆరంభం, ఇంటర్వెల్ లో అసలు వాస్తవం బయటపడటం ఈ సినిమాలో ప్లస్ పాయింట్స్ కాగా ఏమాత్రం ఆకట్టుకొని ఫస్టాఫ్, సెకండాఫ్ కథనాలు, పెద్దగా ప్రభావం చూపలేకపోయిన నటీనటుల నటన, నాటకీయంగా అనిపించే క్లైమాక్స్ ఎపిసోడ్ ఇందులో బలహీనతలుగా ఉన్నాయి. మొత్తం మీద చెప్పాలంటే ఈ ‘సినీ మహల్’ ప్రేక్షకుడికి కావాల్సిన ఎంటర్టైన్మెంట్ ను పూర్తి స్థాయిలో ఇవ్వలేదు.

123telugu.com Rating : 2.5/5

Reviewed by 123telugu Team

Click here for English Review

సంబంధిత సమాచారం :