రివ్యూ : “సినిమా బండి” – తెలుగు సినిమా (నెట్ ఫ్లిక్స్ లో ప్రసారం)

రివ్యూ : “సినిమా బండి” – తెలుగు సినిమా (నెట్ ఫ్లిక్స్ లో ప్రసారం)

Published on May 15, 2021 2:01 AM IST

దర్శకత్వం : ప్రవీణ్‌ కండ్రెగుల
సంగీతం : శిరీశ్‌ సత్యవోలు
స్క్రీన్ ప్లే : ప్రవీణ్‌ కండ్రెగుల
నిర్మాతలు : రాజ్‌ అండ్‌ డీకే
నటీనటులు : వికాస్ వశిష్ఠ, సందీప్ వారణాసి, రాగ్ మయూర్, త్రిషర త‌దిత‌రులు.

ఓటీటీ ప్రేక్షకులను అలరించేందుకు సినిమా బండి వచ్చేసింది. ప్రముఖ దర్శక ద్వయం, నిర్మాతలు అయినా రాజ్ అండ్ డీకే ఈ సినిమాను నిర్మించారు. ప్రవీణ్ అనే కొత్త దర్శకుడు దర్శకత్వం వహించాడు. మే 14న ప్రముఖ ఓటీటీ వేదిక ‘నెట్‌ఫ్లిక్స్‌’లో ఈ చిత్రం విడుదల అయింది. మరి ఈ సినిమా ఎలా ఉందో సమీక్షలోకి వెళ్లి తెలుసుకుందాం.

 

కథ :

 

వీర బాబు (వికాస్ వశిష్ఠ) ఒక ఆటోడ్రైవర్‌, అతనికి ఒక పెద్ద కెమెరా దొరుకుతుంది. దాంతో దాన్ని అమ్మాలనే ఆలోచన అనంతరం ఆ కెమరాతో ఒక సినిమా చేయాలని అతను నిర్ణయించుకుంటాడు. గణపతి అనే పెళ్లిల ఫోటోగ్రాఫర్ ను కెమెరామెన్ గా తీసుకుని, సెల్యూన్ షాప్ మర్దేశ్ బాబును హీరోగా తీసుకుని, కూరగాయలు అమ్ముకునే మంగను హీరోయిన్ ను చేసి.. మొత్తానికి సినిమా మొదలుపెడతాడు.

అయితే, షాట్ కి కాస్ట్యూమ్స్ కి తేడా తెలియని వీరబాబు అండ్ అతని టీమ్ అసలు సినిమా ఎలా తీశారు ? ఈ క్రమంలో వాళ్ళు ఎదుర్కొన్న సమస్యలు ఏమిటి ? ఆ ఊరు జనం వారికి ఎలా సాయపడ్డారు ? ఇంతకీ దొరికిన ఆ కెమెరా ఎవరిదీ ? అంతిమంగా వీరబాబు అండ్ గణపతి తాము అనుకున్న సినిమాని తీసారా ? లేదా ? అనేది మిగిలిన కథ.

 

ప్లస్ పాయింట్స్ :

 

అమాయకత్వానికి, స్వచ్ఛమైన మనస్తత్వాలకు మధ్య జరిగిన సంఘర్షణ మయం ఈ సినిమా. ఇలాంటి కథతో కూడా సినిమా చెయ్యొచ్చు అని నమ్మి ఈ చిత్రాన్ని నిర్మించిన నిర్మాతలును, ఈ ట్రెండీ లోకంలో వెనుకబడిన నేపథ్యాన్ని తీసుకుని, ఆ నేపథ్యంలోనే పూర్తి అమాయకపు పాత్రలను రాసుకుని చక్కగా సినిమా తీసిన దర్శకుడు ప్రవీణ్ ను మెచ్చుకొని తీరాలి.

ముఖ్యంగా సినిమాలోని ప్రధాన పాత్రల జీవితాలను.. వాళ్ళ ఆలోచనలను వారి కోరికలను ఇలా ప్రతి అంశాన్ని దర్శకుడు చక్కగా చూపించాడు. కొన్ని సీన్స్ అయితే దర్శకుడు తీసిన విధానం చాలా సహజంగా అనిపిస్తుంది. సినిమా చూస్తున్నంత సేపు వీరబాబు, గణపతి, మర్దేశ్ బాబు జీవితాలను మనం దగ్గరనుండి చూస్తున్న భావన కలుగుతుంది. అదే విధంగా దర్శకుడు ప్రవీణ్ రాసుకున్న సున్నితమైన హాస్యం కూడా ఈ సినిమాకు ప్రధాన బలం.

పైగా కథలోని ప్రతి పాత్ర చాలా సహజంగా ఉంటుంది. ప్రతి పాత్ర అర్ధవంతగా సాగుతూ కథను అంతర్లీనంగా ముందుకు నడుపుతుంది. ఇక నటీనటుల నటన విషయానికి వస్తే హీరోగా నటించిన వికాస్ వశిష్ఠ అద్భుతంగా నటించాడు. అలాగే సందీప్ వారణాసి కూడా ఈ సినిమాలో మరో ప్రధాన పాత్రలో అద్భుతమైన నటన కనబర్చాడు.

అలాగే కీ రోల్ లో కనిపించిన త్రిషర తన సహజ నటనతో ఆకట్టుకుంది. ఇక గ్రామస్థులుగా నటించిన నటులు వారి వారి పాత్రలకు పూర్తి న్యాయం చేకూర్చారు. ఇక సినిమాలో యాస కూడా చాల సహజంగా ఉండేలా దర్శకుడు చక్కగా డబ్బింగ్ చేయించాడు.

 

మైనస్ పాయింట్స్ :

 

కథ, పాత్రల పరంగా ఎలాంటి వంకా పెట్టలేని పనితీరుని కనబర్చిన దర్శకుడు ప్రవీణ్ కథనం విషయంలో మాత్రం స్లోగా అనిపించారు. ముఖ్యంగా షూటింగ్ ఎపిసోడ్స్ ను ఇంకా కుదించి ఉంటే బాగుండేది. అలాగే కథకు అవసరం లేని కొన్ని కామెడీ సీన్స్ ను తగ్గించాల్సింది. ఇక కెమెరా పగిలిపోయిన తరువాత వచ్చే సన్నివేశాలు కూడా స్లోగా సాగుతూ అక్కడక్కడా బోర్ కొడుతుంది.

పైగా నూతన నటినటులందరూ బాగా నటించినా.. సినిమాలో స్టార్ వాల్యూ లేకపోవడంతో.. ఈ సినిమా ఫలితాన్ని కొంతవరకు దెబ్బతీస్తుంది. పైగా రెగ్యులర్ కమర్షియల్ ఎలిమెంట్స్ కి అలవాటు పడ్డ ప్రేక్షకులను ఆకట్టుకునే స్టఫ్ సినిమాలో ఉన్నా, స్టార్ వాల్యూ కారణంగా వాళ్ళు ఈ సినిమా చూడటానికి ఎంతవరకు ఆసక్తి చుపిస్తారనేది చూడాలి.

 

సాంకేతిక విభాగం :

 

ప్రవీణ్ దర్శకుడిగా రచయితగా ఈ సినిమాకు పూర్తి న్యాయం చేశారు. మంచి కథ, ఆసక్తికరమైన పాత్రలతో చిత్రాన్ని అందంగా తీర్చిదిద్దారు. ఫన్, ఎమోషన్ వంటి అంశాలని సమపాళ్లలో ఉంచి సగటు ప్రేక్షకుడిని అలరించే సినిమాను తయారుచేశారు. కాకపోతే సినిమా కథనం పై ఇంకొంచెం శ్రద్ధ పెట్టి ఉంటే బాగుండేది.

సంగీత దర్శకుడు అందించిన సంగీతం బాగుంది. సినిమాటోగ్రఫీ సినిమాకి తగట్లు ఆకట్టుకుంటుంది. సన్నివేశాలన్నీ చాలా సహజంగా సినిమా మూడ్ కి అనుగుణంగా నడుస్తాయి. నిర్మాతలు ఇలాంటి చిత్రాన్ని నిర్మిచినందుకు అభినందించి తీరాలి. లో బడ్జెట్ లో పక్కాగా ప్లాన్ చేసిన ప్రొడక్షన్ డిజైన్ కూడా ఆకట్టుకుంటుంది.

 

తీర్పు :

 

సహజమైన చిత్రాల్లో ఒకటిగా ఈ సినిమా నిలిచిపోతుంది. చేతిలో కెమెరా తప్ప ఇంకేమీ లేని ఓ అమాయకపు బ్యాచ్ సినిమా తీయడానికి పడిన పాట్లే ఈ సినిమా. సినిమా చూస్తున్నంత సేపు, సినిమా తీయడానికి ఆ అమాయకపు ప్రాణుల పడే తాపత్రయం, అలాగే వారి జీవితాలను మనం దగ్గరనుండి చూస్తున్న భావన కలుగుతుంది. మొత్తమ్మీద మంచి చిత్రాలని కోరుకునే ప్రేక్షకులకు ఈ సినిమా బెటర్ ఛాయిస్ అవుతుంది.

123telugu.com Rating : 3.25/5

Reviewed by 123telugu Team

Click Here For English Review

సంబంధిత సమాచారం

తాజా వార్తలు