సమీక్ష 2 : అత్యద్బుతంగా అలరించే “ఈగ”

సమీక్ష 2 : అత్యద్బుతంగా అలరించే “ఈగ”

Published on Jul 7, 2012 3:40 AM IST
విడుదల తేది : 06 జూలై 2012
123తెలుగు.కాం రేటింగ్: 4/5
దర్శకుడు : ఎస్.ఎస్. రాజమౌళి
నిర్మాత : సురేష్ బాబు
సంగీత దర్శకుడు:  ఎమ్.ఎమ్. కీరవాణి
తారాగణం : నాని, సమంత, సుదీప్

సుదీప్, సమంతా, నాని ప్రధాన తారాగణంతో అగ్ర దర్శకుడు రాజమౌళి ప్రతిష్టాత్మకంగా తెరకెక్కించిన చిత్రం ‘ఈగ’. మర్యాద రామన్న తరువాత రెండేళ్ళ పాటు కష్టపడి తీసిన ఈగ వేసవిలో విడుదల కావాల్సి ఉండగా కంప్యూటర్ గ్రాఫిక్స్ వల్ల ఆలస్యమయింది. చివరికి అన్ని హంగులు పూర్తి చేసుకుని ఈ రోజు జూలై 6న ప్రేక్షకుల ముందు వాలింది. మరి ఈ ‘ఈగ’ ఎంతవరకు ఆకట్టుకుందో ఇప్పుడు చూద్దాం.

కథ :
నిద్ర పట్టని కూతురికి ఒక తండ్రి చెప్పే కథతో ‘ఈగ’ కథ మొదలవుతుంది. అనాధ పిల్లల కోసం స్వచ్చంద సంస్థ నడిపే బిందు (సమంతా) ని నాని (నాని) ఎంతో కాలంగా ప్రేమిస్తుంటాడు. ఆమె మీద తనకు ఉన్న ప్రేమని ఎన్నో రకాలుగా చెబుతాడు. బిందుకి కూడా నాని మీద ప్రేమ ఉన్న బైట పడదు. మరో వైపు సుదీప్ (సుదీప్) బిందు నడిపే స్వచ్చంద సంస్థకి విరాళం ఇచ్చి ఆమెని లోబరుచుకోవలనుకుంటాడు. బిందు, నానిని ప్రేమిస్తుందని తెలుసుకున్న సుదీప్, నానిని చంపేస్తాడు. చనిపోయిన నాని, ఈగ రూపంలో మళ్లీ పుడతాడు. ఆ ఈగ సుదీప్ మీద ఎలా పగ తీర్చుకుంది. ఆ ఈగకు ఎవరు, ఎలా సహాయం చేసారు అనేది మిగతా చిత్ర కథ.

ప్లస్ పాయింట్స్ :
ఈ సినిమాలో మొదటగా చెప్పుకోవాల్సింది సుదీప్ గురించి. 38 ఏళ్ళ ఈ కన్నడ హీరో తెలుగులో మొదటిసారిగా ఫుల్ లెంగ్త్ పాత్రలో నటించాడు. దాదాపు సినిమా అంతా తన భుజాలపై మోసాడు. అతని క్రూరత్వంతో కూడిన నటన, ఈగ విసిగించినపుడు ఇచ్చిన హావ భావాలు సినిమాకి హైలెట్. ఏ మాయ చేసావే తరువాత గ్లామర్ పాత్రలకే అంకితమైన సమంతా ఈ సినిమాలో చాలా మంచి పాత్ర చేసింది. ఈగకు ఆమెకి మధ్య సన్నివేశాలు చాలా బాగా వచ్చాయి. పెద్ద హీరోలు లేకుండా కేవలం ‘ఈగ’ని మాత్రమే నమ్ముకున్న రాజమౌళి గ్రాఫిక్స్ విషయంలో తీసుకున్న శ్రద్ధ మనకు తెర మీద కనిపిస్తుంది. ఈగ చేసే ప్రతి మూమెంట్ చూస్తే ఇది గ్రాఫిక్స్ కాదు నిజమైన ఈగేనేమో అనిపిస్తుంది. నాని చనిపోయి ఈగగా పుట్టిన సన్నివేశాలు, బిందుకి “నేనే నానీగా మళ్లీ పుట్టాను” అని చెప్పే సన్నివేశాలు అధ్బుతం అని చెప్పాలి. చివరగా క్లైమాక్స్ లో ఎమోషనల్ సన్నివేశాలు చాలా బాగా పండాయి. బిందు ఈగకి ఎక్సరసైజ్ నేర్పించే సన్నివేశాలు మరియు ఇంటర్వెల్ ముందు సుదీప్ యాక్సిడెంట్ సన్నివేశాలు అలరించాయి. తాగుబోతు రమేష్ ఎపిసోడ్ కూడా బాగా నవ్విస్తుంది. సినిమా అంతా అయిపోయాక ఆ ఎపిసోడ్ కంటిన్యూ చేస్తూ నవ్వించారు. రోలింగ్ టైటిల్స్ లో ఈగ చేసే డాన్సులు కూడా బావున్నాయి. హంస నందిని రెండు సన్నివేశాల్లో తళుక్కున మెరిసింది.

మైనస్ పాయింట్స్ :
చిత్ర మొదటి భాగంలో నాని మరియు బిందు మధ్య వచ్చే కొన్ని సన్నివేశాలు స్లోగా సాగుతూ బోర్ అనిపిస్తాయి. రెండవ భాగం విషయానికి వస్తే క్లైమాక్స్ ముందు స్లో అయినట్లు అనిపిస్తుంది.

సాంకేతిక విభాగం :
పాటల విషయంలో పాస్ మార్కులు సంపాదించుకున్న కీరవాణి ఈ సినిమాలో నేపధ్య సంగీతం విషయంలో మరో అడుగు ముందుకేసి తనకు తనే సాటి అనిపించుకున్నారు. ప్రతి సినిమాలో హీరోలకు నేపధ్య సంగీతం పెద్ద కష్టం కాదు కాని ఈగకి నేపధ్య సంగీతం అంటే సాహసంతో కూడుకున్న పని. సుదీప్ సన్నివేశాలకు తగ్గట్లుగా లావా లావా పాటను వాడుకున్నతీరు అధ్బుతం. మకుట వారు అందించిన గ్రాఫిక్స్ తెలుగు సినిమా స్థాయిని మరో అడుగు ముందుకు తీసుకెళ్ళింది. ఈ సినిమాకి ప్రధాన ఆకర్షణ గ్రాఫిక్స్ అని చెప్పుకోవాలి. సినిమాటోగ్రాఫర్ సెంథిల్ ఈగ టీం అంతా పడ్డ కష్టాన్ని తెర మీద అధ్బుతంగా చూపించి మెప్పించారు. ఎడిటింగ్ బావున్నప్పటికీ కొన్ని సన్నివేశాలకు కత్తెర వేస్తే బావుండేది. డైలాగ్స్ కి పెద్దగా ప్రాధాన్యత లేనప్పటికీ పర్వాలేదనిపించాయి.

తీర్పు :
రాజమౌళి ఇప్పటి వరకు పెద్ద హీరోలతో మాత్రమే సినిమా తీసి పెద్ద హిట్లు కొట్టాడు, ఈ సారి ఈగతో ఏం చేయగలడో చూద్దాం అనుకున్న వారందరికీ ఈ సినిమాతో సమాధానం ఇచ్చాడు. ఈ సినిమా గ్రాఫిక్స్ తో తెలుగు సినిమా స్థాయిని మరింత ముందుకు తీసుకు వెళ్ళాడు దర్శకుడు. ఫ్యామిలీతో తప్పక చూడవలిసిన క్లీన్ ఎంటర్టైనర్ చిత్రం “ఈగ”.

123తెలుగు.కాం రేటింగ్ : 4/5

అశోక్ రెడ్డి -ఎం

సంబంధిత సమాచారం

తాజా వార్తలు