సమీక్ష : గాయత్రి – తండ్రి కూతుళ్ళ ఎమోషన్ బాగుంది

విడుదల తేదీ : ఫిబ్రవరి 9, 2018

123తెలుగు.కామ్ రేటింగ్ : 3/5

నటీనటులు : మంచు మోహన్ బాబు, విష్ణు, శ్రియ, నిఖిల విమల్

దర్శకత్వం : మదన్ రామిగాని

నిర్మాత : మంచు మోహన్ బాబు

సంగీతం : ఎస్. థమన్

సినిమాటోగ్రఫర్ : సర్వేశ్ మురారి

ఎడిటర్ : ఎం.ఆర్. వర్మ

స్టోరీ, స్క్రీన్ ప్లే : డైమండ్ బాబు, మంచు మోహన్ బాబు

కలెక్షన్ కింగ్, విశ్వ నట సార్వభౌమ మంచు మోహన్ బాబు ద్విపాత్రాభినయంలో నటించిన సినిమా ‘గాయత్రి’. మదన్ రామిగాని దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రం ఈరోజే ప్రేక్షకుల ముందుకొచ్చింది. మరి మోహన్ బాబు స్వయంగా నిర్మించిన ఈ చిత్రం ఎలా ఉందో ఇప్పడు చూద్దాం..

కథ :

దాసరి శివాజీ (మోహన్ బాబు) చనిపోయిన తన భార్య శారద (శ్రియ) జ్ఞాపకార్థం అనాధ శరణాలయాన్ని నడుపుతూ అనాధ పిల్లల్ని చదివిస్తూ వాళ్ళ ఆలనా పాలనా చూస్తూ 25 ఏళ్ల క్రితం పుట్టగానే తనకు దూరమైన తన కూతురు (నిఖిల విమల్) గురించి వెతుకుతుంటాడు.

కానీ కొందరు దుండగులు అతని కూతుర్ని చంపడానికి ప్రయత్నిస్తుంటారు. అదే సమయంలో అచ్చు శివాజీ పోలికలతో ఉన్న గాయత్రి పటేల్ (మోహన్ బాబు) అనే క్రిమినల్ శివాజీని తన స్వార్థం కోసం ఉరి శిక్షపడి జైలుకెళ్లేలా చేస్తాడు. అలా చావుకు దగ్గరైన శివాజీ ఎలా బయటపడ్డాడు, తన కూతుర్ని కలిశాడా లేదా, అసలు ఈ గాయత్రి పటేల్ ఎవరు, శివాజీ కూతుర్ని చంపాలని ప్రయత్నిస్తున్నది ఎవరు అనేదే సినిమా.

ప్లస్ పాయింట్స్ :

సినిమాకు ప్రధాన బలం డా.మోహన్ బాబుగారే అని నిర్మొహమాటంగా చెప్పొచ్చు. అటు మంచితనం, ప్రేమ, భాధ కలిగిన శివాజీ పాత్రలో, ఇటు క్రూరమైన గాయత్రి పటేల్ పాత్రలోనూ అద్భుతమైన నటనకనబర్చి విశ్వ నట సార్వ భౌమ అనే తన బిరుదుకు మరోసారి న్యాయం చేశారు. ఫస్టాఫ్లో వచ్చే శివాజీ పాత్రలో నిజాయితీ కలిగిన సౌమ్యుడిగా, అన్యాయాన్ని ఎదిరించే పౌరుడిగా, కూతురి కోసం పరితపించే తండ్రిగా ఆయన నటన ప్రేక్షకుల్ని రంజింపజేస్తుంది.

అలాగే ద్వితీయార్థంలో వచ్చే క్రిమినల్ మనస్తత్వం కలిగిన గాయత్రి పటేల్ పాత్రలో కూడ ఎక్కడా శివాజీ పాత్ర ఛాయలు కనబడకుండా పకడ్బంధీగా నటించి శభాష్ అనిపించుకున్నారు. భావోద్వేగపూరితమైన శివాజీ గతం, అందులో విష్ణు, శ్రియల నటన, శివాజీ తన కూతురికి దూరమయ్యే సన్నివేశాలు, పరిస్థితులు బాగున్నాయి. వయసును కూడా పక్కనబెట్టి మోహన్ బాబుగారు యాక్షన్ స్టంట్స్ చేయడం మెచ్చుకోదగిన విషయం.

మొదటి అర్థ భాగంలో శివాజీ పాత్రపై వచ్చే మొదటి పాట, ద్వితీయార్థంలో విష్ణు, శ్రియలపై వచ్చే రొమాంటిక్ సాంగ్ బాగుండగా డైమండ్ రత్నబాబు రాసిన డైలానగ్స్ ఆకట్టుకున్నాయి. సంగీత దర్శకుడు థమన్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ సినిమా స్థాయిని పెంచింది.

మైనస్ పాయింట్స్ :

సినిమాకు కొత్తది అనదగిన కథ లేకపోవడమే ప్రధాన మైనస్. డైమండ్ రత్నబాబు రాసిన కథ చక్కగా, పద్దతిగానే ఉన్నా ప్రతి ఘట్టం పాత సినిమాల్లో చూసినట్టే ఉంటుంది. ఇక స్క్రీన్ ప్లేలో కూడా పెద్దగా ప్రత్యేకత కనబడదు. కొన్ని ఎమోషనల్ సన్నివేశాలు, ముఖ్య పాత్రలు మినహా మిగతా అన్ని అంశాలు రొటీన్ గానే ఉన్నాయి.

సినిమా ఇంటర్వెల్ సమయానికి అసలు కథలోకి ప్రవేశించడంతో ఫస్టాఫ్ లెంగ్త్ ఎక్కువైనట్టు, శివాజీ పాత్రపై వచ్చే పాటలు, కొన్ని ఫైట్స్, కొన్ని సన్నివేశాలు అవసరంలేకపోయినా కథలోకి జొప్పించినట్టు ఉంటాయి. ఇక సినిమా ప్రీ క్లైమాక్స్ ఎమోషనల్ గా కొంత ఊపందుకుంది అనుకునే సమయానికి పెద్ద అడ్డంకిలా వచ్చే ప్రత్యేక గీతం చిరాకు పెట్టింది. ఇక క్లైమాక్స్ కూడా బలమైన రీతిలో కాకుండా సింపుల్ గా ముగిసిపోతుంది.

సాంకేతిక విభాగం :

దర్శకుడు మదన్ రామిగాని కీలకమైన ఎమోషనల్ సన్నివేశాలని, మోహన్ బాబు రెండు పాత్రల్ని బాగానే హ్యాండిల్ చేశారు కానీ కొత్తదనం కనబడేలా, పూర్తిస్థాయిలో బలంగా అనిపించేలా సినిమాను తయారుచేయడంలో కొంత తడబడ్డారు. డైమండ్ రత్నబాబు డైలాగ్స్ బాగేనా ఉన్నా ఆయన రాసిన కథ, టీమ్ తయారుచేసుకున్న కథనం శివాజీ పాత్ర యొక్క గతం మినహా మిగతా మొత్తం పాత తరహాలోనే, కొంత బోర్ అనిపించేలా ఉన్నాయి.

సంగీత దర్శకుడు థమన్ నైపథ్య సంగీతం గొప్పగా ఉంది. సర్వేశ్ మురారి సినిమాటోగ్రఫీ బాగుంది. నిసి సన్నివేశాన్ని స్పష్టంగా అనిపించేలా చేశారు. ఎం.ఆర్. వర్మ ఫస్టాఫ్లో కొన్ని అవసరంలేని సీన్లను, సెకండాఫ్లో ప్రత్యేక గీతాన్ని ఎడిటింగ్ చేసి ఉండాల్సింది. మంచు మోహన్ బాబుగారు పాటించిన నిర్మాణ విలువలు చాలా బాగున్నాయి.

తీర్పు :

ఈ ‘గాయత్రి’ చిత్రం విశ్వ నట సార్వభౌమ మోహన్ బాబుగారి అద్భుతమైన ద్విపాత్రాభినయం వలన బలాన్ని సంతరించుకుంది. ఫస్టాఫ్లో శివాజీగా, సెకండాఫ్లో గాయత్రి పటేల్ గా మోహన్ బాబుగారి నటన, ద్వితీయార్థంలో వచ్చే ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్, కొన్ని భావోద్వేగపూర్తితమైన సన్నివేశాలు, కొన్ని మలుపులు ఆకట్టుకునే అంశాలు కాగా కొత్తదనం లేని కథ, కొంత రొటీన్ గా అనిపించే కథనం, అనవసరమైన ప్రత్యేక గీతం, బలహీనమైన క్లైమాక్స్ నిరుత్సాహపరిచే అంశాలు. మొత్తం మీద ఈ చిత్రం కొత్తదనం కోరుకునేవారిని అంతగా మెప్పించకపోవచ్చు కానీ మోహన్ బాబుగారి నటనను, ఎమోషనల్ సినిమాల్ని ఇష్టపడేవారికి చూడదగిన సినిమాగా నిలుస్తుంది.

123telugu.com Rating : 3/5

Reviewed by 123telugu Team

Click here for English Review

సంబంధిత సమాచారం :

More