సమీక్ష : గ్రీకు వీరుడు – ఫ్యామిలీ ఆడియన్స్ కోసం..

విడుదల తేదీ : 03 ఏప్రిల్ 2013
123తెలుగు.కామ్ రేటింగ్ : 3/5
దర్శకుడు : దశరథ్
నిర్మాత : డి. శివప్రసాద్ రెడ్డి
సంగీతం : ఎస్.ఎస్ థమన్
నటీనటులు : నాగార్జున, నయనతార, మీరా చోప్రా.


కింగ్ నాగార్జున – కుటుంబ కథా చిత్రాల దర్శకుడు దశరథ్ కాంబినేషన్లో ‘సంతోషం’ సినిమా తర్వాత తెరకెక్కిన సినిమా ‘గ్రీకు వీరుడు’. ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమా ఈ రోజు ప్రేక్షకుల ముంద్ముందుకు వచ్చింది. నాగార్జున, నయనతార, మీరా చోప్రా ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమాకి శివ ప్రసాద్ రెడ్డి నిర్మించారు. ఈ సినిమాకి థమన్ స్వరాలూ అందించాడు. దాదాపు 11 సంవత్సరాల తర్వాత నాగార్జున చేసిన ఫ్యామిలీ ఎంటర్టైనర్ కావడంతో ఈ సినిమా పై ఫ్యామిలీ ఆడియన్స్ లో ఈ సినిమా పై అంచనాలు బాగానే ఉన్నాయి. మరి ఆ అంచనాలను ఎంతవరకూ అందుకుందో ఇప్పుడు చూద్దాం..


కథ :

అమెరికాలోనే పుట్టి పెరిగిన చందు(నాగార్జున)కి ప్రేమ బందాలు అన్నా నమ్మకం ఉండదు అలాగే చందు రిలేషన్స్ కంటే డబ్బుకే ఎక్కువ విలువనిస్తూ ఉంటాడు. అలా ఉండే చందు అమెరికాలో ఎం.ఎస్ నారాయణతో కలిపి ఒక ఈవెంట్ ఆర్గనైజేషన్ కంపెనీని నడుపుతుంటాడు. అదే కంపెనీలో పనిచేసే మాయ(మీరా చోప్రా) చందు వల్ల ఇబ్బందుల్లో ఇరుక్కున్నాననే కారణంతో కక్ష్య గట్టి చందుని ఓ కేసులో ఇరికిస్తుంది. అలా ఇరుక్కున్న సమస్య నుండి బయటకి రావాలంటే చందు పి.ఆర్(ఆశిష్ విద్యార్ధి)కి పెద్ద మొత్తంలో డబ్బు కట్టాల్సి వస్తుంది. తన ఆస్తులన్నీ అమ్మినా అంతడబ్బు రాదు ఎం చెయ్యాలా అని ఆలోచిస్తున్న తరుణంలో చందుకి ఇండియాలో ఉన్న తన తాత గారైన రామచంద్ర ప్రసాద్(కె విశ్వనాధ్) దగ్గర 1000 కోట్ల ఆస్తి ఉందని తెలుస్తుంది.

అది తెలుసుకున్న చందు ఇండియా వెళ్లి ఎలాగైనా తన ఫామిలీ మెంబర్స్ కి మస్కా కొట్టి డబ్బు తీసుకొని వచ్చేయాలనుకుంటాడు. అలా ఇండియా బయలు దేరిన చందు జీవితంలోకి మేక్ ఎ విష్ ఫౌండేషన్లో డాక్టర్ కమ్ వాలంటీర్ అయిన సంధ్య(నయనతార) ప్రవేశిస్తుంది. కొన్ని కారణాల వల్ల సంధ్య కొద్ది రోజులు చందుతో గడపాల్సి వస్తుంది. అలా చందు లైఫ్ లోకి ప్రవేశించిన నయనతార వల్ల, అతని ఫ్యామిలీ మెంబర్స్ ప్రేమ ఆప్యాయతల వల్ల తన ఉద్దేశాన్ని మార్చుకున్నాడా? లేదా? చివరికి రిలేషన్ లో ఉండే సుఖ సంతోషాల గురించి తెలుసుకొని కుటుంబానికి ఎలా దగ్గరయ్యాడు? అనేదే మిగిలిన కథ.

ప్లస్ పాయింట్స్ :

ఈ సినిమాలో అక్కినేని నాగార్జున లుక్, కాస్ట్యూమ్స్ పరంగా చాలా స్టైలిష్ గా ఉన్నాడు. ‘సంతోషం’ తర్వాత నాగార్జున మళ్ళీ అంత కూల్ గా ఈ సినిమాలో కనిపించాడు. నాగార్జున టైటిల్ సాంగ్ ‘గ్రీకు వీరుడు’, ‘ఓసి నా బంగారం’ సాంగ్స్ లో డాన్సులు బాగా చేసారు. సినిమా మొత్తాన్ని ఒక్క నాగార్జున గారే తన భుజాల మీద వేసుకొని లాక్కొచ్చారు. నయనతార చాలా అందంగా, మన ఇంట్లో అమ్మాయిలా కనిపించింది. అలాగే దర్శకుడు ఆమెను ఎంచుకున్న పాత్రకి పూర్తి న్యాయం చేసింది. నాగార్జున – నయనతార కెమిస్ట్రీ బాగుంది. మీరా చోప్రా పాత్ర చాలా చిన్నది కానీ స్టోరీని మలుపు తిప్పే పాత్ర మాత్రం ఆమెదే కావడం విశేషం.

నాగార్జున తాత గారి పాత్రలో కె విశ్వనాథ్ నటన బాగుంది. నాగార్జున – విశ్వనాధ్ మధ్య వచ్చే సెంటిమెంట్ సీన్స్ బాగున్నాయి. డా. కామరాజు పాత్రలో బ్రహ్మానందం, చెవిటి మేళం పాత్రలో జయప్రకాశ్ రెడ్డి, వెన్నెల కిషోర్, ఎం.ఎస్ నారాయణలు సినిమాలో అక్కడక్కడా కాస్త నవ్వించగలిగారు. ఆవేశపరుడి పాత్రలో ఆశిష్ విద్యార్ధి నటన బాగుంది. కోట శ్రీనివాస రావు, బెనర్జీ, సుధ ల నటన పాత్రలకు తగ్గట్టుగా ఉంది. సినిమాలో ఉన్నది ఒకే ఒక్క ఫైట్ అయినప్పటికీ దానిని విజయ్ మాస్టర్ బాగా కంపోజ్ చేసాడు. బ్యాక్ గ్రౌండ్ లో వచ్చే ‘ఈ పరీక్షలో తనకు’ పాట చాలా బాగుంది. డైరెక్టర్ చెప్పాలనుకున్న స్టొరీ లైన్ బాగుంది.

మైనస్ పాయింట్స్ :

సినిమా మొదటి నుంచి యావరేజ్ గా సాగుతూ ఇంటర్వెల్ ముందు కాస్త వేగం పుంజుకుంటుంది అప్పుడు ఇంటర్వెల్ బ్రేక్ ఇస్తారు. ఇంటర్వెల్ తర్వాత ఇదే వేగంతో కథ ముందుకు పోతుంది అనుకున్న ప్రేక్షకుడికి నిరాశే ఎదురవుతుంది ఎందుకంటే ఫస్ట్ హాఫ్ కంటే సెకండాఫ్ చాలా స్లోగా ఉంటుంది. అలాగే సెకండాఫ్ సెంటిమెంట్ సీన్స్ ఎక్కువగా రిపీట్ అవుతుండడంతో ప్రేక్షకులు బోర్ ఫీలవుతారు. ప్రేక్షకుడికి ఉత్కంఠతని కలిగించేలా స్క్రీన్ ప్లే ఉండదు. సినిమా కోసం దర్శకుడు ఎంచుకున్న స్టొరీ లైన్ కొత్తగా ఉన్నప్పటికీ డీల్ చేసిన విధానం మాత్రం పాత కుటుంబ కథా చిత్రాలను పోలి ఉండటం ఈ సినిమాకి పెద్ద మైనస్.

అలాగే చాలా సీన్స్ ని బ్లూ మాట్ లో తీసి వాటికి అమెరికా బ్యాక్ గ్రౌండ్ పెట్టి సిజి చేసారు. ఈ సీన్స్ కి సిజి వర్క్ అస్సలు బాలేదు. చూడగానే ప్రేక్షకుడికి ఇది ఒరిజినల్ షాట్ కాదు అని తెలిసిపోయేలా ఉంటుంది. సినిమాలో ఎంటర్టైనింగ్ చాలా తక్కువగా ఉంది. కమెడియన్స్ గిరిబాబు, వేణు మాధవ్, కాశీ విశ్వనాధ్, శ్రీనివాస్ రెడ్డి, ధర్మవరపు సుబ్రహ్మణ్యంలను సరిగా ఉపయోగించుకోలేకపోయారు. ఎం.ఎస్ నారాయణ – కోవై సరళ మధ్య పెట్టిన కామెడీ ట్రాక్ కాస్త ఎబ్బెట్టుగా అనిపిస్తుంది.

సాంకేతిక విభాగం :

బ్లూ మాట్ వేసి తీసిన సీన్స్ కి సిజిలో అమెరికా బ్యాక్ గ్రౌండ్ సెట్ చేసిన సిజి షాట్స్ ని పక్కన పెడితే మిగతా అన్ని సీన్స్ లోనూ అనీల్ బండారి సినిమాటోగ్రఫీ పరవాలేదని పిస్తుంది. మార్తాండ్ కె వెంకటేష్ ఎడిటింగ్ ఫస్ట్ హాఫ్ లో పరవాలేదనిపించినా సెకండాఫ్ ని మాత్రం చాలా వరకూ కత్తిరించి సినిమాని కాస్త వేగవంతం చేయాల్సింది. థమన్ అందించిన పాటలు ఓకే, ముఖ్యంగా బ్యాక్ గ్రౌండ్ సాంగ్ చాలా బాగుంది. బ్యాక్ గ్రాండ్ మ్యూజిక్ పెద్ద పెద్ద సౌండ్స్ లేకుండా కూల్ గా ఉంది.

దర్శకుడు దశరథ్ ఎంచుకున్న స్టొరీ లైన్ బాగుంది కానీ దాన్ని కొత్తగా చూపించడంలో మాత్రం విఫలమయ్యాడనే చెప్పుకోవాలి. దర్శకత్వంలో నటీనటుల నుండి నటనని బాగానే రాబట్టుకున్నాడు కానే పెద్ద పెద్ద కమెడియన్స్ ని పెట్టుకుని కూడా ఎంటర్టైనింగ్ సరిగా ప్లాన్ చేసుకోలేకపోయాడు. డైలాగ్స్ ఓకే అనేలా ఉన్నాయి. స్క్రీన్ ప్లే చాలా వీక్ గా ఉంది. నిర్మాణ విలువలు ఓకే అనేలా ఉన్నాయి.

తీర్పు :

నాగార్జున నటించిన ‘గ్రీకు వీరుడు’ సినిమా సమ్మర్లో ఫ్యామిలీ ఆడియన్స్ మాత్రం చూడదగిన సినిమా. నాగార్జున, నయనతార, విశ్వనాధ్ ల నటన, స్టొరీ లైన్, ఫ్యామిలీ ఆడియన్స్ ని ఆకట్టుకునే కొన్ని సెంటిమెంట్ సీన్స్ ఈ సినిమాలో చెప్పదగిన ప్లస్ పాయింట్స్. యూత్ కి నచ్చే అంశాలు లేకపోవడం, ఎంటర్టైన్మెంట్ తగ్గువగా ఉండడం, సెకండాఫ్ చాలా నిదానంగా సాగడం చెప్పదగిన మైనస్ పాయింట్స్. బి, సి సెంటర్ ప్రేక్షకులకు ఈ సినిమా ఎక్కడం కాస్త కష్టమైన పని, ఫైనల్ గా ఎ సెంటర్ మరియు ఫ్యామిలీ ఆడియన్స్ ఎలా రిసీవ్ చేసుకుంటారు అనే దాన్ని బట్టే ఈ సినిమా ఫలితం ఉంటుంది.

123తెలుగు.కామ్ రేటింగ్ : 3/5

రాఘవ

CLICK HERE FOR ENGLISH REVIEW

సంబంధిత సమాచారం :