సమీక్ష : గుప్పెడంత ప్రేమ – చిటికెడంత ప్రేమకథ!

సమీక్ష : గుప్పెడంత ప్రేమ – చిటికెడంత ప్రేమకథ!

Published on Jun 17, 2016 11:32 PM IST
Guppedantha Prema review

విడుదల తేదీ : 17 జూన్, 2016

123తెలుగు.కామ్ రేటింగ్ : 2.5/5

దర్శకత్వం : వినోద్ లింగాల

నిర్మాత : ఐ వింక్ ప్రొడక్షన్స్

సంగీతం : నవ్‌నీత్ సుందర్

నటీనటులు : సాయి రోనక్, అదితి సింగ్, ఐశ్వర్య..

సాయి రోనక్, అదితి సింగ్, ఐశ్వర్య ప్రధాన పాత్రల్లో నటించిన సినిమా ‘గుప్పెడంత ప్రేమ’. వినోద్ లింగాల దర్శకుడిగా పరిచయమవుతూ తెరకెక్కించిన ఈ సినిమా ఫస్ట్‌లవ్‌లోని అనుభూతిని చెప్పే సినిమాగా ప్రచారం పొందింది. అన్ని కార్యక్రమాలనూ పూర్తి చేసుకొని నేడు ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా ఎలా ఉందీ? చూద్దాం..

కథ :

యువన్ (సాయి రోనక్).. యూనివర్సిటీలో ఇంజనీరింగ్ చదివే కుర్రాడు. ఓ ప్రమాదంలో తల్లి, తండ్రిని కోల్పోయిన యువన్‌కు వాళ్ళలానే ప్రేమించి పెళ్ళి చేసుకోవాలన్నది కల. కాలేజీ రోజుల్లోనే తొలిప్రేమ చిగురిస్తుందని నమ్మే యువన్‌కు, యూనివర్సిటీ డీన్ కూతురైన సాండీ (అదితి సింగ్)తో పరిచయం అవుతుంది. ఆ పరిచయం ఆ తర్వాత ప్రేమగా మారుతుంది. అయితే కొన్ని అనుకోని పరిస్థితుల్లో సాండీ, యువన్‌కు దూరం అవ్వాల్సి వస్తుంది.

సాండీ దూరమైన బాధలోనే ఆమె కోసం యువన్ రాసిన తొలిప్రేమ అనే పుస్తకం చదివి, స్వర (ఐశ్వర్య) అనే అమ్మాయి అతడిని ప్రేమిస్తుంది. ఇదే సమయంలో సాండీ కూడా తిరిగి యువన్ జీవితంలోకి వస్తుంది. ఈ పరిస్థితుల్లో ఈ కథ ఎటువైపు మళ్ళింది? సాండీ, యువన్‌ను వదిలి ఎందుకు వెళ్ళిపోయింది? ఈ కథలో చివరికి ఎవరు ఎవరికి దగ్గరయ్యారూ? అన్నదే సినిమా.

ప్లస్ పాయింట్ :

ప్రేమకథల్లో ఎప్పటికీ ఒకే కథ ఉంటుందన్నది ఎప్పుడూ వినిపించే మాట. ఆ ఒకే కథలోనే చెప్పగలిగేన్ని ఎమోషన్స్ ఉండడం వల్లనే ప్రేమకథలకు సినిమాల్లో కాలం చెల్లలేదు. ఈ కథలోనూ సెకండాఫ్ మొదలయ్యాక ఒక అరగంట పాటు మంచి ఎమోషన్ ఉంది. సినిమాకు ప్రధాన బలమేదైనా ఉందంటే అది ఈ భాగమే అని చెప్పాలి. ఇక ఫస్టాఫ్‌లో అక్కడక్కడా ప్రేమ నేపథ్యంలో వచ్చే కొన్ని సన్నివేశాలు బాగున్నాయి. స్వర అనే పాత్ర కథలోకి ఎంట్రీ ఇచ్చాక, కొంచెం కామెడీ కూడా జత అయి సెకండాఫ్ బోర్ కొట్టించకుండా సాగింది.

ఇక హీరో సాయి రోనక్ తన పాత్రకు మంచి న్యాయం చేశాడు. ముఖ్యంగా ఫస్టాఫ్ అంతా సరదాగా కనిపిస్తూ, సెకండాఫ్‌లో అతడి జీవితంలో వచ్చిన మార్పులకు తగ్గట్టుగా కాస్త పరిణతి చూపుతూ నటిస్తూ మంచి మార్కులే కొట్టేశాడు. అదితి సింగ్ స్క్రీన్ ప్రెజెన్స్ బాగుంది. ఎమోషనల్ సన్నివేశాల్లో మినహాయిస్తే మిగతా అంతా బాగా నటించింది. ఇక ఐశ్వర్య సరదా సరదాగా సాగే పాత్రలో బాగా చేసింది. ఇక మిగతా వారంతా తమ పరిధిమేర బాగానే నటించారు. సినిమా పరంగా చూసుకుంటే సెకండాఫ్‌నే ఈ సినిమాకు హైలైట్‌గా చెప్పుకోవాలి.

మైనస్ పాయింట్స్ :

ఈ సినిమాకు మేజర్ మైనస్ పాయింట్ అంటే ఫస్టాఫ్‌లో వచ్చే ప్రేమకథంతా ఓ అర్థం లేని వ్యవహారంలా కనిపించడం గురించి చెప్పుకోవాలి. ఈ కథలో ఎక్కడా ఇన్నోసెన్స్ లేకపోగా, అందమైన విజువల్స్ అతికించి పేర్చినట్టు సన్నివేశాలు వస్తూ పోతూంటాయి. యువన్-సాండీల ప్రేమకథలో ఎక్కడా కట్టిపడేసే స్థాయిలో ఎమోషన్ లేకపోవడంతో సెకండాఫ్‌లో వీరిద్దరి నేపథ్యంలో వచ్చే సన్నివేశాలు నీరసంగా కనిపిస్తాయి. ఇక ‘దీ డో, దీ డో’ అనే వచ్చే పాట ఎందుకొస్తుందో కూడా అర్థం కాని పరిస్థితుల్లో వస్తుంది. ఇలాంటివే చాలా సన్నివేశాలు వస్తూ, పోతూ కథకు పూర్తి అడ్డుకట్టగా నిలిచాయి.

అదే విధంగా సాండీ-స్వరల మధ్యన వచ్చే సన్నివేశాలు కూడా ఏమంత ఆకట్టుకునేలా లేవు. ఇక డైలాగ్స్ వినడానికి బాగున్నా, ఏయే పాత్రలు అవి మాట్లాడుతున్నాయో గమనిస్తే, ఎక్కడా ఒక పొంతన కనిపించదు. పాత్ర తీరుకి తగ్గట్టు డైలాగ్స్ లేవు. క్లైమాక్స్ కూడా అంతంత మాత్రంగానే ఉంది. ఇక అసలు కథలో చాలాచోట్ల లోపాలు ఉన్నాయి. ఒక్క పాత్రలనే తప్ప, వాటి వెనుక పరిస్థితులను ఏమాత్రం పట్టించుకోకపోవడం చూస్తే ఈ విషయం అర్థమైపోతుంది. ఇక లాజిక్‍కి అందని అంశాలు సినిమాలో చాలానే ఉన్నాయి.

సాంకేతిక విభాగం :

సాంకేతిక అంశాల పరంగా ఈ సినిమాలో అందరికంటే ముందుగా సినిమాటోగ్రాఫర్ సంజయ్ లోక్‌నాథ్ గురించి చెప్పుకోవాలి. ఒక్క విజువల్ ఎఫెక్ట్స్‌తో సంబంధం ఉన్న సన్నివేశాలు మినహాయిస్తే, చాలాచోట్ల సంజయ్ ప్రతిభను మెచ్చుకోవచ్చు. ఇక సంగీత దర్శకుడు నవనీత్ సుందర్ అందించిన పాటల్లో రెండు పాటలు బాగున్నాయి. ఇక బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ మాత్రం వినడానికి బాగున్నా, అడుగడుగునా ఇప్పటికే చాలా సూపర్ హిట్ సినిమాల్లో వచ్చిన స్కోర్ వినిపించింది. ఎడిటింగ్ ఫర్వాలేదు. విజువల్ ఎఫెక్ట్స్ కొన్ని సందర్భాల్లోనే వచ్చినా నాసిరకంగా ఉన్నాయి.

ఇక దర్శక, రచయిత వినోద్ లింగాల విషయానికి వస్తే, మొదటి సినిమా కావడంతో చెప్పాలనుకున్న అంశాన్ని పూర్తి స్థాయి కథలో చెప్పలేక, తెలిసిన మేకింగ్‌ను సరిగ్గా వాడలేక తడబడ్డట్టు కనిపించింది. ఇంటర్వెల్ తర్వాత వచ్చే ఇరవై నిమిషాల సన్నివేశాల్లో రచయితగా మంచి ప్రతిభ చూపాడు. ఇక మేకింగ్ పరంగా చాలాచోట్ల మెరిశాడు. ఓ సరైన కథనంతో, ఇదే మేకింగ్ స్థాయితో వస్తే దర్శకుడిగా వినోద్ ఇంకా మెప్పించగలడనే చెప్పొచ్చు. ప్రొడక్షన్ వ్యాల్యూస్ బాగున్నాయి.

తీర్పు :

ప్రేమకథలు ఎన్నిసార్లు చెప్పినా బోర్ కొట్టవని, ఎన్నిసార్లు చెప్పినా కొత్తగా ఉండగలవని నమ్మే వారం వారం ఇదే జానర్‌ను నమ్ముకొని సినిమాలు ప్రేక్షకుల ముందుకు వచ్చేస్తుంటాయి. ఇక ఫస్ట్‌లవ్‌ని, అందులోని ఇన్నోసెన్స్‌ని గుర్తు చేసే సినిమాగా ప్రచారం పొందుతూ వచ్చిన సినిమాయే ‘గుప్పెడంత ప్రేమ’. చెప్పదల్చుకున్న అసలు విషయం బాగానే ఉన్నా, దాన్ని పూర్తి స్థాయి సినిమాగా మలచడంలో మాత్రం విఫలమవ్వడంతో ఈ సినిమా చూపాలనుకున్న ఆ గుప్పెడంత ప్రేమను కూడా చూపలేకపోయింది. సెకండాఫ్‍లో వచ్చే ఓ ఇరవై నిమిషాల ఎపిసోడ్, నటీనటుల నటన లాంటి కొన్ని ప్లస్‌లతో వచ్చిన ఈ సినిమాలో అసలైన ఎమోషన్ చాలాచోట్ల కొనసాగలేదు. అదీకాక ఫస్టాఫ్ అంతా పెద్దగా అర్థంలేని వ్యవహారంలా కనిపించింది. ఒక్క మాటలో చెప్పాలంటే.. ఈ ‘గుప్పెడంత ప్రేమ’ ఆ స్థాయిలోనూ లేక ‘చిటికెడంత ప్రేమ’గా తయారైంది.

123telugu.com Rating : 2.5/5
Reviewed by 123telugu Team

Click here for English Review

సంబంధిత సమాచారం

తాజా వార్తలు