సమీక్ష : జిల్లా – తమిళ ఫ్లేవర్ ఉన్న మాస్ మసాలా..!

సమీక్ష : జిల్లా – తమిళ ఫ్లేవర్ ఉన్న మాస్ మసాలా..!

Published on Jul 25, 2015 6:30 PM IST
jilla-review

విడుదల తేదీ : 24 జూలై 2015

123తెలుగు.కామ్ రేటింగ్ : 2.75/5

దర్శకత్వం : ఆర్.టీ.నేసన్

నిర్మాత : తమటం కుమార్ రెడ్డి – ప్రసాద్ సన్నితి

సంగీతం : డి. ఇమ్మన్

నటీనటులు : విజయ్, మోహన్ లాల్, కాజల్..

తమిళ స్టార్ హీరో విజయ్, మళయాల సూపర్ స్టార్ మోహన్ లాల్.. వీరిద్దరి క్రేజీ కాంబినేషన్లో రూపొందిన తమిళ సినిమా ‘జిల్లా’. సూపర్ గుడ్ ఫిల్మ్స్ పతాకంపై ఆర్.బి.చౌదరి నిర్మించిన ఈ సినిమా గత సంవత్సరం సంక్రాంతి కానుకగా జనవరి 9న విడుదలై తమిళ నాట సూపర్ హిట్‌గా నిలిచింది. తెలుగులో ఈ సినిమాను చాలా మంది స్టార్ హీరోలు రీమేక్ చేయనున్నారని అప్పట్లో బాగా ప్రచారం జరిగింది. అయితే చివరకు ఈ సినిమాను అదే పేరుతో శ్రీ ఓబులేశ్వర ప్రొడక్షన్స్ పతాకంపై తమటం కుమార్ రెడ్డి, ప్రసాద్ సన్నితిలు తెలుగులో డబ్ చేశారు. నేసన్ దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమాలో కాజల్ హీరోయిన్‌గా నటించింది. నేడు ఈ సినిమా తెలుగు ప్రేక్షకులను అలరించేందుకు థియేటర్ల ముందుకు వచ్చింది. మరి ఈ సినిమా నిజంగానే అలరించిందా? లేదా? అనేది చూద్దాం…

కథ :

విజయవాడలో శివయ్య (మోహన్ లాల్) ఓ పెద్ద రౌడీ షీటర్. ఆ ప్రాంతంలో తప్పంటూ చేస్తే తానే చేయాలన్నంతగా పేరు సంపాదించుకున్న శివయ్యతో పాటే పనిచేసే ఓ అనుచరుడు ఒక గొడవలో చనిపోతాడు. దాంతో అనాథైన తన అనుచరుడి కొడుకు శక్తి(విజయ్)కి అన్నీ తానై చూసుకుంటాడు శివయ్య. శక్తిని తన పెద్ద కొడుకుగానే భావించే శివయ్య, అతడే తన నీడ అని చెబుతూ ఉంటాడు. బెజవాడలో ఎలాంటి పనైనా తమ చేతుల మీదుగానే జరగాలని భావించే శివయ్య, శక్తిలకు పోలీసుల ద్వారా కొన్ని ఇబ్బందులు ఎదురవుతాయి.

దీంతో పోలీసుల దగ్గర్నుంచి కూడా తమకు ఏ ఇబ్బందీ కలగకూడదంటే తమలోనే ఒక పోలీస్ ఉండాలన్న ఆలోచన చేస్తాడు శివయ్య. ఈ క్రమంలోనే శక్తిని ఓ పోలీసాఫీసర్‌‌ను చేసే ప్రపోజల్ తెస్తాడు. ఖాకీ బట్టను చూస్తేనే కోపం తెచ్చుకునే శక్తి, కేవలం తన తండ్రి శివయ్య కోసమే పోలీస్‌గా మారతాడు. పోలీసాయ్యక కొన్ని అనుకోని పరిణామాలతో శక్తి తాము చేస్తున్న పనులనే వేరే కోణంలో చూడడం మొదలుపెడతాడు. ఆ తర్వాత తాము చేస్తోంది తప్పని శివయ్యను మార్చే ప్రయత్నం చేస్తాడు శక్తి. ఈ విషయంపైనే శక్తికి, శివయ్యకు మధ్యన అభిప్రాయ బేధాలొచ్చి ఇద్దరూ విడిపోతారు. ఆ తర్వాత జరిగే ఆసక్తికర పరిణామాలూ, కథా గమనంలో వచ్చే చిన్న చిన్న ట్విస్టుల సమాహారమే ఈ సినిమా!

ప్లస్ పాయింట్స్ :

ముందుగా ఈ సినిమాకు మేజర్ హైలైట్ అంటే శివయ్య-శక్తిల మధ్యన ఏర్పడే బంధాన్ని, ఆ బంధంలో వచ్చే మార్పులను సినిమా మొదట్నుంచే ఒక్కో దశలో ఒక్కో రకంగా చూపుతూ రావడం గురించి చెప్పుకోవాలి. ప్రీ ఇంటర్వెల్, ఇంటర్వెల్ దగ్గరకొచ్చేసరికి శివయ్య-శక్తి విడిపోయే సందర్భం ఈ సినిమాకు హైలైట్‌గా నిలుస్తుంది. ముఖ్యంగా ప్రీ ఇంటర్వెల్‌లో వచ్చే ఎమోషనల్ సీన్ ఒకటి లేకపోతే ఈ సినిమాయే లేదు. కథ, కథనాలు కొత్తవి కాకపోయినా బలమైనవి కావడంతో సినిమా ఆద్యంతం మంచి ఊపులో దూసుకుపోతుంది. ఇక సెకండాఫ్‌లో వచ్చే చిన్న ట్విస్ట్ శివయ్య పాత్రపై వచ్చే ప్రతికూల ప్రభావాన్ని పూర్తిగా తుడిచేసేందుకు ఉపయోగపడింది. ఈ ట్విస్ట్ వల్లే ఒక ఔట్ అన్డ్ ఔట్ మాస్ సినిమాకు కావాల్సిన ఎనర్జీ, ఎండింగ్‌లకు ఆధారం లభించినట్లైంది.

నటీనటుల్లో అందరికంటే ముందుగా మోహన్ లాల్ గురించి చెప్పుకోవాలి. మోహన్ లాల్ ఓ మధ్య వయస్కుడైన రౌడీ షీటర్‌గా అద్భుతంగా నటించాడు. ముఖ్యంగా ఆయన లుక్, హావభావాలు సినిమాకు బలాన్ని ఇచ్చాయి. సినిమా డల్ అయిపోయిందన్న ప్రతీ సందర్భంలో మోహన్ లాలే నిలబెట్టాడు. ఇక విజయ్ ఎప్పట్లానే తనదైన స్టైల్లో నటిస్తూ పోయాడు. విజయ్‌కి బాగా అలవాటైన కొన్ని మాస్ సన్నివేశాల్లో బాగా ఆకట్టుకుంటాడు. ఇక వీరిద్దరూ కలిసి ఉన్న ప్రతీ ఫ్రేమ్ సినిమాకు నిండుతనాన్ని తెచ్చింది. తెలుగులో ఆమధ్య హీరోగా బ్యాక్‌బెంచ్ స్టూడెంట్ అనే సినిమా చేసిన మహత్ రాఘవేంద్ర, తెలుగులో ఈ మధ్య పాపులర్ అయిన విలన్ సంపత్‌లు ప్రీ క్లైమాక్స్ వరకూ పెద్దగా చేసిందేమీ లేదు. ప్రీ క్లైమాక్స్‌కి వచ్చే సరికి ఆ పాత్రలను అంతసేపు అలా ఎందుకొదిలేసారన్నది అర్థమవుతుంది. వారిద్దరూ తమ తమ పాత్రల్లో బాగానే నటించారు. ఇక హీరోయిన్ కాజల్ కొన్ని సన్నివేశాలు, పాటల్లో అందం, లుక్స్‌తో మెప్పించింది. బ్రహ్మనందం నవ్వించే ప్రయత్నం చేశారు.

సినిమా పరంగా చూసుకుంటే.. ఫస్టాఫ్ మొత్తం విజయ్-మోహన్ లాల్‌ల మధ్యన ఎమోషన్ చుట్టూనే తిరుగుతుంది. ప్రీ ఇంటర్వెల్, ఇంటర్వెల్ మేజర్ హైలైట్స్. ఇక సెకండాఫ్‌లో పోలీసాఫీసర్‌గా విజయ్ చూపే ప్రతాపం, కొన్ని మాస్ ఎలిమెంట్స్, ప్రీ క్లైమాక్స్ ట్విస్ట్‌లతో సాగిపోతుంది. ఒక మాస్ మసాలా సినిమాకు ఏర్పరచుకున్న ఫార్మాట్ చుట్టూ తిరిగే కథ కావడంతో ఆ ప్రకారంగా ఫస్టాఫ్, సెకండాఫ్‌లలో దేనికదే ప్లస్ పాయింట్!

మైనస్ పాయింట్స్ :

ఈ సినిమాకు మేజర్ మైనస్ పాయింట్ అంటే.. అందరికీ కనెక్ట్ అయ్యే బేసిక్ ఎమోషన్ మినహాయించి ఎక్కడా తెలుగు సినిమాకు కనెక్ట్ అయ్యే అంశాలేవీ లేకపోవడమనే చెప్పాలి. ఈ సినిమా పక్కాగా తమిళ ప్రేక్షకులను ఉద్దేశంలో పెట్టుకొని, ఆ నేటివిటీ చుట్టూ, వాళ్ళ అభిరుచుల చుట్టూ అల్లిన కథ కావడంతో పేర్లు మారతాయే తప్ప సినిమా తమిళ ఫార్ములా మాస్ సినిమా అన్నది తెలుస్తూనే ఉంటుంది. ఫస్టాఫ్‌లో ఓ 40 నిమిషాల తర్వాత సినిమా పూర్తిగా డల్ అయిపోతుంది. మళ్ళీ ఇంటర్వెల్ దగ్గరే ఊపందుకుంటుంది. ఈ గ్యాప్‌లో బలమైన సన్నివేశాలేవీ లేక బోర్ కొట్టిస్తుంది. ఇక సెకండాఫ్‌లో విజయ్-మోహన్ లాల్‌ల మధ్యన వచ్చే ఆసక్తికర ఎపిసోడ్స్ ఇంకా బాగా ప్లాన్ చేసుకోవాల్సింది.

విజయ్-కాజల్‌ల మధ్యన వచ్చే సన్నివేశాలు సినిమాలో అతికించినట్టుగానే కనిపిస్తాయి. ఇలా అప్పుడప్పుడూ వచ్చే సన్నివేశాల్లో కనిపించడం, కొన్ని పాటల్లో ఆడి పాడడం తప్ప కాజల్ పాత్రకు ఈ సినిమాకు పెద్దగా ప్రాధాన్యం లేదు. ఇక తెలుగు కామెడీ సూపర్ స్టార్ బ్రహ్మనందం నవ్వించే ప్రయత్నం చేసినా ఆ ట్రాక్ మాత్రం సరిగ్గా రాసుకోలేదని స్పష్టమవుతుంది. మధురై నేపథ్యంలో రూపొందిన ఈ సినిమాను విజయవాడ దుర్గమ్మ గుడి నేపథ్యంలోకి మార్చి తెలుగులో డబ్ చేశారు. ఈ మార్పు ఏమాత్రం ఇమడకపోగా తేలిపోయింది. ఇక కొన్ని చోట్ల తెలుగు అక్షరాలు కనిపించినా, చాలా చోట్ల తమిళ అక్షరాలను అలాగే ఉంచేశారు. శివయ్య పేరు శివన్ అంటూ సినిమా మొత్తం కనిపిస్తుండడం డిస్టర్బ్ చేసే అంశం.

రెండు ప్రధాన పాత్రలను ఎస్టాబ్లిష్ చేయడం, కలపడం, విడగొట్టడం ఇంతవరకూ క్యారెక్టరైజేషన్‌లలో మంచి పట్టు కనిపించగా, ఆ తర్వాత అంతా సినిమాటిగ్గా జరిగిపోతుంది. క్లైమాక్స్‌ను త్వరత్వరగా ముగించేశారు. దీంతో రెండు పాత్రలను మళ్ళీ కలపడం అనే కాన్సెప్ట్‌లో ఫీల్ మిస్ అయి సాదాసీదాగా సినిమా ముగిసిపోతుంది.

సాంకేతిక విభాగం :

సాంకేతిక అంశాల విషయానికి వస్తే.. ఫార్ములా అయినా కూడా బలమైన, అందరికీ కనెక్ట్ అయ్యే కథను ఎంచుకోవడం, దాన్ని అదే ఫార్ములా కథనంలో మాస్ ఎలిమెంట్స్‌తో చెప్పడంలో దర్శకుడు నేసన్ కథకుడిగా మంచి విజయం సాధించారు. ఇక దర్శకత్వం పరంగా అద్భుతమైన మెరుపులేవీ లేకున్నా.. మాస్ అంశాలను, రెండు ప్రధాన పాత్రల మధ్యన ఎమోషన్‌ను బాగా డీల్ చేశారు. డి. ఇమాన్ అందించిన ఆడియోలో ఆకట్టుకునే పాటలేవీ లేవు. ఉన్నంతలో ఇంట్రో సాంగ్ సాహిత్యం పరంగానూ, మ్యూజిక్ పరంగానూ బాగుంది. బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ విషయంలో మాత్రం ఇమాన్ మంచి ప్రతిబే కనబరిచాడు.

ఇక గణేష్ రాజవేలు అందించిన సినిమాటోగ్రఫీ ఎక్కువగా రిచ్‌నెస్‌ను చూపించడం కన్నా, కథ, నేపథ్యాల మూడ్‌ను క్యాప్చర్ చేయడంలోనే దృష్టి పెట్టడంతో సినిమాలో అచ్చమైన తమిళ ఫ్లేవర్ కనిపిస్తుంది. ఇది ‘ఆఫ్ ది బీట్/డిఫరెంట్ సినిమా’ అయితే వేరే విషయం, పక్కా మాస్ సినిమా కావడంతో సినిమాటోగ్రఫీ తెలుగు ప్రేక్షకులకు కిక్కివ్వలేదు. విజయ్-మోహన్ లాల్‌ కలిసి ఉండే ఫ్రేమ్‌లలో మాత్రం సినిమాటోగ్రాఫర్ పనితనం గమనించవచ్చు. ఎడిటింగ్ బాగుంది. కొన్ని చోట్ల ఎక్కువగా జర్క్ వచ్చినట్టు కనిపిస్తుంది. ఇక ఒక తమిళ సినిమాను తెలుగు సినిమాగా చూపించే ప్రయత్నంలో ప్రధానమైన తెలుగు డైలాగుల్లో శశాంక్ వెన్నెలకంటి మంచి ప్రతిభ కనబరిచారు.

తీర్పు :

విజయ్-మోహన్ లాల్, ఇద్దరు సూపర్ స్టార్ల కాంబినేషన్, తమిళంలో ఈ సినిమాకు ఈ కాంబినేషనే మేజర్ హైలైట్ కాగా, తెలుగుకు వచ్చేసరికి కేవలం వారిద్దరిని రెండు పాత్రల్లో కనిపించే ఇద్దరు నటులుగానే చూడాలి. అక్కడే ఒక మాస్ మసాలా సినిమాలో మొదట్నుంచీ అందరూ కోరుకునే ఓ క్రేజీనెస్ అనేది లేకుండా పోయింది. ఫార్ములా అయినా కూడా బలమైనదే అయిన కథ, పక్కా మాస్ ఎలిమెంట్స్‌తో వచ్చే సన్నివేశాలు, మోహన్ లాల్, విజయ్‌ల యాక్టింగ్ ఈ సినిమాకు కలిసివచ్చే అంశాలు. ఇక కొట్టొచ్చినట్టు కనిపించే తమిళ ఫ్లేవర్, అనవసరమైన కామెడీ, రొమాంటిక్ ట్రాక్స్, అసందర్భమైన, ఆకట్టుకోని పాటలు ఈ సినిమాకు ప్రతికూల అంశాలు. ఒక్క మాటలో చెప్పాలంటే.. అందరికీ కనెక్ట్ అయ్యే బేసిక్ ఎమోషన్‌నే ప్రధానంగా చేసుకునే సినిమాలను పక్కనబెడితే, ఇలాంటి పక్కా మాస్ సినిమాలు, క్రేజీ కాంబినేషన్లు ఎప్పుడైనా కేవలం కొన్ని ప్రత్యేక పరిస్థితులకు, ప్రదేశాలకు మాత్రమే పరిమితమవుతాయి. ఆ కోవలో చూస్తే ‘జిల్లా’ ఓ సాధారణ సినిమా. ఇక రెండున్నర గంటలు కేవలం ఎంజాయ్ చేయడమే కోరుకునే వారికి ఈ సినిమా మంచి ఎంటర్‌టైనర్ అనే చెప్పొచ్చు. మరోలా చెప్పాలంటే.. ఇదే సినిమాను తెలుగులో, తెలుగు నేటివిటీకి మార్చి, తెలుగు క్రేజీ కాంబినేషన్‌లో తీస్తే అదిరిపోయేదే!!

123తెలుగు.కామ్ రేటింగ్ : 2.75/5
123తెలుగు టీం

CLICK HERE FOR ENGLISH REVIEW

సంబంధిత సమాచారం

తాజా వార్తలు