సమీక్ష : కారందోశ – మంచి ఆలోచనే కానీ చెప్పిన విధానం బాగోలేదు !

సమీక్ష : కారందోశ – మంచి ఆలోచనే కానీ చెప్పిన విధానం బాగోలేదు !

Published on Dec 30, 2016 3:05 PM IST
karam dosa review

విడుదల తేదీ : డిసెంబర్ 30, 2016

123తెలుగు.కామ్ రేటింగ్ : 2.25/5

దర్శకత్వం : గాజుల‌ప‌ల్లి త్రివిక్ర‌మ్

నిర్మాత : వీణ వేదిక ప్రొడక్షన్స్

సంగీతం : సిద్ధార్థ్ వాకిన్స్

నటీనటులు : శివ రామ‌చంద్ర‌వ‌రపు, సూర్య శ్రీనివాస్‌, చంద‌న రాజ్

వీణా వేదిక పతాకంపై నూతన దర్శకుడు గాజుల‌ప‌ల్లి త్రివిక్ర‌మ్ డైరెక్ట్ చేసిన చిత్రమే ‘కారం దోశ’. పేరులోనే పూర్తి వైవిధ్యం నమ్ముకున్న ఈ చిత్రం ఒక భిన్నమైన క‌థాంశంతో, సందేశం ఇచ్చేలా రూపొందించబడిందని టీమ్ గతంలో తెలిపారు. మరి ఈరోజే రిలీజైన ఈ చిత్రం ఎంత భిన్నంగా ఉందో.. ఎలాంటి మెసేజ్ ఇచ్చిందో ఇప్పుడు చూద్దాం..

కథ :

కడపలో వేమన (శివ), రవి (సూర్య శ్రీనివాస్), బలి(అనిల్) అనే ముగ్గురు బెస్ట్ ఫ్రెండ్స్ ఒకే రూమ్ లో ఉంటారు. వాళ్లలో రవి పద్దతిగా కష్టపడి బ్రతకాలని చెప్తూ ఉద్యోగం చేసుకుంటుంటాడు. ఇక మంచివాడే అయినప్పటికీ వేమన మాత్రం ఏదైనా చేస్తే పెద్దగానే, ఒక్కసారే చేసి ఎదిగిపోవాలని, ఎక్కువ కలం కష్టపడాల్సిన అవసరంలేదని అంటూ అవకాశం కోసం చూస్తుంటాడు. అతన్ని నమ్ముకుని మూడో ఫ్రెండ్ బలి ఎలాంటి కష్టం చేయకుండా కాలం గడుపుతుంటాడు.

అలాంటి భిన్నమైన మనస్తత్వాలు కలిగిన ఆ ముగ్గురు స్నేహితులు జీవితంలో ఎలా ప్రయాణించారు ?చివరికి ఏ నీతిని తెలుసుకున్నారు ? ఆ నీతి వాళ్లకు తెలిసేలా చేసిన వాళ్ళ చుట్టూ ఉన్న పరిస్థితులేమిటి ? అసలు కారందోశ ? అనే టైటిల్ ఎందుకు పెట్టారు అనేదే ఈ సినిమా కథ.

ప్లస్ పాయింట్స్ :

ఇందులోని ప్లస్ పాయింట్స్ విషయానికొస్తే ముందుగా చెప్పుకోవాల్సింది దర్శకుడు త్రివిక్ర‌మ్ చెప్పాలనుకున్న సున్నితమైన, పచ్చి వాస్తవమైన ఒక అంశం గురించి. కలలను నిజం చేసుకోవాలంటే కష్టపడాలి, ఆ కష్టం అంత సులభంగా ఉండదు, లక్ష్యం పెద్దదైతే కష్టం కూడా పెద్దగానే ఉంటుంది, అసలైన మనిషి ఆ కష్టం చేస్తాడు అంటూ సినిమా చివర్లో చెప్పిన సందేశం చాలా గొప్పగా, మనసుకు తాకే విధంగా ఉంది. ఫస్టాఫ్ ఓపెనింగ్ చాలా ఆసక్తికరంగా అనిపించింది. అలాగే ఒక మంచి ఆలోచన కమ్మని కారందోశ లాంటిదని టైటిల్ కు ఇచ్చిన జెస్టిఫికేషన్ బాగుంది.

కథలోని పాత్రలు మాట్లాడే మాటలు గమ్మత్తుగా, నిజ జీవితానికి చాలా దగ్గరగా ఉంటూ ఆలోచింపజేస్తాయి. ఫస్టాఫ్ లో వచ్చే కొన్ని సందర్భాలు సినిమా సెకండాఫ్ లో ఏదో పెద్ద విశేషమే ఉందనే ఆసక్తిని కలిగించడంలో సక్సెస్ అయ్యాయి. ఇక వేమన పాత్ర పోషించిన శివ రామ‌చంద్ర‌వ‌రపు, సత్యనారాయణ అనే మెస్ ఓనర్ పాత్ర చేసిన సీనియర్ నటుడు సత్యనారాయణల నటన, మాటలు ఆలోచింపజేసే విధంగా ఉండి ఆకట్టుకున్నాయి. ఇక సెకండాఫ్ లో మొదలయ్యే వెంకట రమణ పాత్ర కామెడీ, ఫస్టాఫ్ నుండి సాగే మార్కెటింగ్ ఉద్యోగి కామెడీ బాగానే వర్కవుటయ్యాయి. ప్రీ క్లైమాక్స్ ఎపిపిసోడ్ లో వేమన, సత్యనారాయణ పాత్రలపై నడిచే ఎమోషల్ సీన్లు కనెక్టయ్యాయి.

మైనస్ పాయింట్స్ :

మైనస్ పాయింట్స్ విషయానికొస్తే ముందుగా చెప్పుకోవాల్సింది క‌థాంశాన్ని వాడుకున్న విధానం గురించి. కథాంశం గొప్పదే అయినా కూడా అరగంటకు సరిపోయే ఆ అంశాన్ని 147 నిముషాల సినిమాకు సరిపోతుందనుకుని సాగదీసి సాగదీసి చెప్పారు. దీంతో ఫస్టాఫ్ అంతా పాత్రల పరిచయానికే సరిపోయింది. రెండు మూడు సన్నివేశాల్లో బయటపెట్టవలసిన పాత్రల వ్యక్తిత్వాన్ని మళ్ళీ మళ్ళీ చెప్పడంతో అనవసరమైన సన్నివేశాలు ఎక్కువై విసుగుపుట్టించాయి. మధ్యలో వచ్చే హీరోయిన్ చందన రాజ్ సీన్లు మరీ ఇరికించినట్టు తోచాయి.

ఇక ఫస్టాఫ్ అంతా పూర్తై ఇంటర్వెల్ తరువాత కాసేపటికి గానీ సినిమాలో దర్శకుడు ఏం చెప్పాలనుకుంటున్నాడో క్లారిటీ రాలేదు. దాంతో ముందు చూసిన సినిమా అంతా వృధాయేనా అనిపించింది. అలాగే ఫస్టాఫ్ లో మెస్ ఓనర్ పై నడిచే సీన్లు కొన్ని చూస్తే సెకండాఫ్ లో ఆ పాత్రతో యూనివర్శల్ పాయింట్ ఏదో రివీల్ చేస్తాడు అనే ఆశ కల్పించి అదేదీ లేకుండా సింపుల్ గా సినిమాను మొదటి నుండి ఉన్న పాత్రల మధ్య ముగించేయడం పెద్ద నిరుత్సాహాన్ని మిగిల్చింది. ఇక రవి పాత్రపై నడిచే పెళ్లి తాలూకు సీన్లు, మెస్ ఓనర్ పై నడిచే సీన్లు, వేమన – బలి పాత్రలు మధ్య నడిచే సీన్లు కొన్ని చాలా బోరింగ్ గా అనిపించాయి. చివరకు సినిమా పూర్తయ్యాక అరగంటలో చెప్పాల్సిన పాయింట్ కోసం రెండున్నర గంటలు కూర్చోబెట్టారా అనే అసహనం తలెత్తింది. అది సినిమా మనుగడకే ఆటకం మరి.

సాంకేతిక విభాగం :

దర్శకుడు త్రివిక్రమ్ గాజులపల్లి గొప్ప అంశాన్నే ఎంచుకున్నప్పటికీ అది పూర్తి స్థాయి సినిమాగా తీయడానికి ఏమాత్రం సరిపోలేదు. దాంతో కథనం కూడా ఫస్టాఫ్ కే బోర్ కొట్టేసింది. కానీ పాత్రలకు ఆయన రాసిన మాటలు, ఆ పాత్ర స్వభావం చాలా బాగున్నాయి. రాజా భ‌ట్టాచార్జీ సినిమాటోగ్రఫీ ఫ్రెష్ ఫీల్ ఇస్తూ బాగున్నా ఒకే లొకేషన్లో తీయడం బోర్ అనిపించింది. సిద్ధార్థ్ వాకిన్స్ సంగీతం బాగానే ఉంది. సురేష్‌ ఎడిటింగ్ బాగుంది. వీణ వేదిక ప్రొడక్షన్స్ పాటించితిన్ నిర్మాణ విలువలు బాగున్నాయి.

తీర్పు :

ఒక గొప్ప వాస్తవాన్ని సందేశం రూపంలో సినిమా ద్వారా చెప్పాలనుకున్న టీమ్ చేసిన ప్రయత్నం మంచిదే కానీ షార్ట్ ఫిల్మ్ కు సరిపోయే కంటెంట్ తో రెండున్నర గంటల సినిమా తీయడంతో ఆ ప్రయత్నం చాలా వరకు దెబ్బతింది. తీసుకున్న క‌థాంశం, ఫస్టాఫ్ ఓపెనింగ్, ఆకట్టుకునే పాత్రల మాటలు, స్వభావాలు, ప్రీ క్లైమాక్స్ ఎపిసోడ్ మినహా చాలా రన్ టైమ్ సహనానికి పరీక్ష పెట్టింది. మొత్తంగా చెప్పాలంటే సందేశాత్మక సినిమాలను ఇష్టపడుతూ, సాగదీసిన డ్రామాను ఓర్చుకోనేంత సహనం ఉన్న ప్రేక్షకులకు ఈ సినిమా నచ్చుతుంది.

123telugu.com Rating : 2.25/5

Reviewed by 123telugu Team

Click here for English Review

సంబంధిత సమాచారం

తాజా వార్తలు