సమీక్ష : మళ్ళీ రావా – మళ్ళీ చూసేలా ఉంది

సమీక్ష : మళ్ళీ రావా – మళ్ళీ చూసేలా ఉంది

Published on Dec 9, 2017 6:05 PM IST
Malli Raava movie review

విడుదల తేదీ : డిసెంబర్ 08, 2017

123తెలుగు.కామ్ రేటింగ్ : 3.25/5

దర్శకత్వం : గౌతమ్ తిన్ననూరి

నిర్మాత : రాహుల్ యాదవ్ నక్క

సంగీతం : శ్రవణ్ భరద్వాజ్

నటీనటులు : సుమంత్, ఆకాంక్ష సింగ్

‘నరుడా డోనరుడా’ తర్వాత హీరో సుమంత్ చేసిన తాజా చిత్రం ‘మళ్ళీ రావా’. నూతన దర్శకుడు గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రం ఈరోజే ప్రేక్షకుల ముందుకొచ్చింది. మరి ఈ సినిమా ఎలా ఉందో ఇప్పుడు చూద్దాం…

కథ :

కార్తిక్ (సుమంత్) 9వ తరగతి చదువుతున్నప్పుడే తన తోటి స్టూడెంట్ అంజలి (ఆకాంక్ష సింగ్) ను ప్రేమిస్తాడు. కానీ ఇద్దరి ఇంట్లోని పెద్దలు విషయం తెలిసి వాళ్ళను మందలిస్తారు. అంజలి పేరెంట్స్ ఆమెను ఆ ఊరి నుండే తీసుకెళ్ళిపోతారు. అలా 13 ఏళ్ల పాటు అంజలికి దూరమైన కార్తిక్ ఆమెనే ప్రేమిస్తూ ఉండగా ఒక రోజు అంజలి సడన్ గా అతను జాబ్ చేసే కంపెనీకే వస్తుంది.

ఆ కలయికతో అంజలి కార్తీక్ ప్రేమను అర్థం చేసుకుని అతన్నే పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకుంటుంది. తీరా పెళ్లి సమయానికి పెళ్లి ఇష్టం లేదని చెప్పి వెళ్ళిపోతుంది అంజలి. మళ్ళీ కొన్నాళ్ళకు తానె స్వయంగా కార్తిక్ ను వెతుక్కుంటూ వస్తుంది. అసలు అంజలి ఆఖరు నిముషంలో పెళ్లి వద్దని కార్తిక్ ను వదిలి ఎందుకు వెళ్ళిపోయింది, మళ్లీ ఎందుకు తిరిగొచ్చింది, తిరిగొచ్చిన అంజలిని కార్తిక్ అంగీకరించాడా లేదా అనేది ఈ సినిమా.

ప్లస్ పాయింట్స్ :

ప్రేమ కథను దర్శకుడు గౌతమ్ తిన్ననూరి కొత్తగా చూపించిన విధానమే ఈ సినిమాకు ప్రధాన ప్లస్ పాయింట్. హీరో, హీరోయిన్ ను ప్రేమించే విధానమే చాలా కొత్తగా ఉంటుంది సినిమాలో. ఒక రకంగా చెప్పాలంటే హీరో గుండెల్లో ఆకాశమంత ప్రేమున్నా, హీరోయిన్ ఎప్పటికప్పుడు తనను వదిలి వెళ్లిపోతున్నా ఆమెను కనీసం కారణం కూడా అడగనంత స్వచ్ఛమైన ప్రేమ అతనిది. ఇక హీరోయిన్ కోణం నుండి చూస్తే చిన్నతనంలోనే హీరోని ప్రేమించిన తాను పెరిగిన కుటుంబ వాతావరణం వలన హీరోకి దగ్గరవడానికి వెనక్కుతగ్గుతూ ఎప్పటికప్పుడు అతన్ని దూరం చేసుకుంటూనే ఉంటుంది.

దర్శకుడు గౌతమ్ ఈ రెండు అంశాలని చక్కగా మిక్స్ చేసి సెకండాఫ్లో మంచి స్క్రీన్ ప్లేను రాసుకుని సినిమాను రూపొందించిన విధానం బాగుంది. ప్రేమికుల చిన్నప్పటి ప్రేమ కథలోని కొన్ని సన్నివేశాలు, పెద్దయ్యాక, ప్రస్తుతంలోని ఇంకొన్ని ఎమోషనల్ సీన్లు బాగున్నాయి. ముఖ్యంగా హీరోయిన్ హీరోని వదిలి వెళ్లిపోయే సందర్భం, చివర్లో అతనికి సంజాయిషీ చెప్పుకునే సందర్భం భావోద్వేగపూరితంగా ఉండి టచ్ చేస్తాయి.

ఇక ఎలాంటి పరిస్థితిలో అయినా ప్రేయసిని అర్థం చేసుకునే ఉదార స్వభావం కలిగిన ప్రేమికుడిగా సుమంత్ నటన చాలా బాగుంది. హీరోయిన్ ఆకాంక్ష సింగ్, హీరో స్నేహితుడిగా చేసిన అభినవ్ ల నటన బాగున్నాయి. హీరో ఆఫీస్ వాతావరణంలో నడిచే ఫన్ సీన్ చాలా చోట్ల నవ్వించాయి.

మైనస్ పాయింట్స్ :

సినిమాకు మైనస్ పాయింట్స్ అంటే చెప్పుకోవాల్సింది స్లో నరేషన్. కొన్ని చోట్ల, ముఖ్యంగా ఫస్టాఫ్లో డ్రామా మరీ ఎక్కువైంది. ఆరంభం నుండి చివరి వరకు ప్రేమ పరంగా సినిమాను పైకి లేపే సన్నివేశాలు రెండు మాత్రమే ఉంటాయి. అలా కాకుండా ఇంకొన్ని సన్నివేశాలని రూపొందించి ఉంటే అంటే హీరో తాలూకు బాధను ఇంకాస్త ప్రభావితంగా చూపించి ఉంటే బాగుండేది.

అలాగే దర్శకుడు గౌతమ్ రాసుకున్న కొత్త తరహా స్క్రీన్ ప్లే రెండవ అర్ధభాగంలో బాగుంది కానీ ఫస్టాఫ్లో మాత్రం 1999, 2012, 2017 వంటి మూడు కాలాల మధ్య కొట్టుకుంటూ నడవడం మూలాన చూసే ప్రేక్షకులకు కొంత ఇబ్బందికరంగా అనిపిస్తుంది. హీరో చిన్ననాటి ప్రేమ కథ యొక్క లెంగ్త్ ను కొంత తగ్గించేసి ఉంటే రిలీఫ్ గా ఉండేది. హీరోయిన్ ఆఖరిసారి హీరోని వెతుక్కుంటూ రావడానికి పెద్దగా బలమైన కారణమేదీ కనిపించకపోవడం కూడా కొంత నిరుత్సాహంగా అనిపిస్తుంది.

సాంకేతిక విభాగం :

దర్శకుడు గౌతమ్ తిన్ననూరి ప్రేమ కథను కొత్త కోణంలో చూపించడానికి చేసిన ప్రయత్నం బాగుంది. కొద్దిగా తికమక పెట్టే ఫస్టాఫ్ స్క్రీన్ ప్లే, ఎక్కువైనట్టు అనిపించే కొంత డ్రామా వంటి లోపాల మినహా మిగతా సినిమా మొత్తాన్ని బాగా హ్యాండిల్ చేశారాయన. కీలకమైన చోట్ల ఇంకొన్ని భావోద్వేగపూరితమైన సన్నివేశాల్ని యాడ్ చేసి ఉంటే ఇంకా బాగుండేది.

శ్రవణ్ భరద్వాజ్ అందించిన సంగీతం, బ్యాక్ గ్రౌండ్ స్కోర్ చాలా బాగా కుదిరాయి. నరేష్ సినిమాటోగ్రఫీ కూడా హడావుడి లేకుండా బాగుంది. సత్య తన ఎడిటింగ్ ద్వారా ఫస్టాఫ్ డ్రామా లెంగ్త్ ను కొద్దిగా తగ్గించి ఉంటే బాగుండేది. రాహుల్ యాదవ్ నక్క పాటించిన నిర్మాణ విలువలు బాగున్నాయి.

తీర్పు :

ఈ ‘మళ్ళీ రావా’ చిత్రం సుమంత్ కు మంచి కమ్ బ్యాక్చెఅని ప్పొచ్చు. సినిమా కథను, అందులో సుమంత్ నటనను చూస్తే ‘గోదావరి’ సినిమా నాటి సుమంత్ గుర్తుకోస్తారు. గౌతమ్ తిన్ననూరి దర్శకత్వం, ఆయన ప్రేమకథను సరికొత్త కోణంలో చూపించిన విధానం, హీరో హీరోయిన్ల నటన, తగినంత ఫన్, భావోద్వేగానికి గురిచేసే రెండు కీలకమైన సందర్భాలు సినిమాలో మెచ్చుకోదగిన అంశాలు కాగా కన్ఫ్యూజన్ కు గురిచేసే ఫస్టాఫ్ స్క్రీన్ ప్లే, కాస్త ఎక్కువైన డ్రామా, సినిమా చాలా వరకు ఒకే మంద్ర స్థాయిలో సాగడం ఇందులో కొద్దిగా నిరుత్సాహపరిచే అంశాలు. మొత్తం మీద చెప్పాలంటే మళ్ళీ చూడాలనిపించేలా ఉన్న ఈ చిత్రం యువతకు, మల్టీ ప్లెక్స్ ప్రేక్షకులకు బాగా నచ్చుతుంది.

123telugu.com Rating : 3.25/5

Reviewed by 123telugu Team

Click here for English Review

సంబంధిత సమాచారం

తాజా వార్తలు