సమీక్ష : మిస్టర్ – లాజిక్ లేని కమర్షియల్ డ్రామా

Mister movie review

విడుదల తేదీ : ఏప్రిల్ 14, 2017

123తెలుగు.కామ్ రేటింగ్ : 2.75/5

దర్శకత్వం : శ్రీను వైట్ల

నిర్మాత : ఠాగూర్ మధు, నల్లమలపు బుజ్జి

సంగీతం : మిక్కీ జె మేయర్

నటీనటులు : వరుణ్ తేజ్, లావణ్య త్రిపాఠి, హెబ్బా పటేల్

మెగా హీరో వరుణ్ తేజ్ సంవత్సరం పైగా గ్యాప్ తీసుకుని శ్రీను వైట్ల డైరెక్షన్లో చేసిన చిత్రమే ఈ ‘మిస్టర్’. దర్శకుడు శ్రీను వైట్ల వరుస పరాజయాల తర్వాత తాను చేసిన ఈ సినిమా కొత్తగా ఉంటుందని, తప్పక ప్రేక్షకుల్ని మెప్పిస్తుందని చెప్పడంతో ఈ సినిమాపై ఆడియన్స్ లో మంచి అంచనాలు క్రియేట్ అయ్యాయి. మరి ఈరోజే రిలీజైన ఈ చిత్రం ఆ అంచనాల్ని ఎంతవరకు అందుకుందో ఇప్పుడు చూద్దాం..

కథ :

చై (వరుణ్ తేజ్) అనే ఎన్నారై కుర్రాడు హెబ్బా పటేల్ ను ప్రేమిస్తాడు. కానీ ఆమె మాత్రం వేరొకరిని ఇష్టపడి చై ను వదిలి ఇండియా వచ్చేస్తుంది. అలా రోజులు గడుస్తుండగా ఆమె ఒకరోజు చై కు ఫోన్ చేసి తాను చాలా కష్టాల్లో ఉన్నానాని, కాపాడమని అడుగుతుంది.

చై కూడా ఆమెకు సహాయం చేయాలని ఇండియా వస్తాడు. అలా తన ప్రేమ కోసం ఇండియా వచ్చిన చై అనుకోకుండా లావణ్య త్రిపాఠి మరియు ఆమె కుటుంబానికి సంబందించిన పెద్ద సమస్యలో ఇరుక్కుంటాడు. అలా ఇరుక్కుపోయిన చై ఆ ఇద్దరమ్మాయిల సమస్యల్ని ఎలా తీర్చాడు ? చివరికి ఎవర్ని పెళ్లి చేసుకున్నాడు ? అనేదే ఈ సినిమా కథ.

ప్లస్ పాయింట్స్ :

సినిమాలోని ప్లస్ పాయింట్స్ విషయానికొస్తే ఫస్టాఫ్లో హీరో వరుణ్ తేజ్, హీరోయిన్ హెబ్బా పటేల్ మధ్య నడిచే కొన్ని లవ్ సీన్స్ ఫ్రెష్ ఫీల్ తో బాగున్నాయి. అలాగే కమెడియన్లు శ్రీనివాస్ రెడ్డి, రఘుబాబుల మధ్య తనదైన స్టైల్లో మంచి కామెడీని జనరేట్ చేశారు శ్రీను వైట్ల.

హీరో వరుణ్ తేజ్ నటన పరంగా బాగానే మెప్పించాడు. సినిమా సినిమాకి తనలోని నటుడ్ని ఇంప్రూవ్ చేసుకుంటూ వస్తున్న వరుణ్ ఈ సినిమాని చివరి దాకా తన భుజాలపైనే మోయడానికి ప్రయత్నించాడు. హెబ్బా పటేల్ కూడా వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని తన క్యారెక్టర్లో బాగానే పెర్ఫార్మ్ చేసింది. ఇక మరొక హీరోయిన్ లావణ్య త్రిపాఠికి నటన పరంగా తక్కువ ఆస్కారమున్న పాత్రే చేసినప్పటికీ సాంప్రదాయకరమైన గెటప్స్ లో అందంగా కనిపిస్తూ అలరించింది.

సెకండాఫ్లో పృథ్వి, షేకింగ్ శేషుల కామెడీ ఎంటర్టైన్ చేసింది. సినిమా నిర్మాణ విలువలు గొప్ప స్థాయిలో ఉన్నాయి. ఫారిన్ లొకేషన్స్ ను తెరపై చాలా అందంగా చూపించారు.

మైనస్ పాయింట్స్ :

శ్రీను వైట్ల అంచనాలన్నింటినీ తలకిందులు చేస్తూ సినిమాని చాలా వరకు పట్టాలు తప్పించి నడిపే ప్రయత్నం చేశారు. ఫస్టాఫ్ చూస్తూ చూస్తూ శ్రీను వైట్ల బాగానే చేశాడు అనుకునే సమయానికి ఆ భాగం యొక్క చివరి 10 నిముషాలు మొదలుకుని సెకండాఫ్ మొత్తాన్ని నిరుత్సాహపరిచే రీతిలో తయారుచేశాడు.

అనవసరమైన పాత్రలు ఎలాంటి రీజన్ లేకుండా కథనంలోకి ప్రవేశిస్తుండటంతో కథ లాజిక్ లేకుండా తయారైంది. సినిమాలో ప్రతి ప్రధాన పాత్రకి ఒక ఫ్లాష్ బ్యాక్ ఉండటం మరియు కర్ణాటక బ్యాక్ డ్రాప్లో నడిచే స్టోరీ, అందులో చూపించబడిన రాజవంశం వంటి అంశాలు మరీ ఇరిటేట్ చేశాయి. ఎలాంటి అర్థం లేని సన్నివేశాలు నడుస్తుంటే స్క్రీన్ మీద అసలేం జరుగుతోంది అనే భావన కలిగింది.

ఇక క్లైమాక్స్ లో వచ్చే బలవంతపు కుటుంబ సన్నివేశాలు, ఫైటింగ్స్ మరింత నిరుత్సాహపరిచాయి. దానికి తోడు ఎక్కువైన రన్ టైమ్ చూస్తే ఎడిటింగ్ సమయంలో దర్శక నిర్మాతలు ఏం చేస్తున్నారో అనే సందేహం కలిగింది. అలాగే ఒకదాని తర్వాత మరొకటిగా వచ్చే బోరింగ్ కామెడీ సీన్లు కూడా చిరాకు పెట్టాయి. షకలక శంకర్, ప్రియదర్శిల కామెడీ సీన్లని ఇంకాస్త కట్ చేసి ఉండాల్సింది.

సాంకేతిక విభాగం :

శ్రీను వైట్ల నిర్మాణం పరంగా సినిమాను ఘనంగానే ఉండేలా చేశారు. యూరప్ వంటి విదేశాల్లో షూట్ చేసిన విజువల్స్, ఇండియాలో సెట్ చేసుకున్న విలేజ్ సెటప్ వంటివి చాలా బాగున్నాయి. గుహన్ కెమెరా వర్క్ స్క్రీన్ మీద అందంగా కనబడింది. శ్రీను వైట్ల తనదైన స్టైల్లో రాసిన డైలాగ్స్ బాగున్నాయి. ఎడిటింగ్ ఏమంత బాగోలేదు. సినిమాను కనీసం ఒక 15 నిముషాల వరకు కట్ చేసి ఉండాల్సింది. ఒక ఎన్నారై కుర్రాడిగా వరుణ్ తేజ్ లుక్స్ ఏమంత ఆకట్టుకునే విధంగా లేవు. మిక్కీ జె మేయర్ సంగీతం పర్వాలేదనిపించింది.

వరుస ఫ్లాపుల తర్వాత కూడా శ్రీను వైట్ల కథ, కథనం వంటి అంశాలను శ్రీను వైట్ల చాలా ఈజీగా తీసుకోవడం బాగోలేదు. కథ, కథనాలు ఒక గమ్యం అంటూ లేకుండా ఎలా పడితే అలా నడపడంతో సినిమా చూడటం కష్టంగా మారింది. అనవసరమైన పాత్రలు ఎక్కువవడం సినిమాకు పెద్ద డ్రా బ్యాక్. కొన్ని ఫన్నీ సన్నివేశాల్ని మినహాయిస్తే శ్రీను వైట్ల పనితనం బిలో యావరేజ్ గా ఉంది.

తీర్పు :

శ్రీను వైట్ల డైరెక్ట్ఈ చేసిన ‘మిస్టర్’ సినిమా విడి విడి భాగాలుగా చూస్తే మాత్రమే బాగుంది. ఫస్టాఫ్లో మంచి కామెడీ, సినిమాకు సపోర్ట్ గా నిలిచే స్టార్ కాస్ట్ బాగున్నా కూడా గతి తప్పిన సెకండాఫ్, కథనంలోకి బలవంతంగా చొచ్చుకొచ్చే పాత్రలు, అనవసరమైన సన్నివేశాలు మైనస్ పాయింట్స్ గా నిలిచాయి. మొత్తం మీద చెప్పాలంటే రొటీన్ కథ, కథనాలను, అనవసరమైన సన్నివేశాలను తట్టుకునే వారికి ఈ సినిమా పర్వాలేదనిపించినా ఆసక్తికరమైన సినిమాల్ని మాత్రమే కోరుకునే వారికి అంతగా నచ్చకపోవచ్చు.

123telugu.com Rating : 2.75/5

Reviewed by 123telugu Team

Click here for English Review

సంబంధిత సమాచారం :