సమీక్ష : నక్షత్రం – అనుకున్నంతగా మెరవలేకపోయింది

సమీక్ష : నక్షత్రం – అనుకున్నంతగా మెరవలేకపోయింది

Published on Aug 4, 2017 5:20 PM IST
Nakshatram movie review

విడుదల తేదీ : ఆగష్టు 04, 2017

123తెలుగు.కామ్ రేటింగ్ : 2.75/5

దర్శకత్వం : కృష్ణ వంశీ

నిర్మాత : కె.శ్రీనివాస్, ఎస్.వేణుగోపాల్, సాజు

సంగీతం : మణిశర్మ, బీమ్స్

నటీనటులు : సందీప్ కిషన్, సాయి ధరమ్ తేజ్, రెజినా, ప్రగ్యా జైస్వాల్

కృష్ణ వంశీ సినిమాలు అంటే అందులో ఏదో ఒక కొత్త విషయం ఉంటుంది. మంచి మెసేజ్ చెబుతాడు అని ప్రేక్షకులు ఆశిస్తారు. అతని గత సినిమాలు చాలా వరకు ఆయన మార్క్ ని అందుకున్నాయి. అయితే ఈ మధ్య కాలంలో వరుస ఫ్లాప్ లతో కాస్తా వెనక్కి వెళ్ళాడు. అయితే చాలా రోజుల తర్వాత నక్షత్రం సినిమాతో మరల ప్రేక్షకుల ముందికి వచ్చాడు. స్టార్ నటులతో తెరకెక్కిన ఈ సినిమా మరి ఆయన మార్క్ ని అందుకుందా లేదా అనే విషయం తెలుసుకుందాం.

కథ :

రామారావు(సందీప్ కిషన్) పోలీస్ కుటుంబంలో పుట్టి తండ్రి స్ఫూర్తి తో తను కూడా పోలీస్ అవ్వాలని అనుకుంటాడు. అలా పోలీస్ కావడం కోసం తన ప్రయత్నాలు తాను చేస్తూ ఉంటాడు. అయితే అనుకోకుండా కమీషనర్ కొడుకు(తనీష్)తో గొడవ పడటంతో అతను రామారావుకు పోలీస్ ఉద్యోగం రాకుండా చేస్తాడు. ప్రజలని కాపాడే ప్రతి పౌరుడు పోలీస్ అని అతని తల్లి చెప్పిన మాటతో పోలీస్ యూనిఫామ్ వేసుకొని డ్యూటీ మొదలు పెడతాడు. అయితే తాను వేసిన అలెగ్జాండర్ యూనిఫామ్ వలన అనుకోకుండా జరిగిన ఓ బాంబు బ్లాస్ట్ లో ఇరుక్కుంటాడు. అక్కడి నుంచి అతని చుట్టూ వరుసగా సమస్యలు చుట్టుకుంటాయి. సిటీలో వరుస బాంబు దాడులతో ప్రమేయం ఉన్న వాళ్ళు రామారావుని టార్గెట్ చేస్తారు. డీసీపీ అలెగ్జాండర్(సాయి ధరమ్ తేజ్) అసలు ఏమయ్యాడు? అతనికి సిటీ లో జరిగిన బాంబు బ్లాస్ట్స్ కి సంబంధం ఏమిటి? పోలీస్ కమీషనర్ కొడుకుతో రామారావుకి ఉన్న వైరం ఏమిటి? అనేది సినిమా కథ.

ప్లస్ పాయింట్స్ :

సినిమాలో పాజిటివ్ పాయింట్స్ అంటే ముందుగా డైరెక్టర్ కృష్ణ వంశీ ఎంచుకున్న స్టొరీ లైన్. ఈ సినిమా ప్రధాన బలం అంటే అదే. పోలీస్ అవ్వాలనే ఒక యువకుడు కథని తీసుకొని దానిని కాస్తా డిఫరెంట్ యాంగిల్ లో చెప్పాలని చేసిన ప్రయత్నం. అలాగే సినిమాకి కృష్ణ వంశీ మార్క్ రొమాన్స్ ఆశించి వెళ్ళే వారికి అది ఫుల్ గా దొరుకుతుంది .ఈ విషయంలో డైరెక్టర్ హీరోయిన్స్ లో ఏ రేంజ్ లో కావాలంటే ఆ రేంజ్ లో అందాల విందుని ఆడియన్స్ కి అందించాడు.

ఇక నటీనటుల సంగతి చూసుకుంటే. ఇందులో ఎక్కువగా పెర్ఫార్మెన్స్ చేసే అవకాశం తనీష్ కి ఆ తరువాత సందీప్ కిషన్ దొరికింది. కథ కూడా వాళ్ళిద్దరి చుట్టూ తిరగడం వలన ఇద్దరు చాలా మంచి పెర్ఫార్మెన్స్ చేశారు. పోలీస్ అవ్వాలనే కోరికతో ఉన్న ఒక యువకుడుగా చాలా అద్బుతమైన నటనని సందీప్ కిషన్ ప్రదర్శించాడు. ఇక డ్రగ్ ఎడిక్ట్ గా తనీష్ నటన కూడా ఆకట్టుకుంది. ప్రకాష్ రాజ్ గురించి ఇక ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. అతను తనకు అలవాటైన స్టైల్లో పాత్రలో పరకాయ ప్రవేశం చేసేశాడు. ఇక సినిమాలో సాయి ధరమ్ తేజ్ ఉన్నంతలో పర్వాలేదు. హీరోయిన్స్ గా చేసిన ప్రగ్యా జైస్వాల్ యాక్షన్ ఎపిసోడ్స్ లో మంచి ఈజ్ చూపించింది. రేజీనా కూడా పరవాలేదనిపించుకుంది. ఇక మిగిలిన ఆర్టిస్ట్ లు కూడా వారి పరిధి మేరకు భాగానే చేసారు.

మైనస్ పాయింట్స్ :

సినిమాలో మైనస్ పాయింట్స్ అంటే కచ్చితంగా చెప్పుకోవాల్సింది కృష్ణ వంశీ మేకింగ్ విజన్ గురించి. అతను చెప్పాలనుకున్న పాయింట్ చెప్పడం కోసం నడిపించిన స్క్రీన్ ప్లే ఏ కోణంలోనూ కూడా ఆకట్టుకోలేదు. సినిమాలో సీన్స్ అన్ని కావాలని ఒకదానితో ఒకటి కలిపిన ఫీలింగ్ కలుగుతుంది తప్ప కథ నడుస్తున్నట్లు ఎక్కడ అనిపించదు. ప్రెజెంట్ టెక్నాలజీ చాలా అడ్వాన్స్ స్టేజి లో ఉంది. కాని కాప్ ఆపరేషన్ మొత్తం 10 ఏళ్ల క్రితం నడిపించినట్లు ఉంటుంది. ఇక్కడ లాజిక్స్ కనిపించవు. ఒక కమర్షియల్ సినిమాకి లాజిక్ అవసరం లేదనుకున్నా, ఖచ్చితంగా వివరణ ఇవ్వాల్సిన సన్నివేశాలని కూడా సమాధానం లేకుండా ముగిసిపోతాయి

సినిమాలో రెజినా కేవలం అందాల ప్రదర్శనకే పరిమితం అయ్యింది. అలాగే సినిమాలో కీలకమైన పాత్ర అయిన అలెగ్జాండర్ పాత్ర సాయి ధరమ్ చేయాల్సిన రేంజ్ అయితే కాదు. అలాగే ఆ పాత్రని ముగించిన విధానం కూడా చాలా అసందర్భంగా ఉంటుంది. ఇక తనీష్ ఫ్రెండ్స్ గా చేసిన కుర్రాళ్ళు అందరు చిన్న సినిమాల్లో హీరోలుగా చేసినవారే కాని వాళ్ళ పాత్రలకి ఏ మాత్రం ప్రాముఖ్యత లేదు. అలాగే కృష్ణ వంశీ సినిమాలంటే కొద్దిగా ఆహ్లాదకరమైన హాస్యం కూడా ఆడియన్స్ కోరుకుంటారు. అయితే సినిమాలో హాస్యం ఉన్న అది హాస్యం అని అర్ధం చేసుకోవడానికి చాలా టైం పడుతుంది. సినిమాలో చాలా పాత్రలు అర్ధంతరంగా ముగిసిపోతాయి.

సాంకేతిక విభాగం :

సినిమా ప్రొడక్షన్ వాల్యూస్ భాగానే ఉన్నాయి. ఉన్నంతలో భాగా ఖర్చు పెట్టారు. అలాగే సాంగ్స్ చిత్రీకరణ కూడా చాలా రిచ్ గా ఖర్చు కనిపిస్తుంది. దర్శకుడుగా కృష్ణ వంశీ కేవలం హీరోయిన్స్ గా రొమాంటిక్ గా ఎలివేట్ చేయడంలో తప్ప ఏ యాంగిల్ లో కూడా మెప్పించాలేకపోయారు . పాటల్లో సినిమాటోగ్రఫీ బాగుంటుంది. ఇక నేరేషన్లో కూడా కెమెరా పనితనం భాగానే ఉంటుంది. ఇక ఈ సినిమాకి మణిశర్మ తో పాటు మరో ముగ్గురు మ్యూజిక్ డైరెక్టర్స్. దీనికి మణిశర్మ మార్క్ అయితే లేదు.

సినిమా మొత్తం మ్యూజిక్ స్టొరీని డిస్టర్బ్ చేస్తూ చాలా హెవీగా ఉంటుంది. పాటల్లో కూడా అదే స్థాయిలో మ్యూజిక్ ఉంది. చూడటానికి పాటలు బాగానే ఉన్నా వినాలంటే మాత్రం కొద్దిగా కష్టపడాలి. ఇక ఎడిటర్ శివ వై ప్రసాద్ చాలా వరకు కత్తెరకి పని చెప్పొచ్చు. అనవసరమైన సన్నివేశాలు కథా గమనాన్ని అడ్డుకునే సన్నివేశాలు సినిమాలో చాలా ఉన్నాయి.

తీర్పు :

హిట్ ఫార్ములా అయిన పోలీస్ కథని తీసుకొన్న కృష్ణ వంశీ దాన్ని ఆకట్టుకునే విధంగా చెప్పడంలో విఫలమయ్యారు. దానికి తోడు మ్యూజిక్ డైరెక్టర్స్ సంగీతం కూడా ప్రేక్షకుడి సహనాయికి పరీక్ష పెట్టేదిగా ఉంది. ఇక సందీప్ కిషన్, తనీష్ కథని నడిపించడానికి ప్రయత్నిస్తే, సాయి ధరమ్ తేజ్ సినిమాలో ఉన్నా కూడా ఏం చేయలేక చూస్తూ ఉండి పోయాడు. రెజినా, ప్రగ్యా అందాలు ఆరబోసిన నక్షత్రంలో మెరుపులు మాత్రం తేలేకపోయారు. ఓవరాల్ గా కృష్ణ వంశీ మార్క్ ఆశించి సినిమాకి వెళ్ళే వాళ్ళు ఖచ్చితంగా నిరుత్సాహానికి గురవడం ఖాయం.

123telugu.com Rating : 2.75/5

Reviewed by 123telugu Team

Click here for English Review

సంబంధిత సమాచారం

తాజా వార్తలు