సమీక్ష : నాయకి – భయపెట్టలేకపోయిన ‘నాయకి’!

సమీక్ష : నాయకి – భయపెట్టలేకపోయిన ‘నాయకి’!

Published on Jul 16, 2016 1:01 PM IST
Nayaki review

విడుదల తేదీ : 15 జూలై, 2016

123తెలుగు.కామ్ రేటింగ్ : 2.5/5

దర్శకత్వం : గోవీ

నిర్మాతలు : గిరిధర్ మామిడిపల్లి, పద్మజ మామిడిపల్లి

సంగీతం : రఘు కుంచె

నటీనటులు : త్రిష, సత్యం రాజేష్, సుష్మా రాజ్, గణేష్ వెంకట్రామన్..

తెలుగు, తమిళ భాషల్లో స్టార్ హీరోయిన్‌గా వెలుగొందిన త్రిష, తన కెరీర్లో మొదటిసారి చేసిన ఓ పూర్తి స్థాయి లేడీ ఓరియంటడ్ సినిమా ‘నాయకి’. గోవీ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ హర్రర్ కామెడీ పోస్టర్స్, ట్రైలర్‌తో కొద్దినెలల క్రితం మంచి అంచనాలనే రేకెత్తించింది. ఇక పలుమార్లు వాయిదా పడుతూ వచ్చిన ఈ సినిమా, ఎట్టకేలకు నేడు ప్రేక్షకుల ముందుకు వచ్చేసింది. మరి ఈ నాయకి ఎలా ఉందీ? చూద్దాం..

కథ :

హైద్రాబాద్‌కు దగ్గర్లోని దుండిగల్ అనే ప్రాంతంలో వరుసగా కొందరు వ్యక్తులు అదృశ్యమవుతూ ఉంటారు. ఏళ్ళుగా ఇలా ఆ ప్రాంతంలోని ఓ బంగ్లా పరిసరాల్లో కొందరు వ్యక్తులు అదృశ్యమవుతూ ఉండడంతో, ప్రభుత్వం కూడా అటువైపుగా ఎవ్వరినీ వెళ్ళవద్దని హెచ్చరిస్తుంది. ఇక ఇదిలా ఉంటే సంజయ్ (సత్యం రాజేష్) అనే ఓ సినీ దర్శకుడు, తనకు స్నేహితురాలైన సంధ్య (సుష్మా రాజ్) అనే ఓ అమాయక అమ్మాయిని తీసుకొని, ఆమెను అనుభవించడానికి తన స్నేహితుడికి చెందిన గెస్ట్ హౌస్‌కు బయలుదేరతాడు.

కాగా ఆ దారిలో కొన్ని అనుకోని పరిస్థితుల వల్ల, సంజయ్, సుష్మాలు దుండిగల్‌లోని దయ్యాల బంగ్లాకు వెళ్ళి అక్కడ చిక్కుకుంటారు. ఆ బంగ్లాలో గాయత్రి (త్రిష) అనే ఓ దయ్యం అంతా విచిత్రంగా ప్రవర్తిస్తూ ఉంటుంది. తన బంగ్లాకు వచ్చే వారందరినీ ఇష్టం వచ్చినట్లు ఆడుకుంటూ, చంపేస్తూ ఉంటుంది. ఈ కోవలో సంజయ్ కూడా గాయత్రి వల్ల చాలా ఇబ్బందులు ఎదుర్కుంటాడు. అసలు గాయత్రి అలా ప్రవర్తించడానికి కారణం ఏంటి? ఆ ఇంట్లో ఏం ఉంది? గాయత్రి గతం ఏంటి? అందర్నీ చంపినట్లుగానే గాయత్రి సంజయ్‌ని కూడా చంపేస్తుందా? లాంటి ప్రశ్నలకు సమాధానమే ఈ సినిమా.

ప్లస్ పాయింట్స్ :

ఈ సినిమాకు మేజర్ ప్లస్ పాయింట్ అంటే కథాంశం, దాని నేపథ్యమనే చెప్పుకోవాలి. త్రిషని మొదట్నుంచే దయ్యంగా పరిచయం చేయడం, తన బంగ్లాకు వచ్చేవారితో ఆమె ఆడుకునే ఆటలు, అప్పుడప్పుడు ఆమె పాత్ర ఓ సినిమా హీరోయిన్‌లా మారిపోయి వింతగా ప్రవర్తిస్తూ ఉండడం.. ఇవన్నీ చాలా కొత్తగా ఉన్నాయి. ఇక ఈ పాత్రలో త్రిష కూడా చాలా బాగా నటించింది. ఆమె నటనలో కొత్త కోణాన్ని ఈ సినిమాలో చూడొచ్చు. సత్యం రాజేష్ చేసే కామెడీ మరో హైలైట్‌గా చెప్పుకోవాలి. నెగటివ్ షేడ్స్ ఉన్న పాత్రలో అతడి నటన కూడా బాగా ఆకట్టుకుంది.

ఇక సుష్మారాజ్ గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి. ఓ అమాయకురాలైన పాత్రలో సుష్మా బాగా నటించింది. నటుడు జయప్రకాష్ తన స్థాయికి తగ్గ నటన ప్రదర్శించాడు. ఓపెనింగ్ సీక్వెన్స్, త్రిష ఎంట్రీ రెండూ సినిమా పరంగా హైలైట్స్‌గా చెప్పుకోవచ్చు. ఇక ఫస్టాఫ్‌లో వచ్చే కామెడీ కొన్ని చోట్ల బాగా నవ్విస్తుంది. ‘నాయకి’ అన్న టైటిల్‌కు చివర్లో ఇచ్చే జస్టిఫికేషన్ బాగుంది.

మైనస్ పాయింట్స్ :

ఈ సినిమాకు మైనస్ పాయింట్స్ అంటే వినడానికి బాగున్న ప్రధాన కథను, పూర్తి స్థాయి సినిమాగా మార్చడంలో విఫలమవ్వడం గురించి చెప్పుకోవాలి. ఇలాంటి ఫార్ములాతోనే దర్శకుడు రాఘవ లారెన్స్‌తో మొదలుకొని ఎంతో మంది సినిమాలు తీశారు. ఇక ఆ ఫార్ములాకు సరిపడేలా ఇందులో సరైన సన్నివేశాలు లేకపోవడమే ఇక్కడ మైనస్‌గా తయారైంది. ఫస్టాఫ్ అంతా కామెడీతో, త్రిష చేసే విచిత్ర చేష్టలతో ఆకట్టుకున్నా, సెకండాఫ్‌కి వచ్చేసరికి సినిమా పూర్తిగా ఎటో వెళ్ళిపోయింది. ఫ్లాష్‌బ్యాక్ మొదలవ్వడానికి ముందు పెద్దగా కథలో మార్పులేవీ జరగకపోవడం విసుగు తెప్పించింది. ‘మల్లెపూవు’ అనే పాత్రతో చేసిన కామెడీ చిరాకు పుట్టించింది.

ఇక ఎంతో ఆసక్తికరంగా ఉంటుందనుకున్న ఫ్లాష్‌బ్యాక్ కూడా రొటీన్‌గా ఉండడంతో పాటు, ఆ నేపథ్యంలో వచ్చే సన్నివేశాలన్నీ బోరింగ్‌గా ఉన్నాయి. ముఖ్యంగా భద్రకాళి అనే పాట కూడా సినిమా ఫ్లోను పూర్తిగా దెబ్బతీసింది. ఫ్లాష్‍బ్యాక్ ముగిసిన తర్వాత వచ్చే మెసేజ్ ఓరియంటడ్ సన్నివేశాలు అస్సలు నప్పలేదు. దయ్యం విషయాన్ని పక్కనబెడితే, మిగతా సన్నివేశాల్లోనూ పెద్దగా లాజిక్‌లను పట్టించుకున్నట్లు కనిపించదు.

సాంకేతిక విభాగం :

ముందుగా దర్శక, రచయిత గురించి చెప్పుకుంటే, ఒక కొత్త కథాంశాన్నే ఎంచుకున్న గోవీ, దాన్ని పూర్తి స్థాయి కథగా మార్చడంలో మాత్రం విఫలమయ్యాడు. స్క్రీన్‌ప్లేలో పెద్దగా కట్టిపడేసే అంశాలు ఏమీ లేవు. ఉన్నంతలో కామెడీని వాడుకోవడంలో మాత్రం గోవీకి కొన్నిచోట్ల మంచి మార్కులు వేయొచ్చు. మేకింగ్ పరంగా మాత్రం దర్శకుడు కొన్నిచోట్ల మంచి ప్రతిభ చూపాడు. కెమెరాలోనే దెయ్యం కనపడడం అనే అంశాన్ని మేకింగ్ పరంగా చాలా బాగా చూపించాడు.

ఓ బంగ్లా చుట్టూనే తిరిగే కథకు కావాల్సిన మూడ్‌ను సినిమాటోగ్రాఫర్ జగదీష్ చీకటి బాగా క్యారీ చేశాడు. రఘుకుంచె అందించిన ఆడియోలో చెప్పుకోదగ్గ స్థాయి పాటలేవీ లేవు. సాయికార్తీక్ బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ మాత్రం బాగుంది. ఎడిటింగ్ బాగోలేదు. ప్రొడక్షన్ వ్యాల్యూస్ ఫర్వాలేదనేలా ఉన్నాయి. ఆర్ట్ వర్క్ మాత్రం కొన్నిచోట్ల బాగుంది.

తీర్పు :

హర్రర్ కామెడీ అనే జానర్‌కు రెండు సంవత్సరాలుగా తెలుగులో విపరీతమైన క్రేజ్ పెరిగింది. ఆ క్రేజ్‌ను దృష్టిలో పెట్టుకొనే నెలకో సినిమా చొప్పున ఈ జానర్ సినిమాల సందడి కనిపిస్తూనే ఉంది. అయితే అందులో హర్రర్ మరియు కామెడీ సరిగ్గా ఉంటేనే అవి నిలబడతాయని కూడా ఈ సినిమాలే ఋజువు చేశాయి. స్టార్ హీరోయిన్ త్రిష చేసిన ‘నాయకి’ సరిగ్గా ఈ హర్రర్, కామెడీ అంశాలను సరిగ్గా వాడుకోవడంలోనే విఫలమైంది. కథాంశం బాగుండడం, త్రిషతో పాటు మిగిలిన నటీనటుల నటన, ఫస్టాఫ్‍లో కొన్నిచోట్ల కామెడీ బాగుండడం లాంటి ప్లస్‌లతో వచ్చిన ఈ సినిమా రెండు గంటల పాటు సరిగ్గా కూర్చొబెట్టి ఎంటర్‌టైన్ చేయడంలో మాత్రం పూర్తిగా విఫలమైంది. ఒక్క మాటలో చెప్పాలంటే.. ‘నాయకి’ గురించి చెప్పుకోవడానికి పెద్దగా ఏం లేదు!

123telugu.com Rating : 2.5/5
Reviewed by 123telugu Team

Click here for English Review

సంబంధిత సమాచారం

తాజా వార్తలు