సమీక్ష : నేను కిడ్నాప్ అయ్యాను – ఆకట్టుకోని క్రైమ్ కథ

Nenu Kidnap Iyanu movie review

విడుదల తేదీ : అక్టోబర్ 6, 2017

123తెలుగు.కామ్ రేటింగ్ : 2.25/5

దర్శకత్వం : శ్రీకర్ బాబు

నిర్మాత : మాధవి

సంగీతం : శ్రీకాంత్

నటీనటులు : పోసాని కృష్ణ మురళి మరియు ఇతరులు

వరుసగా చిన్న చిత్రాలు విడుదలవుతున్న నేపథ్యంలో ఆ జాబితాలోకి ‘నేను కిడ్నాప్ అయ్యాను’ చిత్రం కూడా చేరింది. ఈ చిత్రం ఏమేరకు ఆకట్టుకుందో ఇప్పుడు చూద్దాం..

స్టోరీ :

కొత్తగా సాఫ్ట్ వేర్ కంపెనీని స్థాపించి ఉన్నత శిఖరాలని అధిరోహించాలని కలలు కనే కొందరి స్నేహితుల కథ ఇది. ఆ స్నేహితులంతా తమ ప్రాజెక్ట్ ని తీసుకుని ప్రముఖ ఐటి నిపుణుడు అయిన దుబెయ్(పోసాని) అనే వ్యక్తి వద్దకు వెళుతారు. స్నేహితులు వివరించిన ప్రాజెక్ట్ కు పోసాని ఇంప్రెస్ అవుతాడు. ఈ ప్రాజెక్ట్ ని మరింత పెద్దగా చేసి విజయవంతం చేద్దామని పోసాని ఆ స్నేహితులకు చెబుతాడు.

ప్రాజెక్ట్ మొత్తం పూర్తయ్యాక పోసాని తన స్వార్థం కోసం ఆ ప్రాజెక్ట్ ని భారీ మొత్తానికి మరొకరికి అమ్మేస్తాడు. దుబెయ్ చేతిలో మోసపోయిన ఆ స్నేహితులు అతడికి ఎలా బుద్ధి చెప్పారనేదే మిగిలిన కథ.

ప్లస్ పాయింట్స్ :

తన విభిన్నమైన మేనరిజమ్స్ తో పోసాని ఐటి నిపుణుడి పాత్రలో బాగానే నటించారు. అతడి డైలాగ్ డెలివరీ, బాడీ లాంగ్వేజ్ వలన కొన్ని సన్నివేశాల్లో హాస్యం పడుతుంది.

ఈ చిత్రంలో స్నేహితులుగా నటించిన కొత్త నటులు పరవాలేదనిపించే నటనని కనబరిచారు.ఈ చిత్రంలో కామెడీ భారాన్ని పృధ్వి, రఘు బాబులు మోశారు. వారి కనిపించిన సన్నివేశాల్లో కామెడీ పండేలా శక్తి మేరకు ప్రయత్నించారు. ముఖ్యంగా క్లైమాక్స్ సన్నివేశాల్లో పృథ్వి డైలాగ్ డెలివరీ ఆకట్టుకుంటుంది.

మైనస్ పాయింట్స్ :

కథని ఆసక్తికరంగా మలచలేకపోవడమే ఈ చిత్రంలోని ప్రధాన మైనస్ పాయింట్. స్నేహితులంతా కలసి పోసానిని బోల్తా కొట్టించే సన్నివేశాలు ఆకట్టుకునే విధంగా లేవు. స్నేహితులు సాఫ్ట్ వేర్ కంపెనీని స్థాపించాలనుకున్న విధానం, వారు చేసిన ప్రయత్నాలు అంత బాగా చూపించలేదనే చెప్పాలి.

స్పెషల్ రోల్ లో మెరిసిన స్టార్ కమెడియన్ బ్రహ్మానందం పాత్ర కూడా నిరాశపరిచింది. కాలం చెల్లిన పంచ్ డైలాగులు పేలలేదు. లాజిక్ లేని సన్నివేశాలు ఈ చిత్రంలో చాలానే ఉన్నాయి.

సాంకేతిక విభాగం :

సాంకేతిక పరిజ్ఞానం, కిడ్నాప్ క్రైమ్ డ్రామాని కలగలిపి వెండి తెరపై చూపించాలనుకున్న దర్శకుడు శ్రీకర్ బాబు ఐడియా బాగానే ఉంది. కానీ దానిని ఆసక్తికరమైన కథగా మలచడంలో, స్క్రీన్ ప్లే ని సరిగా నడిపించడంలో దర్శకుడు విఫలం అయ్యారు. టెక్నాలజీకి సంబందించిన కొన్ని సన్నివేశాలు మినహా మిగిలినవి ఆకట్టుకోలేదు.

వైజాగ్ లో చిత్రీకరించిన కొన్ని నాచురల్ లొకేషన్స్ లోని సన్నివేశాల్లో కెమెరామెన్ పనితనం బావుంది. కొన్ని అనవసరమైన సన్నివేశాలని తొలగించడంతో ఎడిటింగ్ విభాగం ఇంకా దృష్టి పెట్టి ఉండాల్సింది. ఇక సంగీతం విషయానికి వస్తే ఫస్ట్ హాఫ్ లో వచ్చే రెండు పాటలు బావున్నాయి. తక్కువ బడ్జెట్ లో నిర్మితమైన ఈ చిత్రంలో నిర్మాణ విలువలు బావున్నాయి.

తీర్పు :

చివరగా చెప్పాలంటే.. ‘నేను కిడ్నాప్ అయ్యాను’ అనే చిత్రం ద్వారా ఓ మంచి పాయింట్ ని ఎంచుకున్న దర్శకుడు దానిని సరిగా మలచలేకపోయాడు. దర్శకుడు అవకాశం ఉన్న మేరకు అన్ని పాత్రల నుంచి మంచి పెర్ఫామెన్స్ రాబట్టడానికి ప్రయత్నించారు. సాధారణ ప్రేక్షుకులను ఈ చిత్రం మెప్పించే అవకాశం తక్కువ. క్రైమ్ కథలంటే ప్రత్యేక ఆకర్షణ ఉన్న ప్రేక్షకులు మాత్రం ఈ చిత్రాన్ని ఓ సారి ట్రై చెయ్యొచ్చు.

123telugu.com Rating : 2.25/5

Reviewed by 123telugu Team

Click here for English Review