సమీక్ష : నకిలి – గుడ్ థ్రిల్లర్

సమీక్ష : నకిలి – గుడ్ థ్రిల్లర్

Published on Feb 9, 2013 6:06 PM IST
Nakili-poster విడుదల తేదీ : 09 ఫిబ్రవరి 2013
123తెలుగు.కామ్ రేటింగ్ : 3/5
దర్శకుడు : జీవా శంకర్
నిర్మాతలు : యం. రాజశేఖర్, చినబాబు అరిగెల
సంగీతం : విజయ్ అంటోనీ
నటీనటులు : విజయ్ అంటోనీ, సిద్ధార్థ్ వేణుగోపాల్, రూప మంజరి


మహాత్మ, దరువు సినిమాలకు సంగీతం అందించిన తమిళ్ మ్యూజిక్ డైరెక్టర్ విజయ్ అంటోనీ హీరోగా మారి చేసిన మొదటి ప్రయత్నం నకిలి. తమిళ్లో నాన్ పేరుతో తెరకెక్కిన ఈ సినిమా గత సంవత్సరం విడుదలై విమర్శకుల ప్రశంసలతో పాటు మంచి విజయాన్నే అందుకుంది. తెలుగులో నకిలి పేరుతో డబ్ చేసిన ఈ సినిమా ఎప్పుడో విడుదల కావాల్సింది ఆలస్యంగా విడుదలైంది. జీవా శంకర్ డైరెక్ట్ చేసిన ఈ సినిమా ఎలా ఉందొ ఇప్పుడు చూద్దాం.

కథ :

కార్తీక్ (విజయ్ అంటోనీ) తల్లి తప్పు చేస్తే ఆమెని చంపేసి చిన్నతనంలో జైలుకి వెళతాడు. జైలర్ సహకారంతో చదువుకొని పెద్దయ్యాక జైలు నుండి విడుధలవుతాడు. జైలు నుండి వచ్చాడని అయిన వాళ్లు అసహ్యించుకుంటారు. బస్ ప్రమాదంలో తోటి ప్రయాణికుడు సలీం (?) చనిపోతే కార్తీక్ అతని సర్టిఫికెట్స్ తీసుకుని సలీంగా పేరు మార్చుకుంటాడు. సలీం సర్టిఫికెట్స్ సహకారంతో కాలేజీలో ఎంబీబీఎస్ జాయిన్ అవుతాడు. క్లాస్మేట్ అశోక్ (సిద్ధార్థ్ వేణుగోపాల్) తో స్నేహం చేస్తాడు. సలీం ప్రవర్తన నచ్చి అశోక్ తన ఇంట్లోనే ఉండమంటాడు. అశోక్ ప్రవర్తన నచ్చని అతని ప్రియురాలు రూప (రూప మంజరి) అతనితో గొడవ పడుతుంది. సలీం వల్లే ఈ గొడవ జరిగిందని సలీంని కొట్టి ఇంటి నుండి వెళ్లి పొమ్మంటాడు. సలీం గురించి గురించి అశోక్ ఎంక్వయిరీ చేసే క్రమంలో ఇద్దరి మధ్య గొడవ జరిగి అశోక్ చనిపోతాడు. ఆ హత్య కప్పి పుచ్చే క్రమంలో మరో తప్పు చేస్తాడు. హత్య చేసిన సలీం అక్కడి నుండి పారిపోకుండా ఆ సమస్య నుండి ఎలా బైట పడ్డాడు అనేది మిగతా చిత్ర కథ.

ప్లస్ పాయింట్స్ :

అందరిలాగా కమర్షియల్ హీరో కావాలని కాకుండా విషయం ఉన్న సబ్జెక్ట్ ఎంచుకుని విభిన్నమైన పాత్ర పోషించాడువిజయ్ అంటోనీ. నటించడమే కాకుండా కమర్షియల్ అంశాల గురించి ఆలోచించకుండా డబ్బులు తిరిగి వస్తాయో లేదో అని ఆలోచించకుండా స్క్రిప్ట్ ని నమ్మి ఈ సినిమాని నిర్మించినందుకు విజయ్ అంటోనీని అభినందించి తీరాలి. విజయ్ అంటోనీ కార్తీక్/సలీం పాత్రలకి సరిగ్గా సరిపోయాడు. నటుడిగా మొదటి సినిమా అయినా ఏ మాత్రం బెరుకు లేకుండా బాగా చేసాడు. సినిమా మొత్తం అతని మీదే ఎక్కువగా నడుస్తుంది. అశోక్ పాత్రలో నటించిన సిద్ధార్థ్ వేణు గోపాల్, అతని ప్రియురాలుగా నటించిన రూప మంజరి ఇద్దరూ పర్వాలేదనిపించారు. మిగతా వారిలో ఉమ (విభ నటరాజన్), ప్రియ (అనుయ భగవత్), సతీష్ అందరూ ఎక్కడా అతి చేయకుండా బాగానే నటించారు. మొదటిసారి డైరెక్షన్ చేస్తూ కమర్షియల్ సబ్జెక్ట్ చేయకుండా ఈ సబ్జెక్ట్ ఎంచుకున్నందుకు జీవా శంకర్ ని కూడా అభినందించి తీరాలి. పర్ఫెక్ట్ స్క్రిప్ట్ రాసుకుని ఎక్కడ తడబడకుండా డైరెక్ట్ చేసాడు జీవా శంకర్.

మైనస్ పాయింట్స్ :

బిగి స్క్రీన్ప్లే రాసుకున్న దర్శకుడు కథలో సస్పెన్స్ లేకపోవడం వల్ల నెక్స్ట్ ఏం జరగబోతుందా అన్న ఆసక్తి కలిగించాలేకపోయాడు. సలీం పేరుతో ఆ పాత్రలోకి ఎంటర్ అయిన తరువాత మొదటి భాగం అంతా నిలదొక్కుకోవడానికి ప్రయత్నంతో మొదటి భాగం అంత గడిపాడు. రెగ్యులర్ థ్రిల్లర్ సినిమాల్లో ఉండే భయం ఫాక్టర్ ఈ సినిమాలో కాస్త తగ్గింది. థ్రిల్లర్ సినిమా కావడంతో ఎంటర్టైన్మెంట్ ఏ మాత్రం లేకుండా పూర్తిగా సీరియస్ మోడ్లో సాగింది.

సాంకేతిక విభాగం :

ఈ సినిమాకి అసలు ప్రాణం నేపధ్య సంగీతమే. విజయ్ అంటోనీ సొంత కావడంతో నేపధ్య సంగీతం మీద బాగా శ్రద్ధ తీసుకున్నాడు. జీవా శంకర్ సినిమాటోగ్రఫీ బావుంది. రాత్రిపూట షూట్ చేసిన సన్నివేశాల్లో మొహాలు కనిపించకుండా చిరాకు తెప్పించకుండా బాగా చూపించారు. సౌండ్ మిక్సింగ్ కూడా చాలా బావుంది. ఎడిటర్ నిడివి కాస్త కత్తెర వేస్తే బావుండేది. 2 పాటలు ఉన్నాయి కానీ రెండు అనవసరమే.

తీర్పు :

ఎంటర్టైన్మెంట్, కామెడీ, కమర్షియల్ కోరుకునే వారు కాకుండా థ్రిల్లర్ మూవీస్, డిఫరెంట్ మూవీ లవర్స్ కి నకిలి బాగా నచ్చుతుంది. బిగి స్క్రీన్ప్లే, విజయ్ అంటోనీ నటన, నేపధ్య సంగీతం నకిలి సినిమాకి ప్రాణంగా నిలిచాయి.
123తెలుగు.కామ్ రేటింగ్ : 3/5

అశోక్ రెడ్డి

Click Here for English Review

సంబంధిత సమాచారం

తాజా వార్తలు