సమీక్ష : పెళ్ళిచూపులు – ‘రిఫ్రెషింగ్’ ప్రేమకథ!!

సమీక్ష : పెళ్ళిచూపులు – ‘రిఫ్రెషింగ్’ ప్రేమకథ!!

Published on Jul 29, 2016 8:55 PM IST
pelli choopulu review

విడుదల తేదీ : 29 జూలై, 2016

123తెలుగు.కామ్ రేటింగ్ :3.5/5

దర్శకత్వం : తరుణ్ భాస్కర్

నిర్మాత : రాజ్ కందుకూరి, యాష్ రంగినేని

సంగీతం : వివేక్ సాగర్

నటీనటులు : విజయ్ దేవర కొండ, రీతూ వర్మ

‘పెళ్ళిచూపులు’.. ఒక సినిమా పోస్టర్స్, ట్రైలర్‌తో అందరి చూపూ తనవైపు తిప్పుకోగలదనే విషయానికి ఓ మంచి ఉదాహరణ. ట్రైలర్‌తో చిన్న సినిమాల్లో ఈమధ్య కాలంలో ఈ స్థాయిలో ఆకర్షించిన సినిమా మరొకటి లేదేమో అనిపించిన ఈ సినిమా అన్ని కార్యక్రమాలనూ పూర్తి చేసుకొని నేడు ప్రేక్షకుల ముందుకు వచ్చేసింది. విజయ్ దేవరకొండ, రీతూ వర్మ హీరో, హీరోయిన్లుగా కొత్త దర్శకుడు తరుణ్ భాస్కర్ తెరకెక్కించిన ఈ సినిమా తెలుగు సినిమాకు ఓ రిఫ్రెషింగ్ ప్రేమకథగా నిలుస్తుందన్న ప్రచారం బాగా పొందింది. మరి సినిమా ఆ స్థాయిలోనే ఉందా? చూద్దాం..

కథ :

ప్రశాంత్ (విజయ్ దేవరకొండ).. సరదాగా కాలం వెళ్ళదీసే ఈతరం ఆలోచనలున్న ఓ యువకుడు. తన ఆలోచనలకు తగ్గట్టుగా ప్రశాంత్ ఓ చెఫ్‌గా పనిచేయాలని కోరుకుంటూ ఉంటాడు. ఇక జీవితం పట్ల ఎటువంటి స్పష్టత లేనట్లు కనిపించే అతడికి పెళ్ళి చేస్తే అయినా అన్నీ కుదురుతాయని చిత్ర (రీతూ వర్మ) అనే అమ్మాయితో అతడి తండ్రి పెళ్ళి నిశ్చయిస్తాడు. అయితే చిత్ర మాత్రం తనకు పెళ్ళి ఇష్టం లేదని, ఫుడ్ ట్రక్ బిజినెస్ పెట్టాలన్నది తన కలని పెళ్ళిని నిరాకరిస్తుంది.

ఈ క్రమంలోనే ప్రశాంత్ వేరొక అమ్మాయితో పెళ్ళి ప్రయత్నాలు చేస్తుండగా, వాళ్ళ దగ్గర్నుంచి కూడా ప్రశాంత్‌కి కొన్ని సవాళ్ళు ఎదురవుతాయి. వాటిని ఎదుర్కునేందుకే చిత్రతో కలిసి ప్రశాంత్ ఫుడ్ ట్రక్ బిజినెస్ మొదలుపెడతాడు. రెండు వేర్వేరు ఆలోచనలున్న ఈ ఇద్దరి ప్రయాణం ఆ తర్వాత ఏయే మలుపులు తిరిగిందీ? చివరకు వీరి కథ ఎక్కడివరకు వచ్చిందీ? అన్నదే సినిమా.

ప్లస్ పాయింట్స్ :

ఈ సినిమాకు అతిపెద్ద ప్లస్ పాయింట్స్ అంటే రిఫ్రెషింగ్ కథ, కథనాలు. ఈతరం ఆలోచనలను సరిగ్గా బంధిస్తూ, వాళ్ళ భావోద్వేగాల చుట్టూ ఓ సరికొత్త కథ చెప్పాలన్న దర్శకుడి ఆలోచనను మెచ్చుకోకుండా ఉండలేం. ఎక్కడా వాస్తవికతకు దూరం కాకుండా, ఈతరం ఆలోచనలను అందరికీ కనెక్ట్ అయ్యేలా ఎంటర్‌టైనింగ్‌గా చెప్పడంలో ఈ సినిమా అన్నివిధాలా సఫలమైందనే చెప్పుకోవచ్చు. ఇక ఈ సినిమాలో పాత్రలన్నీ చాలా కొత్తగా ఉన్నాయి. హీరో దగ్గర్నుంచి మొదలుకొని ప్రతి పాత్రకూ ఓ అర్థం ఉండడం, వాటిని సరిగ్గా చెప్పగలగడం ఈ సినిమా సాధించిన విజయాల్లో ఒకటిగా చెప్పాలి.

విజయ్ దేవరకొండ తన పాత్రలో అద్భుతంగా నటించాడు. అతడికిది రెండో సినిమాయే అంటే ఎక్కడా నమ్మలేనంతగా తన పాత్రలో ఒదిగిపోయి నటించేశాడు. రీతూ వర్మతో విజయ్ కెమిస్ట్రీ కూడా చాలా బాగుంది. ఇక ఒక స్ట్రాంగ్, ఇండిపెండెంట్ అమ్మాయిగా రీతూ వర్మ తన నటనతో కట్టిపడేసింది. క్యాస్టిక్ పరంగా సినిమాకు రీతూను ఓ మేజర్ పిల్లర్‌గా చెప్పొచ్చు. ఇక మిగతా సపోర్టింగ్ నటులంతా చాలా బాగా నటించారు. దర్శకుడు అనీష్ కురివెల్లకు కూడా నటుడిగా మంచి మార్కులు వేయొచ్చు.

సినిమా పరంగా చూస్తే ఈ సినిమాలో ఫస్టాఫ్‌ను మేజర్ హైలైట్‌గా చెప్పాలి. ఇక ఇద్దరి ప్రయాణంలో మారిపోయే ఎమోషన్స్, పరిస్థితులు, వాటి మధ్యన వచ్చే సన్నివేశాలు.. వీటన్నింటినీ పకడ్బందీ సన్నివేశాలతో చెప్పడం చాలా బాగుంది.

మైనస్ పాయింట్స్ :

ఈ సినిమాకు మైనస్ పాయింట్స్ గురించి చెప్పాలంటే.. కథ పూర్తిగా ముందే తెలిసిపోయేలా ఉండడం గురించి చెప్పుకోవచ్చు. అదేవిధంగా సెకండాఫ్‌లో సినిమా కాస్త నెమ్మదించడం కూడా ఓ మైనస్. ఇక ఇవిలా ఉంటే.. రెగ్యులర్ కమర్షియల్ సినిమాలను మాత్రమే ఇష్టపడే వారికి ఈ తరహా సినిమా పెద్దగా నచ్చకపోవచ్చు.

సాంకేతిక విభాగం :

సాంకేతిక అంశాల పరంగా చూస్తే, ముందుగా దర్శకుడు తరుణ్ భాస్కర్ గురించి చెప్పుకోవాలి. ఓ రచయితగా, ఓ దర్శకుడిగా ఈ సినిమా విషయంలో తరుణ్ చూపిన ప్రతిభ గురించి నిజానికి ఎంత చెప్పినా తక్కువే అవుతుంది. ఫస్టాఫ్‌లో రచయితగా తరుణ్ చాలాచోట్ల ఓ స్థాయి సెట్ చేసుకున్నాడు. ఇక మేకింగ్ పరంగానూ తరుణ్ మ్యాజిక్ చేశాడనే చెప్పుకోవచ్చు. ఇలాంటి రొమాంటిక్ కామెడీకి ఎలాంటి మేకింగ్ అవసరమో దాన్ని ఎక్కడా వదిలిపెట్టకుండా, ఏయే సన్నివేశాలు ఎలా తీస్తే ఎక్కువ ఇంపాక్ట్ చూపిస్తాయో తెలుసుకుంటూ తరుణ్ దర్శకుడిగా మొదటి సినిమాతోనే ఒక స్థాయి తెచ్చుకున్నాడు.

సినిమాటోగ్రఫీ అదిరిపోయేలా ఉంది. ఈ బడ్జెట్‌లో ఈ స్థాయి విజువల్స్ రావడమంటే మాటలు కాదు. ఈ విషయంలో దర్శకుడు, సినిమాటోగ్రాఫర్, ఆర్ట్ డిపార్ట్‌మెంట్ ఈ మూడు విభాగాల సమన్వయం అద్భుతంగా ఉంది. నగేష్ బెగెల్లా తన సినిమాటోగ్రఫీతో సినిమాకు ఓ సరికొత్త ఫీల్ తీసుకురాగలిగాడు. వివేక్ సాగర్ అందించిన పాటలు ఫర్వాలేదు. బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ మాత్రం చాలా బాగుంది. సినిమా బడ్జెట్ దృష్ట్యా చూస్తే ఈ స్థాయి ప్రొడక్షన్ వ్యాల్యూస్ ఊహించడం కూడా అసాధ్యమే. ఇలా అన్ని విభాగాలూ తమ వంతుగా వంద శాతం న్యాయం చేసిన సందర్భాలు అరుదుగా మాత్రమే కనిపిస్తుంటాయి. ‘పెళ్ళి చూపులు’లో ఈ మ్యాజిక్ చూడొచ్చు.

తీర్పు :

ఒక కొత్త దర్శకుడి సినిమా వస్తోందంటే, సినీ పరిశ్రమే కాకుండా, ప్రేక్షకులూ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తూ ఉంటారు. ఎందుకంటే, కొత్తగా వచ్చేవారే మొదటి సినిమాతోనే తామేంటో నిరూపించుకోవాలన్న ఉత్సాహంతో సరికొత్త కథలను పట్టుకొస్తుంటారు. అయితే ఎప్పటికప్పుడు కొత్త దర్శకులు వస్తున్నా, ఈ ప్రేక్షకులు కోరే మ్యాజిక్ మాత్రం ఎప్పుడో కానీ జరగదు. తాజాగా కొత్త దర్శకుడు తరుణ్ భాస్కర్ చేసిన ప్రయత్నం ‘పెళ్ళిచూపులు’, ఈ అరుదుగా వచ్చే అలాంటి మ్యాజిక్‌లలో ఒకటి. రిఫ్రెషింగ్ కథ, కథనాలు; ప్రేమ, పెళ్ళి, కెరీర్‌పైన ఈతరం ఆలోచనలు; వీటన్నింటినీ ఎంటర్‌టైనింగ్‌గా చెప్పగలిగే సన్నివేశాలు; దేనికవే నిర్ధిష్టంగా కనిపించే పాత్రలు.. ఇలా ఇన్ని కొత్తదనమున్న అంశాలతో వచ్చిన ఈ సినిమాలో సెకండాఫ్ కాస్త నెమ్మదించడం తప్ప పెద్దగా ప్రతికూలాంశాలు లేవు. ఒక్కమాటలో చెప్పాలంటే.. ‘పెళ్ళిచూపులు’, తెలుగు సినిమాకు మరో రిఫ్రెషింగ్ ప్రేమకథ!

123telugu.com Rating :3.5/5

Reviewed by 123telugu Team

Click here for English Review

సంబంధిత సమాచారం

తాజా వార్తలు