సమీక్ష : పిచ్చిగా నచ్చావ్ – మంచి కథే కానీ సరిగా హ్యాండిల్ చెయ్యలేదు !

Pichiga Nachav movie review

విడుదల తేదీ : మార్చి 17, 2017

123తెలుగు.కామ్ రేటింగ్ : 2.5/5

దర్శకత్వం : శశి భూషణ్

నిర్మాతలు : కమల్ కుమార్ పెండెం

సంగీతం : రామ్ నారాయణ

నటీనటులు :సంజీవ్, చేతనా ఉత్తేజ్

కమెడియన్, నటుడు ఉత్తేజ్ కుమార్తె, బాలనటిగా అందరికీ పరిచయమున్న ‘చేతనా ఉత్తేజ్’ కథానాయికగా చేస్తున్న మొదటి చిత్రం ‘పిచ్చిగా నచ్చావ్’. శశి భూషణ్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం ఈరోజే థియేటర్లలోకి వచ్చింది. మరి ఈ సినిమా ఎలా ఉందో ఇప్పుడు చూద్దాం..

కథ :

చందు(సంజీవ్) అనే కుర్రాడు ఒక అమ్మాయిని ప్రేమిస్తాడు. కానీ ఆ అమ్మాయి మాత్రం అతనికి హ్యాండ్ ఇచ్చి వేరొకర్ని పెళ్లి చేసుకుని వెళ్ళిపోతుంది. దాంతో అప్సెట్ అవుతాడు చందు. అలా బాధల్లో ఉన్న అతన్ని మోసం చేసిన అమ్మాయి చెల్లెలైన అను (చేతనా ఉత్తేజ్) పేమిస్తుంది. ఆ విషయం అతనికి చెబుతుంది.

అప్పటికే ఈ కాలం అమ్మాయిల వైఖరికి విసిగిపోయిన చందు అనుకి తన ప్రేమను ప్రూవ్ చేసుకోమని ఊహించని ఒక ఛాలెంజ్ విసురుతాడు. ఆ ఛాలెంజ్ ఏంటి ? అందులో అను నెగ్గి చందు పట్ల తన ప్రేమను ప్రూవ్ చేసుకుందా లేదా ? అనేదే ఈ సినిమా కథ.

ప్లస్ పాయింట్స్ :

సినిమాకు ఎంచుకున్న ప్లాట్ ప్రస్తుత జనరేషన్ మైండ్ సెట్ కు తగ్గట్టు వాస్తవనికి చాలా దగ్గరగా ఉంది. కీలకమైన ఇంటర్వెల్ సమయంలో హీరో హీరోయిన్ కి కండిషన్ పెట్టే సన్నివేశాలను చాలా బాగా ఎగ్జిక్యూట్ చేశారు. నటుడు నందు హ్యాండ్సమ్ గా కనిపిస్తూ తన పాత్రలో మెప్పించాడు.

చేతనా ఉత్తేజ్ పాటర్ చుట్టూ ఉండే ఎమోషన్స్ ని దర్శకుడు తెరపై చాలా చక్కగా ఆవిష్కరించాడు. చేతనా చూడటానికి పర్వాలేదనే స్థాయిలోనే ఉన్నా ఆమె తన పెర్ఫార్మెన్స్ తో ఆకట్టుకుంది. సెకండాఫ్లో ఆమె పలికించిన ఎమోషన్స్ ఆమెలో ఒక మంచి నటి ఉందని ప్రూవ్ చేశాయి.

మైనస్ పాయింట్స్ :

సినిమా అసలు కథలోకి వెళ్ళడానికి చాలా సమయం తీసుకుంది. మొదటి 15 నిముషాల కథ అయితే చూడ్డానికి ఏమీ ఉండదు. హీరో స్నేహితుల పాత్రల ద్వారా ట్రై చేసిన కామెడీ పండకపోగా సినిమా కథనానికి అడ్డుపడుతూ వచ్చింది. చాలా చోట్ల సినిమాను నడిపే విధానాన్ని సరిగా హ్యాండిల్ చెయ్యలేదనే స్పష్టమైన భావన పదే పదే కలిగింది.

సినిమా క్లైమాక్స్ కూడా సాగదీసినట్టు అనిపించింది. చివర్లో నాగబాబు ఎంట్రీ ఇవ్వడం, హీరోకి సహాయపడటం వంటి సన్నివేశాలు చాలా అసహజంగా ఉన్నాయి. ఇంటర్వెల్ తర్వాత ట్విస్ట్ విడిపోవడంతో ఆ తర్వాత వచ్చే సన్నివేశాలు చాలా వరకు ఊహాజనితంగా ఉండి సినిమాపై ఆసక్తి సన్నగిల్లేలా చేశాయి. అలాగే సరైన సహాయ నటులు లేకపోవడంతో సినిమాలో సీరియస్ నెస్ చాలా వరకు లోపించింది.

సాంకేతిక విభాగం :

సినిమా నిర్మాణ విలువలు బాగున్నాయి. కెమెరా వరకు కూడా బాగుంది. డైలాగులు ప్రస్తుత జనరేషన్ కు సంబంధించినవిగా ఉండి కాస్త ఎంటర్టైన్ చేశాయి. సినిమా స్క్రీన్ ప్లే అంత గొప్ప స్థాయిలో ఏం లేదు. చాలా సాదాసీదాగానే ఉంది.

సంగీతం బిలో యావరేజ్ అనే స్థాయిలోనే ఉంది. ఇక దర్శకుడు సాయి భూషణ్ విషయానికొస్తే ఆయన మంచి ప్లాట్ తీసుకున్నాడు కానీ దాన్ని చాలా చప్పగా నడిపాడు. ఎలా అంటే సినిమా ఆసక్తికరంగా ఉంది అనుకునే సమయంలో అవసరంలేని కామెడీ, యెటర్ సన్నివేశాలు, పాత్రలు వచ్చి ఆ భావాన్ని కాస్త చెడగొడతాయి.

తీర్పు :

మొత్తం మీద ఈ చిత్రం కాస్త మంచి ప్లాట్ ను కలిగి ఉన్నప్పటికీ అస్సలు ఆకట్టుకోని విధంగా దాన్ని తెరపై చూపడంతో నిరుత్సాహపరిచింది. ఆసక్తికరమైన ఇంటర్వెల్ బ్యాంగ్, చేతనా ఉత్తేజ్ యొక్క ఎమోషనల్ పెర్ఫార్మెన్స్ వంటి పాజిటివ్ అంశాలున్న ఈ సినిమాను ఏమాత్రం పరిచయంలేని ఇతర నటీనటులు, సినిమాను పూర్తిగా పక్కదారి పట్టించిన చిరాకుపెట్టే కామెడీ ట్రాక్ వంటి బలహీనతలు బిలో యావరేజ్ చిత్రంగా తయారుచేశాయి.

123telugu.com Rating : 2.5/5

Reviewed by 123telugu Team

Click here for English Review