సమీక్ష : రాజా చెయ్యి వేస్తే – కథ రొటీన్ అయిపోయింది!

సమీక్ష : రాజా చెయ్యి వేస్తే – కథ రొటీన్ అయిపోయింది!

Published on Apr 29, 2016 10:40 PM IST
Raja Cheyyi Vesthe review

విడుదల తేదీ : ఏప్రిల్ 29, 2016

123తెలుగు.కామ్ రేటింగ్ : 2.75/5

దర్శకత్వం : ప్రదీప్ చిలుకూరి

నిర్మాత : సాయి కొర్రపాటి

సంగీతం : సాయి కార్తీక్

నటీనటులు :నారా రోహిత్, తారకరత్న, ఇషా తల్వార్, అవసరాల శ్రీనివాస్


విలక్షణ సినిమాలను ఎంపిక చేసుకుంటూ ప్రస్తుతం తెలుగులో ఏ హీరో కూడా లేనంత బిజీగా ఉన్న నారా రోహిత్, రెండు నెలల కాలంలోనే మూడు సినిమాలను ప్రేక్షకులకు ముందుకు తెచ్చేశారు. ఈ సినిమాల్లో ఒకటైన ‘రాజా చెయ్యి వేస్తే’ నేడు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. నందమూరి తారకరత్న విలన్‌గా నటించిన ఈ సినిమా ట్రైలర్‌తోనే మంచి అంచనాలు రేకెత్తించింది. మరి సినిమా ఆ అంచనాలను అందుకునే స్థాయిలోనే ఉందా? చూద్దాం..

కథ :

విజయ్ మాణిక్ (తారకరత్న).. ఎంత పెద్ద హత్య చేసినా, ఏ నేరం చేసినా ఎవరికీ సాక్ష్యం కూడా దొరకనీయకుండా చేస్తూ పోయే ఓ బడా క్రిమినల్. పోలీస్ వ్యవస్థకు కూడా ఈ విషయం తెలిసినా, అతడిని ఏమీ చేయలేకపోతుంది. అలాంటి ఒక క్రిమినల్‌ను రాజా రామ్ (నారా రోహిత్) అనే దర్శకుడవ్వాలని కలలుగనే ఓ యువకుడు అంతమొందించాల్సి వస్తుంది.

తనకు ఏమాత్రం సంబంధం లేని మాణిక్‌ను, రాజా చంపాల్సిన పరిస్థితి ఎందుకు వస్తుంది? రాజాకి, మాణిక్‌కు ఉన్న సంబంధం ఏంటి? రాజా ఎంతగానో ఇష్టపడే అమ్మాయి చైత్ర (ఇషా తల్వార్)కి, మాణిక్‌కు ఏదైనా సంబంధం ఉంటుందా? వ్యవస్థకే అందని మాణిక్‌ను, రాజా ఎలా అంతమొందించాడు? లాంటి ప్రశ్నలన్నింటికీ సమాధానమే ఈ సినిమా.

ప్లస్ పాయింట్స్ :

ఈ సినిమాకు అన్నింటికంటే ప్రధానమైన ప్లస్ పాయింట్ అంటే విలన్ క్యారెక్టరైజేషన్ అనే చెప్పుకోవాలి. ‘విలన్ ఎంత సక్సెస్‌ఫుల్ అయితే, సినిమా అంత సక్సెస్‌ఫుల్ అవుతుంది’ అన్న ప్రఖ్యాత దర్శకుడు ఆల్ఫ్రెడ్ హిచ్‌కాక్ మాటతో మొదలయ్యే ఈ సినిమాలో ఈ అంశాన్నే బాగా నమ్ముకున్నట్టు కనిపిస్తుంది. విలన్ పాత్రను రూపొందించిన విధానం వల్ల సినిమాకు కాస్త కొత్తదనం వచ్చింది. ఇక ఆ పాత్రలో నటించిన తారకరత్న కూడా సినిమాకు ఓ హైలైట్‌గా నిలిచారు. స్టైలిష్‌గా కనిపిస్తూ, వయలంట్‌గా ప్రవర్తిస్తూ తారకరత్న ఆ పాత్రను బాగా చేశాడు. ఇక సినీ దర్శకుడవ్వాలనుకునే యువకుడిగా నారా రోహిత్ బాగా చేశాడు. పెద్దగా హీరోయిజం జోలికి పోకుండా, తన పాత్ర పరిధిమేరకే ఉండే సన్నివేశాలతో సాగే సినిమాలో నారా రోహిత్ బాగా నటించాడు. ఇషా తల్వార్ పాత్రకు సినిమాలో మంచి ప్రాధాన్యత ఉంది. ఆ పాత్రలో ఆమె బాగానే నటించింది. ఇక అవసరాల శ్రీనివాస్ ఉన్న కొద్దిసేపు బాగా నటించాడు.

సినిమా పరంగా చూస్తే.. హీరో, విలన్‌ల ఇంట్రడక్షన్ సన్నివేశాలు చాలా బాగున్నాయి. ఆ రెండు సన్నివేశాలతో వీరిద్దరి ఆలోచనలు ఎలా ఉంటాయో చెప్పడం బాగా ఆకట్టుకుంది. ఇక ఇంటర్వెల్‌ ట్విస్ట్ సినిమాకే మేజర్ హైలైట్‌గా చెప్పుకోవచ్చు. అప్పటివరకూ హీరోకూ, విలన్‌కు కనెక్షన్ ఎలా ఉంటుందా అనుకునే సమయానికి కథలో వచ్చే ట్విస్ట్‌గా ఇంటర్వెల్ బ్యాంగ్ కట్టిపడేస్తుంది. ఇక సెకండాఫ్‌లో వచ్చే మరో రెండు, మూడు ట్విస్ట్‌లు కూడా బాగా ఆకట్టుకుంటాయి. చివర్లో హీరో-విలన్‌ల మధ్యన వచ్చే మైండ్ గేమ్ బాగుంది.

మైనస్ పాయింట్స్ :

ఈ సినిమాకు ప్రధాన కథలో పెద్దగా కొత్తదనమంటూ లేకపోవడమే మేజర్ మైనస్ పాయింట్‌గా చెప్పుకోవాలి. ప్రధాన కథ చుట్టూ ఉన్న పగ అన్న ఆలోచన కూడా ఏమాత్రం ఆకట్టుకునేలా లేదు. ఇక ఉన్నంతలో సినిమాలో కొత్తదనమైన హీరో-విలన్‍ల గేమ్, హీరోకి విలన్‌‍ని చంపాల్సిన పరిస్థితులు ఎదురవ్వడం.. ఇవన్నీ సెకండాఫ్‌లో గానీ మొదలవ్వవు. ఈలోపులో ఫస్టాఫ్‍లో వచ్చే లవ్‍ట్రాక్ పెద్దగా ఆకట్టుకోలేదు. ముఖ్యంగా సినిమాలో పాటలు ఎందుకొస్తాయో కూడా అర్థం కానట్టు ఉన్నాయి.

కథకి అసలైన పాయింట్‌ని రివెంజ్‌కు కలపడనే తెలుగు సినిమా ఫార్ములా ఎప్పుడైతే కథలో ప్రవేశిస్తుందో, అక్కణ్ణుంచి ఒక్క ట్విస్ట్ మినహా సినిమా అంతా హీరో ప్లాన్ ప్రకారంగానే సాగిపోతూ పెద్దగా కిక్ ఇవ్వదు. సినిమా పరంగా చూస్తే ఫస్టాఫ్‌ ప్రధానమైన మైనస్‍గా నిలుస్తుంది. ఈ టైమ్‌లో కావాలని ఇరికించిన కామెడీ సన్నివేశాలు నవ్వు తెప్పించకపోగా, సినిమా ఫ్లోను దెబ్బతీశాయి. ఇక ఇలాంటి సింగిల్ పాయింట్ మైండ్ గేమ్ కథకు రెండు గంటలకు పైనే ఉన్న నిడివి కూడా ఎక్కువైనట్లు కనిపించి అక్కడక్కడా బోర్ అనిపిస్తుంది.

సాంకేతిక విభాగం :

సాంకేతిక అంశాల పరంగా చూస్తే ముందు ఈ సినిమాతో దర్శకుడిగా పరిచయమైన ప్రదీప్ గురించి చెప్పుకోవాలి. రొటీన్ కథలతోనే స్క్రీన్‌ప్లే మ్యాజిక్ చేస్తే ప్రేక్షకుడిని కూర్చోబెట్టొచ్చనే అంశాన్ని దర్శకుడు బలంగా నమ్మినట్లు కనిపిస్తుంది. అయితే ఆ స్క్రీన్‌ప్లే విషయంలో తాను చెప్పాలనుకున్న పాయింట్‌కు బలమైన ఎమోషన్‌ను జోడించకపోగా, అనవసరమైన ట్రాక్స్ జతచేసి రచయితగా కేవలం ఫర్వాలేదనిపించుకున్నాడు. డైలాగ్స్ చాలా బాగున్నాయి. ఇక దర్శకుడిగా అక్కడక్కడా ప్రదీప్ ప్రతిభను చూడొచ్చు. విలన్ పాత్ర రూపొందించిన విధానం, హీరో, విలన్‍ల ఇంట్రడక్షన్.. ఇలా కొన్ని సందర్భాల్లో దర్శకుడి ప్రతిభ బాగుంది.

సినిమాటోగ్రఫీ పనితనం బాగుంది. ముఖ్యంగా లైటింగ్ పరంగా తీసుకున్న జాగ్రత్తలతో సినిమాటోగ్రఫీలో అక్కడక్కడా ప్రయోగాలు చూడొచ్చు. సాయి కార్తీక్ అందించిన ఆడియోలో చెప్పుకోవడానికి ఏమీ లేదు. బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ మాత్రం బాగుంది. ఇక ఎడిటింగ్‌ పెద్దగా ఆకట్టుకునేలా లేదు. ట్రాన్సిషన్ ఎఫెక్ట్స్ అస్సలు బాగాలేవు. వారాహి చలన చిత్రం ప్రొడక్షన్ వ్యాల్యూస్ చాలా బాగున్నాయి.

తీర్పు :

‘రాజా చెయ్యి వేస్తే’.. రొటీన్ కథకే కొత్తదనం తీసుకొచ్చి చెప్తే ఆకట్టుకుంటుందన్న పాయింట్‌ను నమ్మి ప్రేక్షకుల ముందుకు వచ్చిన సినిమా. అయితే ఆ కొత్తదనం అనుకున్నంత స్థాయిలో లేకపోవడమే ఈ సినిమాకు ప్రధాన మైనస్ పాయింట్. దీంతో పాటు ఫార్ములా కథల్లో ఉండే రివెంజ్ డ్రామా, పెద్దగా ఆకట్టుకోని లవ్‍ట్రాక్, ఫస్టాఫ్ వరకూ అసలు కథంటూ మొదలవ్వకపోవడం ఈ సినిమాకు ఇతర మైనస్ పాయింట్స్. ఇకపోతే కట్టిపడేసే విలన్ క్యారెక్టరైజేషన్; నారా రోహిత్, తారకరత్నల నటన; సెకండాఫ్‌లో వచ్చే కొన్ని ట్విస్ట్స్, వీటన్నింటికీ మించి ఫస్టాఫ్‌లో బాగా ఆకట్టుకునే ఇంటర్వెల్ బ్యాంగ్ లాంటివి ఈ సినిమాకు ప్లస్ పాయింట్స్‌గా చెప్పుకోవచ్చు. ఒక్కమాటలో చెప్పాలంటే.. ‘రాజా చెయ్యి వేస్తే’ లాంటి ఆలోచనను సినిమాగా తీయడానికి ఏ కొత్తదనమైతే అవసరమో అదే కొత్తదనం కరువైన ఈ సినిమాను రొటీన్ కథగానే అనుకొని చూస్తే ఫర్వాలేదనిపిస్తాడు.

123telugu.com Rating : 2.75/5
Reviewed by 123telugu Team

Click here for English Review

సంబంధిత సమాచారం

తాజా వార్తలు