సమీక్ష : యాక్షన్ 3డి – ఆకట్టుకునే 3డి ఎఫెక్ట్స్ విత్ కామెడీ…

సమీక్ష : యాక్షన్ 3డి – ఆకట్టుకునే 3డి ఎఫెక్ట్స్ విత్ కామెడీ…

Published on Jun 21, 2013 3:00 PM IST
Action-3D-Latest-Poster-HD- విడుదల తేదీ : 21 జూన్ 2013
దర్శకుడు : అనిల్ సుంకర 
నిర్మాత : రామ్ బ్రహ్మం సుంకర
సంగీతం : బప్పి – బప్పా లహరి
నటీనటులు : అల్లరి నరేష్, వైభవ్, నీలం ఉపాధ్యాయ్, స్నేహ ఉల్లాల్…

కామెడీ కింగ్ అల్లరి నరేష్ హీరోగా, అనిల్ సుంకర దర్శక నిర్మాతగా ఇండియాలోనే మొట్ట మొదటి సారిగా తెరకెక్కించిన కామెడీ 3డి మూవీ ‘ యాక్షన్ 3డి’. ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమా రేపు ప్రేక్షకుల ముందుకు రానుంది. కానీ ప్రత్యేకంగా ఈ రోజు వేసిన ప్రీమియర్ షో సందర్భంగా మేము ఈ సినిమాని తిలకించాము. ఈ సినిమాలోఅల్లరి నరేష్ తో పాటు కిక్ శ్యాం, వైభవ్, రాజు సుందరం హీరోలుగా నటించగా ఈ సినిమాలో నీలం ఉపాధ్యాయ్, స్నేహ ఉల్లాల్, కామ్న జఠ్మలాని, షీన హీరోయిన్స్ గా నటించారు. చాలా రోజుల తర్వాత తెలుగులో బప్పి లహరి – బప్పా లహరి ఈ సినిమాకి సంగీతం అందించారు. డైరెక్టర్ అనిల్ సుంకర చెప్పినట్టు ఈ సినిమా తెలుగు ప్రేక్షకుల్ని సరికొత్త అనుభూతికి లోను చేసిందో లేదో, 3డిలో అల్లరోడు అతని గ్యాంగ్ తో ఎంతవరకూ నవ్వించాడో ఇప్పుడు చూద్దాం..

కథ :

బావ అలియాస్ బాల వర్ధన్(అల్లరి నరేష్), పురుష్ అలియాస్ పురుషోత్తం(రాజు సుందరం), శివ(వైభవ్), అజయ్(కిక్ శ్యాం)లు నలుగురూ చిన్ననాటి నుండి ప్రాణ స్నేహితులు. ఈ నలుగురిలో బావ బ్యాచిలర్, పురుష్ కి అనితతో(కామ్న జఠ్మలాని)తో పెళ్లై ఉంటుంది, శివ సంధ్య(రీతు బర్మేచ)తో ప్రేమలో ఉంటాడు, చివరిగా అజయ్ శృతి(షీన)తో ప్రేమలో ఉంటాడు. అజయ్ – శృతిల ప్రేమకి పెద్దవాళ్ళు ఒప్పుకోవడంతో వారి పెళ్ళికి ముహూర్తం పెడతారు. అప్పుడు ఈ నలుగురు ఫ్రెండ్స్ కొద్ది రోజులు గోవా వెళ్లి బాగా ఎంజాయ్ చెయ్యాలనుకుంటారు. అనుకున్నట్టుగానే హైదరాబాద్ నుండి గోవాకి కారులో బయలుదేరుతారు. మార్గ మధ్యంలో అనుకోకుండా వీరికి గీత(నీలం ఉపాధ్యాయ్) తారసపడుతుంది. తొలి చూపులోనే గీతలో బావ ప్రేమలో పడతాడు. కానీ తన మెంటాలిటీ నచ్చకపోవడంతో గీత మధ్య లోనే బావకి దూరంగా వెళ్ళిపోతుంది.

గీత మళ్ళీ వస్తుందన్న నమ్మకంతో అక్కడి నుండి వాళ్ళు గోవా చేరుకుంటారు. అజయ్ పెళ్లి తర్వాత మన జీవితాలు ఎలా ఉంటాయో తెలియదు కాబట్టి ఆ రోజు రాత్రి ఫుల్ గా ఎంజాయ్ చెయ్యాలనుకుంటారు. ఫుల్ గా మందు తాగుతారు. అప్పుడే కథలో ట్విస్ట్.. పొద్దున్న లేచే సరికి వారి లైఫ్ లో అనుకోని సంఘటనలు జరగడం మొదలు పెడతాయి. వారి లైఫ్ లోకి సమీర(స్నేహ ఉల్లాల్), సుదీప్ మరికొందరు ఎవరెవరో వారికి ఇబ్బందులు క్రియేట్ చేస్తుంటారు. ఇంతకీ వీళ్ళంతా ఎవరు? ఆ రోజు రాత్రి మందు తాగిన తర్వాత ఏం జరిగింది? సమీర ఎలా వీరి లైఫ్ లోకి వచ్చింది? ఈ ఇబ్బందులన్నిటినీ వారు దాటుకొని చివరికి అజయ్ పెళ్లి టైంకి హైదరాబాద్ చేరుకున్నారా? లేదా అనే ఆసక్తికరమైన మలుపుల్ని మీరు తెరపైనే చూడాలి.

ప్లస్ పాయింట్స్ :

సినిమా కోసం చేసిన 3డి ఎఫ్ఫెక్ట్స్ చాలా సూపర్బ్ గా ఉన్నాయి. ముఖ్యంగా పాటల్లో ఎఫెక్ట్స్ చాలా బాగున్నాయి. సినిమాలోని ప్రతి పాటని చాలా గ్రాండ్ విజువల్స్ తో షూట్ చేసారు, అవి 3డి ఎఫ్ఫెక్ట్స్ లో చూడటానికి చాలా బాగున్నాయి. 3డి విషయంలో ప్రేక్షకులు కచ్చితంగా కొత్త అనుభూతికి లోనవుతారు ఈ విషయంలో ఈ చిత్ర టీంని అభినందించి తీరాల్సిందే.

సినిమాకి మెయిన్ హీరో అల్లరి నరేష్ ఎప్పటి తన నటనతో బాగా నవ్వించాడు. కానీ ఈ సారి 3డి ఎఫెక్ట్స్ లో నవ్వించాడు. చింపాంజీ తో చేసే సీన్స్ లో బాగా నవ్వించాడు. ఊలాల పాటలో సీనియర్ హీరోల మాదిరిగా డాన్సులు వేసి మెప్పించాడు. రాజు సుందరం నటన ఈ సినిమాకి ప్రధాన హైలైట్ గా చెప్పుకోవచ్చు. మొదటి నుండి చివరి వరకూ ఆయన పాత్ర ప్రేక్షకుల్ని నవ్విస్తూ ఉంటుంది. ముఖ్యంగా పోలీస్ ట్రైనింగ్ క్యాంప్ లో పిల్లాడితో చేసే కామెడీ బాగుంది. వైభవ్ లవర్ కి భయపడుతూ, తన లైఫ్ లో తనకి తెలియకుండా జరిగిపోయిన కొన్ని సంఘటనలకి బాధపడే వాడిలా, అక్కడక్కడా కాస్త కామెడీతో బాగానే నవ్వించాడు. అలాగే తనకు ఇచ్చిన పాత్రకి పూర్తి న్యాయం చేసాడు. కిక్ శ్యాం పెద్దగా చేయడానికి ఏమీ లేకపోయినా ఉన్నంతవరకూ ఓకే.

నీలం ఉపాధ్యాయ్ ఉన్న సీన్స్ తక్కువే అయినప్పటికీ ఉన్న సీన్స్ లో నటన బాగుంది, నటన కన్నా గ్లామరస్ తో బాగా ఆకట్టుకుంది ముఖ్యంగా ‘ఊలాల్లా’, స్వాతి ముత్యపు జల్లులలో’ పాటలలో బాగా గ్లామరస్ గా కనిపించింది. స్నేహ ఉల్లాల్ మరోసారి తన గ్లామర్ తో ఆడియన్స్ ని బాగా ఆకట్టుకుంది. ముఖ్యంగా ‘ డింగ్ డాంగ్ బెల్’ పాటలో స్టెప్పులతో గ్లామర్ తో మత్తెక్కించింది. అలాగే తన పాత్రకి న్యాయం చేసింది. షీన, రీతు బర్మేచ, కామ్న జఠ్మలానీలు ఓకే. అతిధి పాత్రలో కనిపించిన సుధీప్ మరో సారి తన నటనతో ఆకట్టుకున్నాడు, అందరూ ఆయన పాత్ర ఇంకాసేపు ఉండుంటే బాగుండేది అనుకుంటారు. ‘దూకుడు’ సినిమాలో బాగా ఫేమస్ అయిన ఎంఎస్ నారాయణ కామెడీ స్పూఫ్ ని ఈ సినిమాలో కంటిన్యూ చేసారు. ఆ ఎపిసోడ్స్ బాగా నవ్విస్తాయి. అతిధి పాత్రల్లో కనిపించిన సునీల్, పోసాని కూడా తమ వంతుగా కాస్త నవ్వించడానికి ప్రయత్నించారు.

మైనస్ పాయింట్స్ :

సినిమాని ఆసక్తికరంగా మొదలు పెట్టినా ఓ 20 నిమిషాల తర్వాత అదే స్పీడు తగ్గిపోవడం, ఆసక్తి కరంగా ముందుకు సాగకపోవడమే కాకుండా కాస్త సాగదీసినట్టు అనిపిస్తుంది. ఇంటర్వెల్ దగ్గర కాస్త ఊపందుకున్న స్టొరీ అదే ఫ్లోతో ట్విస్ట్ లతో సెకండాఫ్ బాగానే సాగినా క్లైమాక్స్ కి వచ్చేసరికి ఆ ఫ్లో కాస్త తగ్గినట్టు అనిపిస్తుంది. హాలీవుడ్ లో వచ్చిన ‘హాంగ్ ఓవర్’ సినిమాని స్పూర్తిగా తీసుకొని చేయడం వల్ల ఇప్పటికే ‘హాంగ్ ఓవర్’ సినిమా చూసిన వారికి నచ్చదు. సినిమాలో కొన్ని చోట్ల కాస్త ఎబ్బెట్టుగా అనిపించే సీన్స్ ఉన్నాయి వాటిని కత్తిరిస్తే బాగుంటుంది.

నరేష్ – నీలం ఉపాధ్యాయ్ మధ్య రొమాంటిక్ ట్రాక్ ఇంకాస్త బాగా బెటర్ గా ఉంటే బాగుండేది. సినిమాలో వచ్చే కొన్ని కామెడీ సీన్స్ కూడా చాలా అవుట్ డేటెడ్ గా అనిపిస్తాయి. అవి ఆడియన్స్ కి నవ్వు తెప్పించకపోగా చిరాకు తెప్పించే వకాశం ఉంది.

సాంకేతిక విభాగం :

టెక్నికల్ విభాగంలో ముందుగా చెప్పుకోవాల్సింది 3డి టీం చేసిన పని తీరు గురించి చెప్పుకోవాలి. ఈ సినిమాకి 3డి ఎఫ్ఫెక్ట్స్ మెయిన్ హైలైట్. చాలా వరకూ సినిమాని నిలబెట్టాయి. ఈ విషయంలో క్రెడిట్ మొత్తం డైరెక్టర్ అనుకున్న దాన్ని పర్ఫెక్ట్ గా కెమెరాలో బందించిన సినిమాటోగ్రాఫర్ కి, వాటికి పర్ఫెక్ట్ గా 3డి మెరుగులు దిద్దిన స్టీరియో గ్రాఫర్ కే చెందుతుంది. ఎడిటింగ్ ఇంకాస్త బెటర్ గా ఉండాల్సింది. కొన్ని బోరింగ్ సీన్స్ ని కత్తిరించి పారేసి ఉంటే బాగుండేది. పాటలు బాగున్నాయి, అలాగే సన్నీ అందించిన బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ సినిమాకి బాగా కుదిరింది. బ్యాక్ గ్రౌండ్లో మధ్య మధ్యలో వాడుకున్న కొన్ని హిట్ సాంగ్స్ బాగున్నాయి.

డైలాగ్స్ బాగున్నాయి కానీ కొన్ని సీన్స్ లో మాత్రం బాగోలేవు. విజువల్స్ విషయంలో, టెక్నికల్ విభాగాల్లో, నటీనటుల నుండి నటనను రాబట్టుకోవడంలో దర్శకుడిగా అనిల్ సుంకర మంచి మార్కులే సంపాదించుకున్నాడు. అలాగే మొదటి అర్ధ భాగంలో స్క్రీన్ ప్లే పెద్దగా లేకపోయినా సెకండాఫ్ లో మాత్రం బాగా రాసుకున్నాడు. సీన్స్ ని ఇంకాస్త బెటర్ గా రాసుకొని ఉండాల్సింది. నిర్మాణ విలువలు మాత్రం బాగా రిచ్ గా ఉన్నాయి.

తీర్పు :

‘యాక్షన్ 3డి’ సినిమా మీకు 3డి ఎఫ్ఫెక్ట్స్ లో ఓ కొత్త అనుభూతిని కలిగిస్తుంది. ఈ సినిమాలోని అద్భుతమైన విజువల్స్, కొన్ని మంచి సీన్స్ బాగా ఆకట్టుకుంటాయి. అల్లరి నరేష్, రాజు సుందరంల కామెడీ, స్నేహా ఉల్లాల్, నీలం ఉపాధ్యాయ్ ల గ్లామర్, ఆకట్టుకునే పాటలు ఈ సినిమాకి మెయిన్ హైలైట్స్ అయితే కాస్త వీక్ స్క్రీన్ ప్లే, బోర్ కొట్టించే కొన్ని సీన్స్ చెప్పదగిన మైనస్ పాయింట్స్. తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలో మొట్ట మొదటి సారి ఎంతో కష్టపడి 3డిలో తెరకెక్కించిన వారి గట్స్ కి మెచ్చుకొని మరీ ఈ సినిమాని చూడొచ్చు.

123తెలుగు.కామ్ రేటింగ్ : ‘యాక్షన్ 3డి’ సినిమాకి మేము అఫీషియల్ మీడియా పార్టనర్ గా ఉన్నాము. మేము ప్రమోట్ చేసిన చిత్రానికి రేటింగ్ ఇవ్వడం సబబు కాదు. అందువల్ల ఈ చిత్రానికి మేము రేటింగ్ ఇవ్వడం లేదు. మా సమీక్ష చదవండి, మీరే స్వయంగా థియేటర్ కి వెళ్లి అల్లరోడి కామెడీని 3డిలో ఎంజాయ్ చెయ్యండి..

రాఘవ

CLICK HERE FOR ENGLISH REVIEW

సంబంధిత సమాచారం

తాజా వార్తలు