![]() |
విడుదల తేదీ : 30 మే 2014 | |
| 123తెలుగు. కామ్ రేటింగ్ : 1.5/5 | ||
| దర్శకత్వం : మద్దినేని రమేష్ |
||
| నిర్మాత : మద్దినేని రమేష్ | ||
| సంగీతం : విజయ్ బాలాజీ |
||
| నటీనటులు : పోసాని కృష్ణ మురళి, స్నేహ ఎం |
2010లో విడుదల అయిన బ్రోకర్ సినిమాకు సీక్వెల్ గా విడుదల అవుతున్న సినిమా ఈ బ్రోకర్ 2. ఈ పొలిటికల్ డ్రామాను స్వీయ దర్శకత్వంలో తెరకెక్కించారు నిర్మాత మద్దినేని రమేష్. పోసాని కృష్ణ మురళి, స్నేహ ప్రధాన పాత్రలలో నటించిన ఈ సినిమా ఈరోజు విడుదల అయింది. ఈ సినిమా ఎలా ఉందో ఇప్పుడు చూద్దాం.
కథ:
దేవుడు (పోసాని కృష్ణ మురళి) ఒక బ్రోకర్, రాజకీయ నాయకులకు వారి సహాయం కోసం వచ్చే ప్రజల మధ్య ఉండి, డబ్బు తీసుకొని వారికి పనులు చేస్తూ ఉంటాడు. సుభాష్ చంద్ర బోస్ (బెనర్జీ)ని ముఖ్యమంత్రి కూర్చి ఎక్కించి, అతని సహాయకుడిగా ఉండి పోతాడు.
కస్తూరి (స్నేహ) ఉద్యోగం వేటలో నగరానికి వస్తుంది. అయితే ఆమెకి ఉద్యోగం ఇస్తామని నమ్మించి నలుగురు యువకులు అత్యాచారం చేస్తారు. అయితే ఈ సంఘటన తరువాత కస్తూరి దేవుడికి దగ్గర అవుతుంది. వారిద్దరికి ఎంగేజ్మెంట్ కూడా అవుతుంది. కానీ అనుకోని పరిణామాల వల్ల కస్తూరి ఒక హై ప్రొఫైల్ వ్యభిచారిగా మారుతుంది.
కస్తూరి వ్యభిచారిగా ఎందుకు మారాల్సి వచ్చింది? ఆ తరువాత దేవుడు ఎం చేస్తాడు? ఈ ప్రశ్నలకు జవాబు దొరకాలంటే సినిమా చూడాల్సిందే….
ప్లస్ పాయింట్స్:
తనదైన శైలిలో పోసాని కృష్ణ మురళి మంచి నటనను కనబరిచారు. పెద్ద పెద్ద డైలుగులను కూడా తనదైన వెరైటీ స్టైల్ లో పలికించారు. యువ నటి స్నేహ కూడా తన నటనతో అకట్టుకుంది. ఎమోషనల్ సీన్స్ లో మంచి నటన కనబరిచింది. బెనర్జీ, జీవా వంటి సీనియర్ నటులు కూడా మంచి పెర్ఫార్మన్స్ ఇచ్చారు.
ప్రస్తుత రాజకీయాలు, ఒక వ్యాపారంలా మారాయనే స్టొరీ లైన్ బాగుంది.
మైనస్ పాయింట్స్:
ఈ సినిమా ఫస్ట్ ఫ్రేమ్ నుండి ప్రతి సీన్ అవసరానికంటే అధిక మోతాదులో ఉంటుంది. దర్శకుడు ఒక కథ రాసుకున్నాడు, కానీ దాని ప్రెజెంట్ చేయడంలో పూర్తిగా విఫలమయ్యాడు. అత్యాచారాలు, భూ కబ్జాలు, లంచం, ఇలా సమాజంలోని వివిధ దుశ్చర్యలను తీసుకొని రెండు గంటల సినిమాగా రూపొందిద్దాం అనుకున్నాడు దర్శకుడు. కానీ అది అమలు చేయడంలో విఫలమయి క్రైమ్ స్టోరీస్ తో వచ్చే వార్తలుగా ఈ సినిమా తెరకెక్కింది.
ఈ సినిమాలో చాలా అనవసరమైన సన్నివేశాలు ఉంటాయి. ప్రతి సీన్ ను ప్రేక్షకుడికి తలనొప్పి వచ్చేలా లాగారు. అయితే ఇలాంటి సినిమాలలో అసలు పాటలే అవసరం లేదు, కానీ మధ్య మధ్యలో పాటలు పెట్టి ఈ సినిమాను మరింత సాగదీసారు. అసలు ఆ పాటలు ఎందుకు వస్తాయో కూడా తెలీదు. ఇంటర్వెల్ బ్యాంగ్ కూడా చాలా సాధారణంగా ఉంటుంది. డైలాగులు కూడా సాగదీసినట్టుగా ఉంటాయి.
ఇక ఈ సినిమా క్లైమాక్స్ కి వస్తే, సినిమా అంత ఒకెత్తయితే క్లైమాక్స్ మరో ఎత్తు, అందరికి తెలిసిన క్లైమాక్స్ అయినప్పటికీ, కనీసం 10 నుండి 15 నిముషాలు ఉంటుంది.
సాంకేతిక విభాగం :
సాంకేతిక విభాగంలో కూడా పెద్దగా చెప్పుకోదగినవి ఏమీ లేవు. విజయ్ బాలాజీ సమకూర్చిన సంగీతం పర్వాలేదు అనేలా ఉన్నప్పటికీ, బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ మాత్రం బాలేదు. సినిమాటోగ్రఫి కూడా ఏదో పర్వాలేదు అనిపించేలా ఉంది. ఎడిటర్ మాత్రం ఈ సినిమాపై అసలు శ్రద్ద పెట్టనట్టుగా కనిపిస్తుంది. ఈ సినిమాలో చాలా అనవసరమైన సన్నివేశాలు ఉన్నప్పటికీ, వాటిని కట్ చేయలేదు.
తన దర్శకత్వ ప్రతిభను చూపిద్దాం అనుకున్న నిర్మాత మద్దినేని రమేష్ మాత్రం పూర్తిగా విఫలమయ్యారు. ప్రస్తుత రాజకీయాలను సూచించే మంచి స్టొరీ లైన్ ఉన్నప్పటికీ దానిని ప్రెజెంట్ చేయడంలో బోల్తా పడ్డాడు.
తీర్పు:
2010లో విడుదల అయిన బ్రోకర్ సినిమా విమర్శకుల ప్రశంసలు పొందినప్పటికీ, బ్రోకర్ 2లో మాత్రం చెప్పుకోడానికి ఏమి లేదు. ఈ సినిమాలో అధిక బాగం వ్యభిచారం చుట్టూ తీరుగుతూ ఒక సి గ్రేడ్ సినిమాలా ఉంటుంది. టీవిలో వచ్చినప్పుడు కూడా ఈ సినిమాకి దూరంగా ఉంటె మంచిది.
123తెలుగు.కామ్ రేటింగ్ : 1.5/5
123తెలుగు టీం
