సమీక్ష 1 : తెలుగు సినిమా ఖ్యాతిని పెంచే “ఈగ”

సమీక్ష 1 : తెలుగు సినిమా ఖ్యాతిని పెంచే “ఈగ”

Published on Jul 7, 2012 3:45 AM IST
విడుదల తేది : 06 జూలై 2012
123తెలుగు.కాం రేటింగ్: 4/5
దర్శకుడు : ఎస్.ఎస్. రాజమౌళి
నిర్మాత : సురేష్ బాబు
సంగీత దర్శకుడు: ఎమ్.ఎమ్. కీరవాణి
తారాగణం : నాని, సమంత, సుదీప్

ఈ చిత్ర సమీక్ష ప్రారంబించడానికి ముందు ఈ చిత్రం తీసిన రాజమౌళి గారికి సెల్యూట్ చేస్తున్నాను. ఎందుకంటే ఈ చిత్రం తెలుగు సినిమా యొక్క కీర్తిని దశదిశలా వ్యాపింపజేస్తుంది అలాగే ‘ఈగ’ చిత్రం తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ గర్వించ దగ్గ చిత్రంగా చరిత్రలో నిలిచిపోతుంది.

ఎస్.ఎస్ రాజమౌళి ప్రతిష్టాత్మకంగా తెరకెక్కించిన ‘ఈగ’ చిత్రం ఈ రోజు ప్రపంచ వ్యాప్తంగా భారీ ఎత్తున విడుదలయింది. ఎం.ఎం కీరవాణి సంగీతం అందించిన ఈ చిత్రంలో సుదీప్, నాని మరియు సమంతాలు ప్రధాన పాత్రలలో నటించారు. ఇప్పుడు ఈ చిత్రం ఎలా ఉందో చూద్దాం…..

కథ :

బిందు(సమంత) వాళ్ళ ఎదురింటిలో నివసిస్తూ ఉంటాడు నాని(నాని), అంతేకాకుండా రెండు సంవత్సరాల నుంచి నాని బిందుని ప్రేమిస్తూ ఉంటాడు. బిందు సమాజానికి మంచి చేయాలనే ఉద్దేశంతో ఎన్జీవో అనే సోషల్ వర్కింగ్ సంస్థని నడుపుతూ అందులో తను కూడా ఒక సోషల్ వర్కర్ గా పనిచేస్తూ ఉంటుంది. బిందు కూడా నానిని ప్రేమిస్తుంది కానీ చెప్పకుండా తనే తెలుసుకోవాలని తన చుట్టూ తిప్పుకుంటూ ఉంటుంది. ఇంతలో బిందు నడిపే ఎన్జీవో సంస్థకి సహాయం చేసే గొప్ప ధనికుని పాత్రలో పరిచయమైన సుదీప్(సుదీప్) బిందుని ఇష్టపడతాడు.

సుదీప్ చాలా క్రూరమైన స్వభావం కలవాడు, తన అవసరానికి ఇతరులను చంపడానికి కూడా వెనుకాడడు. నాని బిందుని ప్రేమిస్తున్నాడని సుదీప్ కి తెలియగానే నానిని అతి కిరాతకంగా చంపేస్తాడు. చనిపోయిన నానినే మళ్ళీ ఈగగా పుడతాడు. అలా జన్మించిన ఈగ తనే నాని అని బిందుకి ఎలా తెలియజేసింది మరియు తనను చంపిన సుదీప్ మీద ఎలా పగ తీర్చుకుందనేదే మిగిలిన చిత్రం.

ప్లస్ పాయింట్స్ :

ఈ చిత్రంలో సుదీప్ అద్భుతమైన నటనతో ప్రేక్షకులను అమితంగా ఆకట్టుకొన్నారు. తెరపై అతను పండించన విలనిజం మరియు అతను తెరపై కనిపించే విధానం అందర్నీ సంభ్రమాశ్చర్యాలకు గురిచేస్తుంది. సుదీప్ నటన ఈ చిత్రానికి హైలైట్ అనడంలో ఏ మాత్రం అతిశయోక్తి లేదు.

ఈ చిత్రంలో సమంత మంచి నటనను కనబరిచారు మరియు చాలా అందంగా ఉన్నారు. ఈగ తనే నాని అని సమంతకు పరిచయం చేసుకునే సన్నివేశాలలో సమంత హృదయాన్ని హత్తుకునేలా నటించారు.

నానిది చిన్న పాత్రే అయినప్పటికీ తన హాస్య ప్రదమైన మరియు మంచి నటనతో ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. డైలాగులను చెప్పడంలో నాని మంచి టైమింగ్ తో ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. శ్రీనివాస్ రెడ్డి మరియు తాగుబోతు రమేష్ లు తమ నటనతో ప్రేక్షకులను బాగా నవ్వించారు.

ఈ చిత్రానికి ఎస్.ఎస్ రాజమౌళి గారు అందించిన కథనం మరియు దర్శకత్వం గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి. ఈ కథని చాలా కూల్ గా మొదలు పెట్టి విరామం సమయానికి చిత్రాన్ని ఓ రేంజ్ కి తీసుకెళ్ళిపోయారు. ఈ చిత్రంలో ప్రేక్షకుడికి కావాల్సిన కామెడీ మరియు మంచి డ్రామా ఉండడంతో ప్రేక్షకులు కథలో లీనమైపోతారు. తెలుగు చలన చిత్ర రంగంలో ఇప్పటి వరకూ చూడని విధంగా ఈ చిత్రం యొక్క స్పెషల్ ఎఫ్ఫెక్ట్స్ ఉన్నాయి.

ఈ చిత్రంలో ‘ఈగ’ చేసే పోరాటాలు మరియు ఈగ చేసే చిత్ర విచిత్రమైన పనులు చిన్న పిల్లలను తెగ ఆకట్టుకుంటాయి. ఈ చిత్రం చూసిన తర్వాత చిన్న పిల్లలు ఈగ బొమ్మలు కావాలని తల్లితండ్రుల దగ్గర మారం చేయవచ్చు కావున అది చూసి మీరు ఆశర్యపోకండి.

ఈ చిత్ర క్లైమాక్స్ లో ఈగ సుదీప్ పై పగ తీర్చుకునే సన్నివేశాలు థియేటర్లలో సి సెంటర్ ప్రేక్షకులచేత ఈలలు మరియు చప్పట్లు కొట్టిస్తాయి. ఈ చిత్ర క్లైమాక్స్ అయిపోయిన తర్వాత వచ్చే ఎండింగ్ టైటిల్స్ అప్పుడు ‘ఇంద్ర’ సినిమాలో చిరంజీవి వేసిన వీణ స్టెప్స్ మరియు ‘యమదొంగ’ చిత్రంలో ఎన్.టి.ఆర్ చేసిన ఫ్లోర్ స్టెప్స్ ‘ఈగ’ చేత వేయించడం చాలా బాగుంది.

మైనస్ పాయింట్స్ :

ఈ చిత్ర మొదటి అర్ధ భాగంతో పోలిస్తే రెండవ అర్ధ భాగం కొంచెం తగ్గినట్టు అనిపిస్తుంది కానీ ఈ చిత్రం క్లైమాక్స్ కి చేరుకునేటప్పటికి మళ్ళీ అదే భావన వస్తుంది.

ఈ చిత్రంలో తెరకెక్కించిన అఘోరా సన్నివేశాల్ని మరియు మానవాతీత శక్తులను ఇంకొంచెం ఆసక్తికరంగా తీసుంటే బాగుండేది.

సాంకేతిక విభాగం :

ఈ చిత్రానికి కీరవాణి అందించిన సంగీతం అద్భుతంగా ఉంది మరియు ఈ చిత్రంలో వచ్చే కీలక సన్నివేశాలకు ఒకే రకమైన నేపధ్య సంగీతం కాకుండా వేరువేరు బాణీలతో ప్రేక్షకుడి ఆసక్తిని పెంచేలా నేపధ్య సంగీతాన్ని అందించారు. ఈ చిత్ర నేపధ్య సంగీతానికి గాను కీరవాణి గారికి హాట్సాఫ్ చెప్పకుండా ఉండలేము. ఈ చిత్ర ఎడిటింగ్ మరియు ఈ చిత్ర డైలాగ్స్ చాలా చక్కగా ఉన్నాయి. సెంథిల్ కుమార్ ఈ చిత్రానికి చాలా అద్భుతమైన సినిమాటోగ్రఫీ అందించారు.

ఈ చిత్రం కోసం అత్యాధునికంగా, హై క్వాలిటీతో చేసిన విజువల్ ఎఫ్ఫెక్ట్స్ ప్రేక్షకుడికి ఒక కొత్త అనుభూతిని కలిగిస్తాయి. ఈ చిత్రం చూస్తున్నప్పుడు ప్రేక్షకుల నుంచి వచ్చే స్పందన చూస్తే వారు పడ్డ కష్టానికి తగ్గ ఫలితం దక్కిందని ఎంతో సంతోషిస్తారు. రాజమౌళి మరియు అతని ఎస్ఎఫ్ఎక్స్ టీం ‘ఈగ’ విలన్ పగ మీద తీర్చుకొనే యాక్షన్ సన్నివేశాలను చాలా నమ్మశక్యంగా తెరకెక్కించడం అనేది ప్రత్యేక హైలైట్ గా చెప్పుకోవచ్చు.

తీర్పు :

ఇంతక ముందు చెప్పిన విధంగానే ‘ఈగ’ తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ గర్వించ దగ్గ చిత్రం అవుతుంది. ఈ చిత్రం ఎంతో వినోదాత్మకంగా, మంచి కామెడీ టైమింగ్ తో మరియు అన్ని రకాల ప్రేక్షకుల్ని ఆకట్టుకొనేలా ఉంది. ఎట్టి పరిస్తితుల్లోను ఈ చిత్రాన్ని చూడటం మిస్ అవ్వద్దు. ఎందుకంటే ఇలాంటి చిత్రాలు చాలా చాలా అరుదుగా వస్తుంటాయి.

123తెలుగు.కామ్ రేటింగ్ : 4/5

Click Here For ‘Eega’ English Review

మహేష్ ఎస్ కోనేరు

(అనువాదం – రాఘవ)

సంబంధిత సమాచారం

తాజా వార్తలు