సమీక్ష : కమీనా – విఫలమైన మరో రీమేక్

సమీక్ష : కమీనా – విఫలమైన మరో రీమేక్

Published on Sep 13, 2013 2:00 PM IST
Kameena విడుదల తేదీ13 సెప్టెంబర్ 2013
123తెలుగు.కామ్ రేటింగ్ : 2.25/5
దర్శకుడు : లక్ష్మీకాంత్ చెన్న 
నిర్మాత : వరప్రసాద్ రెడ్డి అరిమంద
సంగీతం : అగస్త్య
నటీనటులు : సాయి కుమార్, రోజా, లేఖ వాషింగ్టన్

బాలీవుడ్ లో 2007లో విడుదలై పెద్ద హిట్ అయిన ‘జానీ గద్దర్’ కి రీమేక్ గా తెరకెక్కిన మూవీ ‘కమీనా’. సాయి కుమార్, బ్రహ్మాజీ, రోజా, క్రిషి, లేఖ వాషింగ్టన్, సుబ్బరాజు ప్రధాన పాత్రలు పోషించిన ఈ సినిమాకి లక్ష్మీ కాంత్ చెన్న దర్శకుడిగా పరిచయమవుతున్నాడు. వరప్రసాద్ రెడ్డి నిర్మించిన ఈ సినిమాకి అగస్త్య మ్యూజిక్ అందించాడు. ఈ రోజు పేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా బాలీవుడ్ లో లాగా ఇక్కడి ప్రేక్షకుల్ని మెప్పించిందో లేదో ఇప్పుడు చూద్దాం…

కథ :

ధర్మ(సాయి కుమార్), శివ(సుబ్బరాజు), తేజ(ఆశిష్ విద్యార్థి), కైలాష్(బ్రహ్మాజీ), సిద్దార్థ్ (క్రిషి)లు మంచి స్నేహితులు మరియు బిజినెస్ పార్టనర్స్. వీరు ఐదుగురు కలిసి కొన్ని లీగల్ మరియు కొన్ని ఇల్లీగల్ పనులు చేస్తుంటారు. వీరందరికీ పోలీస్ ఆఫీసర్ అయిన కళ్యాణ్(రవిబాబు) 10కోట్లు విలువ చేసే ఒక మాల్ ని 5 కోట్లకే ఇచ్చేస్తాని ఒక ఆఫర్ ఇస్తాడు. డబ్బు ఇచ్చి ఆ మాల్ ని తీసుకు రావడం కోసం శివ కళ్యాణ్ దగ్గరికి బయలుదేరుతాడు. కానీ మార్గ మధ్యంలోనే అతను అనుమానాదాస్పదంగా చనిపోతాడు. ఆ తర్వాత వీరి గ్యాంగ్ లోని ఒక్కొక్కరు చనిపోతూ ఉంటారు. అసలు వాళ్ళందరూ ఎందుకు చనిపోతున్నారు? అసలు ఎవరు చంపుతున్నారు? చంపుతున్న వారు వీళ్ళలో ఒకరా లేక వేరే ఎవరన్నా చంపుతున్నారు? ఆ ఐదుగురిలో చివరికి ఒక్కరన్నా మిగిలారా? లేదా? అలాగే ఈ ఐదుగురికి వాసుకి(లేఖ వాషింగ్టన్) కి మధ్య ఉన్న సంబంధం ఏమిటి? అనేది మీరు తెరపైనే చూడాలి..

ప్లస్ పాయింట్స్ :

ఈ సినిమాలో చాలా మంది సీనియర్ నటీనటులు నటించారు. డైలాగ్ కింగ్ సాయి కుమార్ తన గ్యాంగ్ లోని అందరికీ అన్నగా కనిపించే పాత్రలో చాలా బాగా సరిపోయాడు. ఆయన నటన చాలా పవర్ఫుల్ గా అనిపిస్తుంది. అమాయకుడి పాత్రలో బ్రహ్మాజీ నటన బాగుంది. కాసేపు నవ్విస్తూ, కాసేపు సీరియస్ గా కనిపించే పాత్ర చేయడంలో ఆశిష్ విద్యార్థి సక్సెస్ అయ్యాడు. లేఖ వాషింగ్టన్ చాలా వరకు గ్లామర్ తో, కొంత వరకు నటనతో ఆకట్టుకుంది. సుబ్బరాజు, రోజా తమ పాత్రల పరిధిమేర నటించారు.

సినిమాలో ఇంటర్వెల్ ముందు వచ్చే 20 నిమిషాలు చాలా ఆసక్తికరంగా ఉంటుంది. పేషంట్ పాత్రలో తెలంగాణ శకుంతల కాసేపు నవ్వించగా, బ్రహ్మాజీ – రోజా మధ్య వచ్చే కొన్ని సన్నివేశాలు కామెడీగా ఉంటాయి.

మైనస్ పాయింట్స్ :

సినిమాలో కీలక పాత్ర పోషించిన నూతన నటుడు క్రిషి నటన ఆ పాత్రకి అస్సలు సెట్ అవ్వలేదు. ప్రతి సన్నివేశంలోనూ అతని హావభావాలు ఒకేలా ఉన్నాయి. చాలా కీలకమైన సన్నివేశాల్లో కూడా అతని హావ భావాల్లో ఎలాంటి మార్పు లేకపోవడం వల్ల ప్రేక్షకులకి కాస్త చిరాకు వస్తుంది. సినిమా మొదలైనప్పటి నుంచి ఇంటర్వల్ బ్లాక్ వచ్చేంతవరకు సినిమా చాలా నిధానంగా పోవాలంటే పోవాలి అన్నట్టుగా ముందుకు సాగుతుంది. ఇంటర్వల్ బ్లాక్ తో సినిమా కాస్త వేగం పుంజుకున్నా సినిమా సెకండాఫ్ లో అదే వేగాన్ని కంటిన్యూ చేయడంలో డైరెక్టర్ విఫలమయ్యాడు. సెకండాఫ్ మొత్తం చాలా ఊహాజనితంగా ఏ మాత్రం సస్పెన్స్ లేకుండా చాలా నీరసంగా ముందుకు సాగుతుంది.

సినిమాలో ఉన్న ఒక్క పాట కూడా సినిమాకి సహాయక పడకపోగా ప్రేక్షకుల సహనాన్ని పరీక్షిస్తాయి. ముఖ్యంగా క్లైమాక్స్ ముందు వచ్చే ఐటెం సాంగ్ చాలా చిరాకు తెప్పిస్తుంది. సినిమాలో కొన్ని పాత్రలకి సరైన ముగింపు ఇవ్వలేదు, ఉదాహరణకి రవిబాబు పాత్రని బతికినట్టు చూపిస్తారు కానీ ఆ పాత్రని మళ్ళీ ఉపయోగించుకోలేదు. సమీక్ష(రూబీ పరిహార్) పాత్ర పోషించిన అమ్మాయికి డబ్బింగ్ ఎవరు చెప్పారో కానీ వినడానికి మాత్రం చాలా ఫన్నీగా ఉంది.

సాంకేతిక విభాగం :

హిందీలో హిట్ అయిన కథని తీసుకొని తెలుగులో రీమేక్ చేద్దామని అనుకోని ఒరిజినల్ కథని శ్రీరామ్ రాఘవన్ అటు ఇటు తిప్పి కొన్ని మార్పులు చేర్పులు చేసినప్పటికీ సినిమాకి హెల్ప్ కాలేదు. ఇక్కడ చెప్పుకోవాల్సింది ఏమిటంటే ఒరిజినర్ వెర్షన్ ‘జానీ గద్దర్’ కి ఇతనే డైరెక్టర్ అవ్వడం విశేషం. దానికి తోడు డైరెక్టర్ లక్ష్మీకాంత్ చెన్న వీక్ స్క్రీన్ ప్లే, పెద్దగా ఆకట్టుకోలేని టేకింగ్ తోడవడంతో రీమేక్ ని చెడగొట్టారు అనే ఫీలింగ్ వస్తుంది. సినిమాటోగ్రఫీ బాగుంది.

ఎడిటర్ సినిమా మొదటి 40 నిమిషాలు మరియు సెకండాఫ్ పై చాలా కేర్ తీసుకోవలసింది. డైలాగ్స్ ఎక్కడో మచ్చుకి ఒకటి అరా బాగున్నాయి. అగస్త్య అందించిన పాటలు సినిమాకి ఏ మాత్రం సహాయపడకపోయినా బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ మాత్రం పరవాలేదనిపిస్తుంది. నిర్మాణ విలువలు మాత్రం చూడటానికి బాగా రిచ్ గా అనిపిస్తాయి.

తీర్పు :

‘కమీనా’ ప్రేక్షకుల్ని మెప్పించలేక విఫలమైన మరో రీమేక్. హిందీలో హిట్ అయిన పర్ఫెక్ట్ కథ, స్క్రీన్ ప్లే ని పెట్టుకొని కూడా రైటర్ డైరెక్టర్ సినిమాని ఆసక్తికరంగా తీయడంలో విఫలమవ్వడం బాధాకరమైన విషయం. సీనియర్ నటీనటుల నటన, ఇంటర్వల్ బ్లాక్ తప్ప చెప్పుకోవడానికి ఏమీ లేని ఈ సినిమాలో హీరో నటన, చిరాకు తెప్పించే పాటలు, వీక్ స్క్రీన్ ప్లే మరియు టేకింగ్ చెప్పదగిన మైనస్ పాయింట్స్. ఆసక్తికరంగాలేని థ్రిల్లర్ సినిమాలు ఏవీ ప్రేక్షకులను ఆకట్టుకోలేవు, ‘కమీనా’ పరిస్థితి కూడా అంతే..

123తెలుగు.కామ్ రేటింగ్ : 2.25/5

రాఘవ

CLICK HERE FOR ENGLISH REVIEW

సంబంధిత సమాచారం

తాజా వార్తలు