సమీక్ష : నేను నా ఫ్రెండ్స్ – యువతకు నచ్చే సినిమా.!

సమీక్ష : నేను నా ఫ్రెండ్స్ – యువతకు నచ్చే సినిమా.!

Published on Jun 20, 2014 12:30 PM IST
Nenu-Naa-Friends-review విడుదల తేదీ : 20 జూన్ 2014
123తెలుగు. కామ్ రేటింగ్ : 2.75/5
దర్శకత్వం :జీ.ఎస్. రావు
నిర్మాత : సాయి మేధా రమణ, మధుసూదన్ వోరుగంటి
సంగీతం : చిన్ని చరణ్
నటీనటులు : సందీప్, సిద్దార్థ్ వర్మ, రవి, హరీష్, అంజన..

ఈ ఏడాది ఇప్పటికే చాలా చిన్న సినిమాలు విడుదల అయ్యాయి, ఆ జాబితాలో ఈరోజు మరో సినిమా చేరింది. జీ.ఎస్. రావు దర్శకత్వం వహించిన ‘నేను నా ఫ్రెండ్స్’ అనే సినిమా ఈ రోజు ప్రేక్షకుల ముందు వచ్చింది. ప్రస్తుత యువతరం ఎలా ఉంది, కీలకమైన దశలో తీసుకునే నిర్ణయాలు తమ జీవితాలను ఎలా మారుస్తాయి? అనే మెసేజ్ తో వచ్చిన యూత్ ఫుల్ ఎంటర్టైనర్ ‘నేను నా ఫ్రెండ్స్’. చాలా మంది కొత్త నటీనటులతో తెరకెక్కిన ఈ సినిమా ఎలా ఉందో ఇప్పుడు చుద్దాం…

కథ:

ఓపెన్ చేస్తే ‘హైదరాబాద్ జూనియర్ కాలేజీ’, ప్రముఖ నటి జయసుధ వాయిస్ ఓవర్ తో ఈ కాలేజీ తన పాత జ్ఞాపకాలను గుర్తుచేసుకుంటుంది. ఈ కాలేజీలో చదువుతున్న కొంత మంది విద్యార్థుల కథే ఈ సినిమా. తేజ, యాదగిరి, రాజేష్ మరియు శ్రీను, ఈ నలుగురూ స్నేహితులు కాలేజీలో అల్లరి చేస్తూ అమ్మాయిల వెనుక తీరుగుతూ ఉంటారు. వీరిలో అందరూ ప్రేమలో పడుతారు, దీనివల్ల అందరికీ చేదు అనుభవాలే ఎదురవుతాయి. ఈ క్రమంలో అందరికీ ఏదో ఒక ఎదురుదెబ్బ తగులుతూనే ఉంటుంది.

తేజ (సందీప్) – సంధ్య (అంజనా), ఇద్దరికీ ఒక గొడవతో పరిచయం ఏర్పడి, అది నెమ్మదిగా ప్రేమగా మారుతుంది. అయితే కొన్ని అనుకోని పరిణామాల వలన తేజ, సంధ్యకు దూరంగా కాలేజీ వదిలి వెళ్ళిపోతాడు. అసలు తేజ ఎందుకు వెళ్ళిపోవలసి వచ్చింది? వీళ్ళిద్దరూ మళ్ళీ కలిసారా? మిగిలిన స్నేహితులు తాము అనుకున్న లక్ష్యాలను చేరుకోగలిగారా? ఈ ప్రశ్నలకు సమాధానం లభించాలంటే ఈ సినిమా చూడాల్సిందే.

ప్లస్ పాయింట్స్ :

ఈ సినిమాలో అందరూ కొత్త నటినటులే, అయినప్పటికీ వీరందరూ మంచి నటనను కనబరిచారు. సందీప్, సిద్దార్థ్ వర్మ, రవి, హరీష్ తమ పాత్రలకు న్యాయం చేసారు. కొత్తవారు అయినప్పటికీ నటనలో వైవిధ్యం కనబరిచారు. డ్యాన్సులు కూడా బాగా చేసారు. ఇక సందీప్ సరసన నటించిన అంజన అనే అమ్మాయి అటు అమాయకత్వంతో, ఇటు చిలిపితనంతో తన పాత్రకు ప్రాణం పోసింది. కామెడీతో పాటు ఎమోషనల్ సీన్స్ ను కూడా బాగా పండించింది.

సినిమాలో డబుల్ మీనింగ్ కామెడీ బాగుంది. ముఖ్యంగా ఫస్ట్ హాఫ్ అంతా ఎక్కడ బోర్ కొట్టకుండా కామెడీగా సాగిపోతుంది. సినిమాలో పరుచూరి బ్రదర్స్ రాసిన డైలాగులు యువతను ఆకట్టుకుంటాయి. ఇక ఈ సినిమాకు సంగీతం కూడా ప్లస్ అనే చెప్పుకోవాలి. సినిమా క్లైమాక్స్ ఎమోషనల్ గా బావుంది. అలాగే సినిమాలో హీరోస్ అనుకున్న లక్ష్యాలను ఎంతమంది రీచ్ అయ్యారు, ఎంతమంది రీచ్ అవ్వలేదు? దానికి గళ్ళ కారణాలేంటి? అనే విషయాలను బాగా చూపించారు.

మైనస్ పాయింట్స్ :

యూత్ ని టార్గెట్ చేసి తీసిన సినిమా కావడం వల్ల డైరెక్టర్ సినిమాలో డబుల్ మీనింగ్ డైలాగులకే ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చాడు. కానీ ఆ డైలాగ్స్ మోతాదు ఎక్కువ కావడం వల్ల ఒక స్టేజ్ లో ప్రేక్షకులకు చిరాకు వస్తుంది. సినిమాలో తరువాత ఏ సీన్ వస్తుంది అనేది ముందుగానే ఉహించొచ్చు. సెకండాఫ్ మీద ఆడియన్స్ కి ఆసక్తి పెంచాల్సిన ఇంటర్వల్ బ్లాక్ చాలా సింపుల్ గా ఉంది. ఇక సెకండ్ హాఫ్ చాలా వరకు స్లోగా ఉంటుంది. సెకండ్ హాఫ్ లో వచ్చే తేజ, సంధ్యల మధ్య వచ్చే సన్నివేశాలను బాగా సాగదీసినట్టుగా ఉంటాయి. రవి ఒక ఆంటీ దగ్గరికి వెళ్ళే సన్నివేశం చూసేవాళ్ళకి ఇబ్బంది గానే కాకుండా, యువతని పెడదారి పట్టించేలా ఉంది.

సాంకేతిక విభాగం :

సినిమా ఫస్ట్ హాఫ్ లో వచ్చే అన్ని పాటలు బాగున్నాయి. అన్నీ కాలేజీ సాంగ్స్ కావడంతో యువత బాగా కనెక్ట్ అవుతారు. సినిమాటోగ్రఫీ కూడా బాగుంది. సినిమా అందంగా చాలా రిచ్ గా కనిపిస్తుంది. ఎడిటింగ్ విషయానికి వస్తే, సెకండ్ హాఫ్ పై కాస్త శ్రద్ధ వహించి ఉంటే బాగుండేది. పరుచూరి బ్రదర్స్ రాసిన డైలాగులు, సినిమాకి ప్లస్ అయినప్పటికీ కొన్ని డబుల్ మీనింగ్ డైలాగులు ఇబ్బందిగా ఉంటాయి. కథ, కథనం – దర్శకత్వ బాధ్యతలు చేపట్టిన జిఎస్ రావు కథ కథనంలో పరవాలేదని పించుకున్నా డైరెక్టర్ గా యువతని మెప్పించడంలో మాత్రం సక్సెస్ అయ్యాడు.

తీర్పు:

జిఎస్ రావు మొదటి ప్రయత్నంగా చేసిన ‘నేను నా ఫ్రెండ్స్’ సినిమా కొంతవరకూ మారుతి తీసిన ‘ఈ రోజుల్లో’, ‘బస్ స్టాప్’ సినిమాల తరహాలో ఉంటుంది. డైరెక్టర్ అనుకున్న ఓ మంచి పాయింట్ ని భూతు చుట్టూ తిప్పి చెప్పాలనుకోవడం కాస్త ఇబ్బంది పెట్టినా చివర్లో మాత్రం అనుకున్న మెసేజ్ ని పర్ఫెక్ట్ గా ట్రాన్స్ఫర్ చేసాడు. నూతన నటీనటుల నటన, ఫస్ట్ హాఫ్ మరియు క్లైమాక్స్ సీన్ ఈ సినిమాకి ప్లస్ అయితే స్లోగా సాగే సెకండాఫ్, శృతి మించిన భూతు కామెడీ చెప్పదగిన మైనస్. యువతను ఆకట్టుకునే ఈ సినిమా మౌత్ పబ్లిసిటీ ద్వారా ఆడియన్స్ ని థియేటర్స్ కి రాబట్టుకునే అవకాశం ఉంది. అలాగే ఈ చిత్ర టీం కూడా పోస్ట్ రిలీజ్ ప్రమోషన్స్ చేసుకుంటే మరింత హెల్ప్ అయ్యే అవకాశం ఉంది.

123తెలుగు. కామ్ రేటింగ్ : 2.75/5

123తెలుగు టీం

CLICK HERE FOR ENGLISH REVIEW

సంబంధిత సమాచారం

తాజా వార్తలు