ఆడియో సమీక్ష : సర్దార్ గబ్బర్ సింగ్ – పవన్-దేవిశ్రీల ఎనర్జిటిక్ ఆల్బమ్!

ఆడియో సమీక్ష : సర్దార్ గబ్బర్ సింగ్ – పవన్-దేవిశ్రీల ఎనర్జిటిక్ ఆల్బమ్!

Published on Mar 21, 2016 1:30 PM IST

sarddar
‘సర్దార్ గబ్బర్ సింగ్’.. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా నటించిన ఈ సినిమా ప్రస్తుతం టాలీవుడ్‌లో హాట్ టాపిక్. ‘గబ్బర్ సింగ్’ క్యారెక్టరైజేషన్‌ను బేస్ చేసుకొని తెరకెక్కిన ఈ సినిమాకు బాబీ దర్శకత్వం వహించారు. ఇక దేవిశ్రీ ప్రసాద్ సంగీత దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమా ఆడియో కోసం ఫ్యాన్స్ ఎప్పట్నుంచే ఎదురుచూస్తూ వస్తున్నారు. ముఖ్యంగా వీరి కాంబినేషన్‌లో జల్సా, గబ్బర్ సింగ్, అత్తారింటికి దారేదీ లాంటి బ్లాక్‌బస్టర్ ఆడియోలు వచ్చి ఉండడంతో సర్దార్ గబ్బర్ సింగ్ ఆడియోపై భారీ అంచనాలున్నాయి. మరి నిన్న విడుదలైన ఈ ఆడియో ఆ అంచనాలను అందుకుందా? చూద్దాం..

71. పాట : సర్దార్ గబ్బర్ సింగ్
గాయనీ గాయకులూ : బెన్నీ డయాల్
సాహిత్యం : రామ జోగయ్య శాస్త్రి
‘గబ్బర్ సింగ్’ అంటూ 2012లో వచ్చిన సినిమాలో టైటిల్ సాంగ్ ఎంతటి సంచలనం సృష్టించిందో అందరికీ తెలిసిందే. ఇప్పుడు ఆ సినిమా క్యారెక్టర్‌నే బేస్ చేసుకొని వచ్చిన ‘సర్దార్ గబ్బర్ సింగ్‌’లోనూ టైటిల్ సాంగ్‌ను దేవీ అదే పంథాలో రూపొందించారు. ఇక మేజర్ ట్యూన్‌ కూడా గబ్బర్ సింగ్‌దే వాడుతూ దానికి ఇంకొంచెం స్టైలిష్ టచ్ ఇచ్చారు. అందుకు తగ్గట్టుగానే తన మ్యూజిక్‌లో రకరకాల ఇన్స్ట్రుమెంట్స్‌తో దేవిశ్రీ చేసిన ప్రయోగం బాగుంది. బెన్నీ డయాల్ మంచి ఎనర్జీతో పాడి పాటకు మంచి బూస్ట్ ఇచ్చారు. ఇక రామ జోగయ్య శాస్త్రి అందించిన సాహిత్యంలో ‘హర్స్ పవరుడు’ లాంటి ప్రయోగాలు అతి అనిపించినా, ఒక స్టార్ హీరో టైటిల్ సాంగ్‌కి సరిపడే అంశాలను మెండుగా ఉన్నాయి. గబ్బర్ సింగ్ టైటిల్ స్థాయిలో లేదన్నది మాత్రం వాస్తవం.

2. పాట : ఓ పిల్లా.. సుభానల్లా..
గాయనీ గాయకులూ : విజయ్ ప్రకాష్, శ్రేయా ఘోషల్
సాహిత్యం : అనంత శ్రీరామ్4

‘ఓ.. పిల్లా..’ అంటూ వచ్చే ఈ పాటకు విజయ్ ప్రకాష్, శ్రేయా ఘోషల్‌ల గాత్రం మేజర్ హైలైట్‌గా చెప్పుకోవచ్చు. దేవిశ్రీ ఇచ్చిన సింపుల్ మెలోడీ ట్యూన్‌కి వీరిద్దరి గాత్రం మంచి ఫీల్ తెచ్చిపెట్టింది. అనంత శ్రీరామ్ అందించిన సాహిత్యం కూడా చాలా బాగుంది. సర్దార్ క్యారెక్టర్‌కు లవ్ ఫీల్ తేవడమన్న ఆలోచనను పాటగా శ్రీరామ్ బాగా పట్టుకున్నట్లు కనిపిస్తుంది. ఇక దేవిశ్రీ ఈ పాటలో పెద్దగా ప్రయోగాలేవీ చేయకున్నా, ఫీల్‌ని మాత్రం తన ట్యూన్‌తో బాగా పట్టుకున్నారు. ఈ పాట వినగానే ఎక్కేస్తుందని తప్పకుండా చెప్పేయొచ్చు. విజువల్స్‌తో ఈ పాట స్థాయి మరింత పెరిగే అవకాశం ఉంది.

93. పాట : తౌబ తౌబా
గాయనీ గాయకులూ : ఎం.ఎం.మనసి, నకాశ్ అజిజ్
సాహిత్యం : అనంత శ్రీరామ్

హిందీ, తెలుగు పదాల కలయికతో సాగిపోయే ఈ పాట సినిమాలో వచ్చే స్పెషల్ ఐటమ్ సాంగ్‌గా చెప్పుకోవచ్చు. ఒక ఐటమ్ సాంగ్‌కు ఏయే అంశాలైతే అవసరమో అవన్నీ మెండుగా నింపుకున్న ఈ పాట ఈ తరహా పాటలను ఇష్టపడే వారికి విపరీతంగా నచ్చుతుంది. దేవిశ్రీ ప్రసాద్ అందించిన ట్యూన్, అనంత శ్రీరామ్ అందించిన సాహిత్యం.. రెండూ ఫన్నీగా ఉంటూ ఈ పాటను సరదా జోష్ పాటగా నిలిపాయి. ముఖ్యంగా దేవిశ్రీ మధ్యమధ్యలో రకరకాల వాయిద్యాలను కలుపుతూ చేసిన ప్రయోగం బాగుంది. మనసి, నకాశ్ అజిజ్‌ల గాత్రం కూడా పాట మూడ్‌కి తగ్గట్టుగా ఉంది. ఇలాంటి పాటను పవన్ కళ్యాణ్ లాంటి స్టార్ మేనరిజమ్స్, స్టెప్పులతో కలిపి చూస్తే అభిమానులకు పండగ వాతావరణం తెచ్చే పాటగా దీన్ని చెప్పుకోవచ్చు.

4. పాట : ఆడెవడన్నా.. ఈడెవడన్నా..
గాయకుడు : ఎం.ఎల్.ఆర్. కార్తికేయన్
సాహిత్యం : రామ జోగయ్య శాస్త్రి2

‘ఆడెవడన్నా.. ఈడెవడన్నా..’ అన్న ఈ బిట్ సాంగ్ సినిమాలో ఊపు తెచ్చే పతాక సన్నివేశాల్లో వచ్చే పాటగా కనిపిస్తోంది. ఈ పాటకు రామ జోగయ్య శాస్త్రి అందించిన సాహిత్యం అభిమానులకు కిక్కిచ్చేలా ఉంది. ‘ఆడెవడన్నా… ఈడెవడన్నా.. సర్దార్ అన్నకు అడ్డెవడన్నా..’ అంటూ సాగిపోయే వాక్యాలు అభిమానుల్లో ఉత్సాహం నింపేలా ఉన్నాయి. ఇటు పవర్ స్టార్ క్రేజ్‌ను, సినిమా మూడ్‍నూ రెండింటినీ కలుపుతూ రూపొందించిన ఈ పాట స్థాయిని కార్తికేయన్ చాలా ఎత్తుకి తీసుకెళ్ళాడు. దేవిశ్రీ వాడిన వాయిద్యాలు కూడా అదే స్థాయిలో ఉన్నాయి.

15. పాట : నీ చేప కళ్ళు..
గాయనీ గాయకులూ : సాగర్, చిన్మయి
సాహిత్యం : రామ జోగయ్య శాస్త్రి

‘నీ చేప కళ్ళు..’ అంటూ వచ్చే ఈ పాట దేవిశ్రీ కంపోజిషన్‌లోనే చాలాసార్లు విన్నట్టు కనిపించే పాట. వినగానే ఎక్కేసే ఈ పాట ఆల్బమ్‌లో ఓ ఫ్రెష్ ఫీల్ ఇచ్చే రొమాంటిక్ నంబర్‌గా చెప్పుకోవచ్చు. సాగర్, చిన్మయిల గాత్రం ఈ పాటకు ఒక ఫీల్‌ని తెచ్చిపెట్టింది. రామ జోగయ్య శాస్త్రి అందించిన సాహిత్యం కూడా ఆ ఫీల్‌ను కొనసాగించింది. ట్యూన్ పరంగా, ఇన్స్ట్రుమెంట్స్ వాడకం పరంగా కొత్తదనమేమీ చూపించకపోయినా వినగానే ఎక్కేలా దేవిశ్రీ ఈ పాటను రూపొందించారు. ఇక ఈ పాట విజువల్స్‌తో చూసినప్పుడు బాగా ఆకట్టుకుంటుందని ఆశించొచ్చు.

6. పాట : ఖాకీ చొక్కా
గాయనీ గాయకులూ : సింహా, మమతా శర్మ
సాహిత్యం : దేవిశ్రీ ప్రసాద్ 6

సర్దార్ గబ్బర్ సింగ్ ఆల్బమ్, ఖాకీ చొక్కా అనే ఓ మాస్ సాంగ్‌తో ముగుస్తుంది. బాబీ సింహా, మమతా శర్మల ఎనర్జిటిక్ సింగింగ్‌తో ఈ పాటకు ఫ్యాన్స్‌కి ఊపిచ్చేలా రూపొందించబడింది. ముఖ్యంగా ‘ఖాకీ చొక్కా వేసి నడిచొచ్చే మిస్టరో..’ అంటూ వచ్చే లైన్ పవన్ ఫ్యాన్స్‌కి విపరీతంగా నచ్చేలా ఉంటుందని చెప్పొచ్చు. సాహిత్యం కూడా అందుకు తగ్గట్టుగానే ఉంది. ఎక్కువగా సినిమాతో మాత్రమే కలిపి చూసే పాటగా దీన్ని చెప్పుకోవచ్చు. దేవిశ్రీ తనదైన మాస్ బీట్‌తో ఈ పాటకు ఎలాంటి అంశాలు అవసరమో అవన్నీ ఉండేలా చూసుకున్నారు.

తీర్పు :

పవన్ – దేవిశ్రీ ప్రసాద్‌ల కాంబినేషన్ అనేదే సూపర్ హిట్‌కు కేరాఫ్ అడ్రస్. అలాంటి కాంబినేషన్‌లో ‘గబ్బర్ సింగ్’ అనే క్యారెక్టర్‌కు కొనసాగింపుగా వచ్చిన సినిమా ‘సర్దార్ గబ్బర్ సింగ్‌’లో పాటలంటే ఏ స్థాయి అంచనాలు ఉంటాయో ప్రత్యేకించి చెప్పాల్సిన పనిలేదు. ఈ ఆల్బమ్‌, ఆ అంచనాలను పూర్తి స్థాయిలో అందుకునేలా లేకపోయినా, ఉన్నంతలో ఫ్యాన్స్‌కి, సినీ అభిమానులకు కిక్కిచ్చే పాటలతో ఆకట్టుకునేలానే ఉందని మాత్రం చెప్పొచ్చు. ఒక్కో పాట ఒక్కో సందర్భం నేపథ్యంలో వచ్చేట్టు కనిపిస్తోన్న ఈ ఆల్బమ్‌లో ‘ఓ పిల్లా’, ‘నీ చేపకళ్ళు..’, ‘సర్దార్’ టైటిల్ సాంగ్.. ఈ మూడు పాటలూ వినగానే ఎక్కేసేలా ఉన్నాయి. ఇకపోతే ‘ఆడెవడన్నా.. ఈడెవడన్నా..’ బిట్ సాంగ్ ఫ్యాన్స్‌కి బాగా నచ్చే పాట. మిగతా రెండు పాటలు ఫార్ములాలో సాగిపోయేవి. ఒక్కమాటలో చెప్పాలంటే దేవిశ్రీ-పవన్‍ల కాంబినేషన్‌లో వచ్చే ఆల్బమ్‌లో ఎలాంటి పాటలైతే ఉంటాయని ఆశిస్తామో, అవన్నీ ఉండేలా చూసుకొని దేవిశ్రీ ఓ ఎనర్జిటిక్ ఆల్బమ్ ఇచ్చాడనే చెప్పాలి.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు